కాలేజీల బంద్ మళ్లీ వాయిదా.. ప్రభుత్వ హామీతో వెనక్కు తగ్గిన ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు!-college bandh postponed again in telangana because private college owners back down after government assurances ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  కాలేజీల బంద్ మళ్లీ వాయిదా.. ప్రభుత్వ హామీతో వెనక్కు తగ్గిన ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు!

కాలేజీల బంద్ మళ్లీ వాయిదా.. ప్రభుత్వ హామీతో వెనక్కు తగ్గిన ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు!

Anand Sai HT Telugu

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదల కోసం కాలేజీలు బంద్‌కు పిలుపును ఇచ్చిన యాజమాన్యాలు మళ్లీ వెనక్కు తగ్గాయి. ప్రభుత్వ హామీతో బంద్‌ను వాయిదా వేశాయి.

ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణ ప్రభుత్వం దీపావళి నాటికి పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలలో రూ.300 కోట్లు విడుదల చేస్తామని హామీ ఇచ్చింది. ఆ తర్వాత ఫెడరేషన్‌ ఆఫ్‌ అసోసియేషన్స్‌ ఆఫ్‌ తెలంగాణ హయ్యర్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌(FATHI) ప్రైవేట్ కళాశాలల రాష్ట్రవ్యాప్త సమ్మెను వాయిదా వేసింది.

చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న బకాయిలపై చర్చించడానికి ఫాతి కోర్ కమిటీ ఈ వారం ప్రారంభంలో ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డిని కలిసింది. పండుగకు ముందు కనీసం రూ. 300 కోట్లు విడుదల చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని, కళాశాల యాజమాన్యాలు తమ ఆందోళనను వాయిదా వేయాలని నరేంద్ రెడ్డి కోరారు.

సమావేశం తరువాత, ఫాతి కార్యనిర్వాహక మండలి అక్టోబర్ 13న జరగాల్సిన సమ్మె, బంద్‌ను వాయిదా వేస్తూ ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించింది. గడువును దీపావళి తర్వాత రోజు అంటే అక్టోబర్ 23 వరకు పొడిగించింది. 'అప్పటికి ప్రభుత్వం వాగ్దానం చేసిన నిధులను విడుదల చేయడంలో విఫలమైతే, జనరల్ బాడీ తిరిగి సమావేశమై కొత్త కార్యాచరణను ప్రకటిస్తుంది.' అని తీర్మానంలో పేర్కొన్నారు.

దసరాకు ముందే రూ.200 కోట్లు విడుదల చేసినప్పటికీ, దాదాపు 70 మైనారిటీ, జనరల్ కళాశాలలకు ఇంకా బకాయిలు అందలేదని ఫాతి పేర్కొంది. నిధుల పూర్తి పంపిణీని నిర్ధారించడానికి ఉప ముఖ్యమంత్రి, ప్రధాన కార్యదర్శి, ఆర్థిక కార్యదర్శితో తదుపరి చర్చలు జరుపుతామని సమాఖ్య తెలిపింది.

2021–22 నుండి 2024–25 వరకు అప్డేట్ చేసిన బకాయి వివరాలను ఫాతి ప్రధాన కార్యాలయానికి, రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించాలని ఇంజనీరింగ్, ఫార్మసీ, బీఈడీ, డిగ్రీ, ఎంబీఏ, ఎంసీఏ, లా, ఆర్కిటెక్చర్, నర్సింగ్, పారామెడికల్ కళాశాలలను అసోసియేషన్ ఆదేశించింది. 'కచ్చితమైన డేటా పెండింగ్ బకాయిలను పూర్తిగా చెల్లించడానికి మాకు సహాయపడుతుంది.' అని ప్రకటనలో పేర్కొంది.

2023–24 బకాయిల్లో దాదాపు సగం మాత్రమే దసరాకు ముందే చెల్లించారని, సంస్థలు నిర్వహణ ఖర్చులతో ఇబ్బంది పడుతున్నాయని FATHI ఆందోళన వ్యక్తం చేసింది. ప్రైవేట్ ఉన్నత విద్యా సంస్థల ఆర్థిక స్థిరత్వం కోసం అన్ని విద్యా సంవత్సరాల నుండి 2021–22, 2022–23, 2023-24 బకాయిలను పూర్తిగా చెల్లించాలని సమాఖ్య డిమాండ్ చేసింది. ఈ నెల 22 లోపు రూ.300 కోట్లు విడుదల చేయాలని, లేకుంటే 23వ తేదీ నుంచి కాలేజీల బంద్‌కు పిలుపునిస్తామని FATHI ప్రతినిధులు ప్రకటించారు.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.