TG Indiramma Housing Scheme : మొదటి విడతలో సిద్దిపేట జిల్లాకు 2,543 ఇందిరమ్మ ఇండ్లు : కలెక్టర్
TG Indiramma Housing Scheme : సిద్దిపేట జిల్లాలో 26 మండలాలు ఉన్నాయి. ఒక్క మండలంలో ఒక్కో గ్రామాన్ని ఎంపిక చేసి.. ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు అందజేశారు. వీరు ఇండ్ల పనులను ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ మనుచౌదరి విజ్ఞప్తి చేశారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంపై పాలనాధికారి సమీక్ష నిర్వహించారు.

ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు తీసుకున్న లబ్ధిదారులు.. వెంటనే పనులు ప్రారంభించాలని.. కలెక్టర్ మనుచౌదరి స్పష్టం చేశారు. జనవరి 26వ తేదిన మండలాల వారిగా ఎంపిక చేసిన గ్రామాల్లో.. ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీ చేశామని చెప్పారు. 2,543 మందికి ఇళ్లు మంజూరయ్యాయని వెల్లడించారు. గ్రామాల్లో స్పెషల్ ఆఫీసర్లు పనులను పర్యవేక్షించాలని ఆదేశించారు.
మాడల్ హౌస్‌లను చూపించండి..
ఎంపీడీవోల ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శలు, ఇతర అధికారులు లబ్ధిదారులతో మాట్లాడాలని కలెక్టర్ సూచించారు. వారికి ఏవైనా సందేహాలు ఉంటే నివృత్తి చేయాలని స్పష్టం చేశారు. లబ్ధిదారుల స్థలంలో ఇంజినీరింగ్ అధికారులు మాడల్ హౌస్‌లను చూపించాలని సూచించారు. సందేహాలు నివృత్తి చేసి పనులు ప్రారంభం అయ్యేలా చూడాలని స్పష్టం చేశారు.
అప్పుడు డబ్బులు పడతాయి..
పనుల ఆధారంగా ఇంజినీరింగ్ అధికారులు ఎంబీలు రికార్డ్ చేసి అప్‌లోడ్ చేయాలని కలెక్టర్ మనుచౌదరి ఆదేశించారు. అప్పుడే లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని వివరించారు. ఈ మొత్తం ప్రక్రియకు ఎంపీడీవోలు నోడల్ అధికారులుగా వ్యవహరిస్తారని స్పష్టం చేశారు. ప్రతీ మండలంలో ఒక మాడల్ హౌస్ నిర్మించాలని, అందుకోసం స్థలాన్ని గుర్తించాలని కలెక్టర్ ఆదేశించారు.
పనులు పూర్తి చేయాలి..
జిల్లాల్లో పెండింగ్‌లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సబ్ సెంటర్ల నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. స్థలాల విషయంలో ఇబ్బందులు ఉంటే ఆర్డీవోలను సంప్రదించాలని సూచించారు. వైద్యారోగ్య శాఖ, ఇంజినీరింగ్ శాఖ అధికారులు సమన్వయంతో పనులు జరిగాలే చూడాలన్నారు. ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.
పదో తరగతి ఫలితాలపై..
పదో తరగతి పరీక్షలపై జిల్లా అధికారులు దృష్టిపెట్టారు. అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ హాస్టళ్లు, పాఠశాలలను సందర్శిస్తూ.. విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు. ఉత్తమ ఫలితాలు సాధించేలా విద్యార్థులను ప్రోత్సహిస్తున్నారు. అన్ని వసతి గహాల్లో ఉన్న పదో తరగతి విద్యార్థులకు నిపుణులతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించేలా చేస్తున్నారు. పరీక్షలు రాసే విధానం, ప్రిపరేషన్‌కు సంబంధించి నిపుణులు చిట్కాలు చెబుతున్నారు.