No Caste Column: తెలంగాణలో నేటి నుంచి సమగ్ర కుటుంబ సర్వే, కులం, మతం వెల్లడించని వారికి ప్రత్యేక కాలమ్
No Caste Column: తెలంగాణలో నేటి నుంచి సమగ్ర కుటుంబ సర్వే చేపట్టనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర కుటుంబ సర్వేతో కులగణన ప్రభుత్వం చేపడుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు కులుం, మతం వివరాలను వెల్లడించడం ఇష్టం లేని వారి కోసం సర్వేలో ప్రత్యేక కాలమ్ అందుబాటులో ఉంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
No Caste Column: తెలంగాణలో కుల గణనలో భాగంగా నేటి నుంచి సమగ్ర కుటుంబ సర్వేకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సామాజిక న్యాయం సాధికారతలో భాగంగా కులగణన చేపడతామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. విద్య, ఉద్యోగాల్లో తగిన ప్రాధాన్యత, అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేయడమే లక్ష్యంగా కుల గణన చేపట్టాలని భావించింది. బుధవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కులగణనకు విస్తృత ఏర్పాట్లు చేసింది. ప్రభుత్వ ఉపాధ్యాయులు ఇంటింటికి వెళ్లి కుటుంబాల నుంచి వివరాలు సేకరిస్తారు. దేశానికి రోల్ మోడల్ అయ్యేలా తెలంగాణలో కుట గణన చేపడుతున్నట్టు కాంగ్రెస్ పార్టీ చెబుతోంది.
మరోవైపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేలో ప్రజల నుంచి వివరాలను సేకరించే దరఖాస్తుల్లో కులం, మతం వెల్లడించని వారి వివరాల నమోదుకు నో కాస్ట్, నో రిలిజియన్ కాలమ్ పెట్టాలంటూ దాఖలైన పిటిషనర్ల వినతులను పరిశీలించాలని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు మంగళ వారం ఆదేశించింది.
పిటిషనర్ వినతి పరిశీలించండి…
రాజ్యాంగంలోని ఆర్టికల్ 25(1) ప్రకారం మనస్సాక్షికి నచ్చిన మతాన్ని అనుసరించే స్వేచ్ఛ ప్రతి ఒక్కరికి ఉందని, దీన్ని దృష్టిలో ఉంచుకుని పిటిషనర్ విజ్ఞప్తిని పరిశీలించి, చట్టప్రకారం నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ అంశంపై ఏ నిర్ణయం తీసుకున్నారో పిటి షనర్‌కు కూడా సమాచారం అందించాలని ఆదేశించింది.
సమగ్ర కుటుంబ సర్వేలో కులం, మతం వెల్లడించని వారి వివరాలను ప్రత్యేకంగా సేకరించడానికి ఉన్న ఇబ్బందులేమిటో తెలియజేయాలని తెలంగాణ ప్రభుత్వ సాధారణ పరిపాలన, సామాజిక సంక్షేమ, వెనుకబడినవర్గాల సంక్షేమ శాఖల ముఖ్యకార్యదర్శులకు, బీసీ కమిషన్లకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల (సమగ్ర కుటుంబ) సర్వేలో కులం, మతం వివరాలు వెల్లడించకూడదని వారిని కూడా ప్రత్యేకంగా గణించేలా ప్రత్యేక కాలమ్ పెట్టాలని ఇచ్చిన వినతి పత్రాలను పరిగణనలోకి తీసుకోక పోవడాన్ని కుల నిర్మూలన సంఘం ప్రధాన కార్య దర్శి డీఎల్ కృష్ణతో పాటు మహమ్మద్ వహీద్ పిటిషన్లు దాఖలు చేశారు.
వినతి పత్రాలపై స్పందించని ప్రభుత్వం..
ఈ పిటిషన్లపై జస్టిస్ సూరేపల్లి నంద మంగ ళవారం విచారణ చేపట్టారు. ఈ పిటిషన్‌పై న్యాయ వాది డి.సురేష్‌కుమార్ వాదనలు వినిపించారు. కులం, మతం వివరాలను వెల్లడించని వారిని ప్రత్యేకంగా నమోదు చేసేలా ప్రత్యేక కాలమ్ పెట్టాలని అక్టోబర్ నెల 29న, నవంబర్ 1న అధికారులకు వినతిపత్రాలు సమర్పించినా ఎలాంటి చర్యలు తీసుకోనందున కోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు.
ఈ అంశంపై హైకోర్టు డివిజన్ బెంచ్ విచారణ కూడా ఇటీవల విచారణ చేపట్టిందని, కులం, మతం వివరాలు తప్పనిసరిగా వెల్లడించాల్సిన అవసరం లేదని జనాభా గణాంక కమిషన్ కూడా చెప్పిందని కోర్టుకు వివరించారు. అయితే కులం, మతం వద్దనుకునేవారి గణాంకాలు స్పష్టంగా లేనందువల్ల దానిపై ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని డివిజన్ బెంచ్ పేర్కొందన్నారు.
కులం, మతం వెల్లడించని వారి పిల్లలకు పాఠశాలల్లో ప్రవేశాలు నిరాకరించరా దంటూ గతంలో ఇదే హైకోర్టు తీర్పు వెలువరించిందని పిటిషనర్ గుర్తు చేశారు. నపంబర్ 6 నుంచి ప్రారంభించే సమగ్ర కుటుంబ సర్వేలో కులం, మతం వెల్లడించవద్ద నుకునేవారి వివరాలను ప్రత్యేకంగా సేక రించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఇలా సేకరించిన సమాచారాన్ని ఆన్లైన్లో అన్ని రికార్డుల్లో నమోదు చేయాలని, దీనికి సంబంధించిన మార్గదర్శకాలు జారీ చేసే విధంగా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని కోరారు.
డిసెంబర్ 4కు వాయిదా…
పిటిషనర్ వాదనలను విన్న న్యాయమూర్తి ప్రత్యేక కాలమ్ ఏర్పాటుకు సంబంధించి హైకోర్టు డివిజన్ బెంచ్ చేసిన వ్యాఖ్యలను, రాజ్యాంగం లోని అధికరణ 25(1)ను పరిగణనలోకి తీసుకొని ఉత్తర్వులు జారీ చేస్తున్నట్లు ప్రకటించారు. పిటిషనర్ విజ్ఞప్తిని పరిశీలించి చట్టప్రకారం నిర్ణయం తీసుకోవాలని, ఈ నిర్ణయాన్ని పిటిషనర్ కూడా తెలియజేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేశారు. దీనిపై పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వ శాఖలకు ఆదేశిస్తూ డిసెంబర్ 4కు విచారణ వాయిదా వేశారు.