Mlc Voters: ఉత్తర తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల నమోదు ప్రక్రియ పూర్తైంది. అందులో ఇప్పటివరకు 1 లక్షా 39 వేల మంది పట్టభద్రుల దరఖాస్తుల పరిశీలన పూర్తై ఓటర్లుగా నమోదయ్యారు. పరిశీలనలో 1,82,610 దరఖాస్తులున్నాయి. ఈనెల 23న ఓటర్ల జాబితా ముసాయిదాను ఎన్నికల కమిషన్ విడుదల చేయనుంది.
కరీంనగర్, నిజామాబాద్, అదిలాబాద్, మెదక్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి కీలకమైన ఓటరు నమోదు ప్రక్రియ నత్తనడకన సాగింది. సెప్టెంబర్ 30న మొదలైన ప్రక్రియ నవంబర్ 6వ తేదీన ముగిసింది. గడువు ముగిసే వరకు ఉమ్మడి నాలుగు జిల్లాల పరిధిలో పది లక్షల వరకు పట్టభద్రులు ఉంటారని అంచనా వేయగా కేవలం 336362 మంది పట్టభద్రులు ఓటర్ నమోదు కోసం దరఖాస్తు చేసుకున్నారు.
అంటే 33 శాతం మాత్రమే పట్టభద్రులు ఓటర్ గా నమోదు కావడానికి దరఖాస్తు చేసుకున్నట్లయింది. రాజకీయ పార్టీలన్నీ ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి లోలోన కసరత్తు చేస్తున్నాయే తప్ప గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదు విషయంలో తగిన శ్రద్ధ చూపడం లేదని తెలుస్తోంది. ప్రధానంగా ఎన్నికల కమిషన్ జారీ చేసిన ఓటరు ఐడీ కార్డు ఉంటేనే ఓటరుగా నమోదు చేసుకునే అవకాశం ఉండడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
సాధారణ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగం కోసం ఎన్నికల కమిషన్ 14 రకాల గుర్తింపు కార్డులను అనుమతిచ్చింది. ఆధార్ కార్డుతో పాటు పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సు, పాస్ పోర్టు, ఇతరాత్ర పలు కార్డులను అధికారికంగా ధృవీకరించింది. అత్యధికులకు ఆధార్ కార్డు అందుబాటులో ఉండటం.. లేకున్నా అప్పటికప్పుడు పొందే సదుపాయం కూడా అందుబాటులో ఉండటంతో ఇప్పటి వరకు సాధారణ ఎన్నికలకు సంబంధించి సమస్య ఏర్పడలేదు.
అయితే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక వరకు వచ్చే సరికి ఆధార్ కార్డుతోపాటు ఎన్నికల కమిషన్ జారీ చేసిన ఓటరు ఐడీ కార్డు తప్పనిసరి అని షరతు విధించింది. గడిచిన పలు ఎన్నికల్లో ఆధార్ కార్డుకే ప్రాధాన్యత ఉండటంతో ప్రతీ ఒక్కరూ దానికే పరిమితమయ్యారు. ఆధార్ కార్డు లేకముందు ఓటరు ఐడీ కార్డు తీసుకున్నవారు ఆధార్ కార్డు వచ్చాక ఓటరు ఐడీని విస్మరించారు. అసలు ఉందో లేదో కూడా తెలియక కొందరు.. ఎలా పొందాలో తెలియక మరికొందరు .. ఇప్పుడు ఓటరు ఐడీ కార్డు అవసరమా అని మరికొందరు ఓటరు నమోదుకు దూరంగా ఉండిపోయారని తెలుస్తోంది.
మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు గడువు పెంచాలని ఆల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ ఎమ్మెల్సీగా పోటీకి సిద్ధమైన వుట్కూరి నరేందర్ రెడ్డి కోరారు. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి వినతి పత్రం సమర్పించారు. 10 లక్షల మందికి పైగా పట్టభద్రులు ఉంటే కేవలం 33% మాత్రమే ఓటర్ గా నమోదుకు దరఖాస్తు చేసుకోవడం విచారకరమన్నారు. ఆశించిన స్థాయిలో ఓటర్ నమోదు కాని దృష్ట్యా ఓటర్ నమోదు గడువు పెంచాలని ప గడువు పెంచాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి నరేందర్ రెడ్డి విన్నవించారు.
మందకొడిగా జరిగిన ఓటర్ నమోదు ప్రక్రియను ఎన్నికల కమిషన్ గడువు పొడగిస్తుందా లేక ఇక్కడికే పరిమితం చేస్తుందా అన్న దానిపై ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ సాగుతుంది. గడువు పెంచి ఓటరు ఐడీ కార్డు మినహాయింపు ఇస్తే తప్ప గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన ఓటరు నమోదు ప్రక్రియ పుంజుకునే అవకాశం లేదని తెలుస్తోంది. దీనిపై అధికార కాంగ్రెస్, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ చొరవ చూపితే తప్ప ఎన్నికల కమిషన్ నిర్ణయాన్ని సడలించుకునే అవకాశం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
గడువులోపు దాఖలైన దరఖాస్తులను పరిశీలించిన మీదట నవంబర్ 23న ముసాయిదా ఓటరు జాబితాను ప్రకటించడం జరుగుతుందని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. ముసాయిదా జాబితాపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే నవంబర్ 23 నుండి డిసెంబర్ 9వ తేదీ వరకు తెలియజేయ వచ్చన్నారు. 2024 డిసెంబర్ 30 న నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్ జిల్లాలతో కూడిన గ్రాడ్యుయేట్స్, టీచర్స్ ఎమ్మెల్సీ నియోజకవర్గ స్థానాలకు సంబంధించిన తుది ఓటరు జాబితాను వెలువరించడం జరుగుతుందన్నారు.
ఓటర్ల జాబితాపై ఫిర్యాదులు అభ్యంతరాలు స్వీకరించు సమయంలో అర్హులైన వారు ఓటర్లు జాబితాలో తమ పేర్లను నమోదు చేసుకోవచ్చని ప్రకటించారు. ఇట్టి ప్రక్రియ నామినేషన్ చివరి తేది వరకు కూడా తమ పేర్లను ఓటర్ల జాబితాలో నమోదు చేసుకొనుటకు అవకాశం కల్పించబడుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు.
(రిపోర్టింగ్ కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)