Police Commando Killed: కరెంట్ ఉచ్చుకు కమాండో బలి.. ఏజెన్సీ ఏరియాల్లో వరుస ఘటనలు… ఒకే రోజు ఇద్దరి ప్రాణాల బలి…-commando victimized by current trap series of incidents in agency area ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Police Commando Killed: కరెంట్ ఉచ్చుకు కమాండో బలి.. ఏజెన్సీ ఏరియాల్లో వరుస ఘటనలు… ఒకే రోజు ఇద్దరి ప్రాణాల బలి…

Police Commando Killed: కరెంట్ ఉచ్చుకు కమాండో బలి.. ఏజెన్సీ ఏరియాల్లో వరుస ఘటనలు… ఒకే రోజు ఇద్దరి ప్రాణాల బలి…

HT Telugu Desk HT Telugu
Feb 13, 2024 07:52 AM IST

Police Commando Killed: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు రానుండగా.. ఇంతలోనే అక్కడ ఊహించని ప్రమాదం జరిగింది. కూంబింగ్ కోసం వచ్చిన ఓ గ్రేహౌండ్స్ కమాండో కరెంట్ ఉచ్చుకు బలయ్యాడు.

వేట గాళ్ల ఉచ్చుకు బలైన పోలీస్ కమాండో
వేట గాళ్ల ఉచ్చుకు బలైన పోలీస్ కమాండో

Police Commando Killed: వన్యమృగాల వేటకు అమర్చిన ఉచ్చుకు పోలీస్ కానిస్టేబుల్ బలవడంతో అధికారులు ఉలిక్కిపడ్డారు. ఈ ఘటన కాటారం మండలం నస్తూరిపల్లి అటవీ ప్రాంతంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు, మిగతా నేతలు మంగళవారం కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు రానున్నారు. ఈ నేపథ్యంలో గ్రే హౌండ్స్ బలగాలు భూపాలపల్లి, ములుగు అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా రక్షణ చర్యలు చేపడుతున్నారు.

అదే అటవీ ప్రాంతంలో కొంతమంది వేటగాళ్లు అటవీ జంతువుల కోసం కరెంట్ ఉచ్చులు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో కూంబింగ్ లో ఉన్న గ్రేహౌండ్స్ కమాండో అడే ప్రవీణ్(31)కు ఆ కరెంట్ ఉచ్చులు తగిలి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

ఆదిలాబాద్ జిల్లా నార్నూరు మండలం రాజోల్ గూడ గ్రామానికి చెందిన ప్రవీణ్.. 2012 బ్యాచ్ కు ఎంపికై గ్రేహౌండ్స్ కమాండోగా పని చేస్తున్నాడు. కాగా మృతుడు ప్రవీణ్ కు భార్య లత, ఇద్దరు కుమారులు హర్ష, వివాన్ ఉన్నారు.

మరో ఘటనలో యువకుడు

ములుగు జిల్లా పస్రా పీఎస్ పరిధిలో కూడా మరో యువకుడు వేటగాళ్ల ఉచ్చుకు బలయ్యాడు. పస్రా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం దుంపలగూడెం గ్రామానికి చెందిన పిండి రమేష్ (28) తన స్నేహితుడు అనిల్ తో కలిసి తప్పిపోయిన తమ గొర్రెను వెతికేందుకు ఆదివారం రాత్రి సమీపంలోని ఆటవీ ప్రాంతానికి వెళ్లారు.

గుర్తు తెలియని వ్యక్తులు వణ్యప్రాణుల వేటకు అక్కడ విద్యుత్తు తీగలు అమర్చగా.. వాటిని గమనించకుండా రమేశ్ అలాగే ముందుకెళ్లాడు. దీంతో కరెంట్ కనెక్షన్ ఉన్న ఆ తీగలు తగిలి రమేశ్ అక్కడే ప్రాణాలు కోల్పోయాడు. దీంతో మృతుని తండ్రి సాంబయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు వివరించారు.

అనంతరం పోస్టుమార్టం నిమిత్తం రమేష్ మృతదేహాన్ని ములుగు ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఇదిలాఉంటే రమేశ్‌కు ఆరు నెలల కిందటే వివాహం జరగగా.. మృతుడి తల్లిదండ్రులు, భార్య రోధించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది.

అటవీ ప్రాంతంలో ఉచ్చుల భయం

జయశంకర్ భూపాలపల్లి, ములుగు అటవీ ప్రాంతాల్లో వణ్యప్రాణుల వేటగాళ్లు కరెంట్ తీగలతో ఉచ్చులు పెడుతున్నారు. దీంతో వాటిని గమనించక వెళ్లిన అమాయక ప్రజలు కూడా ప్రాణాలు కోల్పోతున్నారు. కొద్దిరోజుల కిందట పొలానికి నీళ్లు పెట్టేందుకు వెళ్లిన ఓ రైతు కూడా ఇలాగే వేటగాళ్లు అమర్చిన కరెంట్ తీగలు తగిలి మృత్యువాతపడ్డారు.

పెగడపల్లి గ్రామానికి చెందిన మీనుగు సాంబయ్య(42) దాదాపు రెండెకరాల భూమి ఉండగా.. అందులో వరి సాగు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే పొలానికి నీళ్లు పెట్టేందుకు తన భార్యతో కలిసి వెళ్లాడు. సాంబయ్య పొలానికి కొద్దిదూరంలో కొందరు దుండగులు అడవి జంతువుల కోసం ఉచ్చులు బిగించారు.

వాటికి కరెంట్ సరఫరా అయ్యేలా ఏర్పాట్లు చేయగా.. సాంబయ్య వాటిని గమనించకుండా అలాగే ముందుకు వెళ్లాడు. దీంతో ఆయనకు కరెంట్ ఉచ్చులు తగలడంతో విద్యుదాఘాతానికి గురయ్యాడు. కరెంట్ షాక్ తో సాంబయ్యకు తీవ్ర గాయాలు కాగా 108 అంబులెన్స్ లో వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే ఆయన మృతి చెందాడు.

మృతుడికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉండగా.. సాంబయ్య మృతితో ఆ కుటుంబం రోడ్డున పడ్డట్టయ్యింది. కాగా ఈ ఘటనలో పోలీసులు ఐదుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ఇలా తరచూ వేటగాళ్ల ఉచ్చులకు తరచూ అమాయకుల ప్రాణాలు గాలిలో కలుస్తుండటంతో మళ్లీమళ్లీ ఇలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

కరెంట్ తీగలు పెడితే కేసులు నమోదు చేస్తాం: ములుగు ఎస్పీ

పంట చేలలో వన్యప్రాణులను వేటాడేందుకు విద్యుత్తు తీగలను అమర్చితే కేసులు నమోదు చేయడంతో పాటు కఠిన చర్యలు తీసుకుంటామని ములుగు ఎస్పీ శబరీష్ హెచ్చరించారు. పంట పొలాల చుట్టూ విద్యుత్తు తీగలు ఏర్పాటు చేయొద్దని, వాటి వల్ల మనుషులతో పాటు మూగజీవులు మృత్యువాత పడుతున్నారన్నారు.

విద్యుత్తు తీగలను అక్రమంగా అమర్చిన వారి జాబితా స్థానిక పోలీసుల ద్వారా తెప్పించి విచారణ జరిపిస్తామని, దోషులుగా తేలిన వారికి కఠినమైన శిక్షలు పడేలా చేస్తామని హెచ్చరించారు. ఎవరైనా అక్రమంగా కరెంట్లు వైర్లు తగిలించినట్లు తెలిస్తే వెంటనే స్థానిక పోలీసులకు లేదా.. డయల్ 100 కు కాల్ చేసి సమాచారం అందించాలని ఎస్పీ శబరీష్ సూచించారు.

(హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)

Whats_app_banner