Warangal Fraud: ఆన్ లైన్ ఎగ్జామినేషన్ సెంటర్ పేరిట బురిడీ! పోలీసులకు ఫిర్యాదు చేసిన కాలేజీ యాజమాన్యం-college management files police complaint over online examination center scam ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Warangal Fraud: ఆన్ లైన్ ఎగ్జామినేషన్ సెంటర్ పేరిట బురిడీ! పోలీసులకు ఫిర్యాదు చేసిన కాలేజీ యాజమాన్యం

Warangal Fraud: ఆన్ లైన్ ఎగ్జామినేషన్ సెంటర్ పేరిట బురిడీ! పోలీసులకు ఫిర్యాదు చేసిన కాలేజీ యాజమాన్యం

Bolleddu Sarath Chandra HT Telugu
Jan 09, 2025 08:45 AM IST

Warangal Fraud: సైబర్ నేరగాళ్లు రోజుకో తీరుగా రెచ్చి పోతున్నారు. అవతలి వ్యక్తులను ఈజీగా బోల్తా కొట్టిస్తూ క్షణాల్లో లక్షలు దోచేస్తున్నారు. ఇన్నిరోజులు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ల ఆధారంగా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోగా,తాజాగా మెయిల్స్ పంపించి బురిడీ కొట్టించిన ఘటన వరంగల్ నగరంలో వెలుగులోకి వచ్చింది.

సైబర్‌ మోసగాళ్ల బారిన పడిన వరంగల్ ఇంజనీరింగ్ కాలేజీ
సైబర్‌ మోసగాళ్ల బారిన పడిన వరంగల్ ఇంజనీరింగ్ కాలేజీ

Warangal Fraud: ఆన్ లైన్ ఎగ్జామ్ సెంటర్ ఏర్పాటు పేరున వరంగల్ నగర శివారులోని ఓ ప్రముఖ కాలేజీని సైబర్ కేటుగాళ్లు మోసం చేయగా.. సంబంధిత కాలేజీ ప్రిన్సిపల్ మంగళవారం సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

yearly horoscope entry point

వరంగల్ నగర శివారులోని ఓ ప్రముఖ కాలేజీ మెయిల్ ఐడీకి 2024 సెప్టెంబర్ 18న గవర్నమెంట్ జాబ్స్, ఇతర ఆన్ లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసేందుకు సెంటర్ ఏర్పాటు కోసం బెంగళూరుకు చెందిన ఓ ప్రముఖ కంపెనీ నుంచి మెయిల్ వచ్చింది.

బెంగళూరు కు చెందిన సంస్థ, కాలేజీతో కలిసి సంయుక్తంగా ఆన్ లైన్ ఎగ్జామ్స్ నిర్వహించేందుకు అంగీకారం కోసం మెయిల్ పంపించగా.. ఇక్కడి కాలేజీ యాజమాన్యం అందుకు ఓకే చెప్పింది. దీంతో అవతలి వైపు నుంచి పరీక్షల నిర్వహణ కోసం అప్లికేషన్ ఫామ్ ను మెయిల్ ద్వారానే పంపించగా.. దానిని కాలేజీ యాజమాన్యం ఫిల్ చేసి తిరిగి అదే మెయిల్ ఐడీకి పంపించేశారు.

ఆ తరువాత ఎగ్జామినేషన్ సెంటర్ అగ్రీమెంట్ కోసం డాక్యుమెంట్స్ పంపించాల్సిందిగా కోరడంతో కాలేజీ యాజమాన్యం ఆ పని కూడా పూర్తి చేసింది.

విడతల వారీగా లక్షల్లో దోపిడీ

కాలేజీ యాజమాన్యం ఎగ్జామినేషన్ సెంటర్ నిర్వహణకు అగ్రీమెంట్ కాపీలు పంపించగా. రిజిస్ట్రేషన్ కోసం రిఫండబుల్ ఫీజు పేరున రూ.42,600 పంపాల్సిందిగా అవతలి నుంచి రిప్లై వచ్చింది. దీంతో వారు చెప్పిన ప్రకారం కాలేజీ యాజమాన్యం అమౌంట్ పంపించింది. ఆ తరువాత కాలేజీ బిల్డింగ్ ప్లాన్, ఓనర్ షిప్ డాక్యుమెంట్స్, కరెంట్ బిల్, ఇంటర్నెట్ కనెక్షన్ వివరాలు సేకరించి, గత డిసెంబర్ నెలలో ఎగ్జామినేషన్ ఎక్విప్ మెంట్ సంయుక్తంగా కొనుగోలు చేయాల్సి ఉంటుందని, అందుకు రూ.2.95 లక్షలు పంపించాల్సిందిగా కోరడంతో కాలేజీ అకౌంట్ నుంచి పంపించారు.

ఆ తరువాత అదే నెలలో ఎక్విప్ మెంట్, ఫర్నిచర్ ట్రాన్స్ పోర్ట్ కోసం రూ.79 వేలు , ఫర్నిచర్ ఇన్సురెన్స్ పేరున రూ.2.6 లక్షలు పంపించాల్సిందిగా మళ్లీ మెయిల్ చేయడంతో ఆ మొత్తాన్ని కూడా వారు చెప్పిన అకౌంట్ కు బదిలీ చేశారు. ఇంతవరకు బాగానే ఉండగా, ఆ తరువాత సంబంధిత కంపెనీ నుంచి కాలేజీ యాజమాన్యానికి ఎలాంటి ఫోన్ కానీ, మెయిల్ కానీ రాలేదు.

ఇదివరకు కాలేజీ యాజమాన్యానికి కాల్స్ వచ్చిన ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసినా కలవకపోవడంతో సంబంధిత వివరాలు జోడించి ఈ నెల 6వ తేదీన పోలీసులకు కాలేజీ ప్రిన్సిపల్ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు బీఎన్ఎస్ 318(4), ఐటీ యాక్ట్ 66డీ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)

Whats_app_banner