Coca-Cola Investments: తెలంగాణలో కోకా కోల సంస్థ పెట్టుబడులు రెట్టింపు.. కొత్తగా రూ. 647 కోట్ల ఇన్వెస్ట్‌మెంట్
Coca-Cola Investments in Telangana:తెలంగాణ రాష్ట్రంలో తన పెట్టుబడులను రెట్టింపు చేసింది కోకా కోల సంస్థ.తాజాగా సిద్దిపేట జిల్లాలోని తన ప్లాంట్‌లో అదనంగా 647 కోట్ల పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించింది.
Coca-Cola Investments in Telangana: తెలంగాణ రాష్ట్రంలో కోకా కోల సంస్థ భారీ ఎత్తున పెట్టుబడులను ప్రకటించింది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో విస్తృతంగా కార్యకలాపాలను విస్తరించేందుకు పెట్టుబడులు పెడుతున్న సంస్థ తాజాగా తన అదనపు పెట్టుబడుల ప్రణాళికలను ప్రకటించింది. పరిశ్రమల శాఖ మంత్రి తారక రామారావు తో అమెరికాలోని న్యూయార్క్ నగరంలో జరిగిన సమావేశంలో సంస్థ తన ప్రణాళికలను తెలియజేసింది.
కోకాకోల సంస్థ ఉపాధ్యక్షులు జేమ్స్ మేక్ గ్రివి మంత్రి కేటీఆర్ తో సమావేశమయ్యారు. తమ సంస్థకు ప్రపంచంలో మూడవ అతిపెద్ద మార్కెట్ భారతదేశం అని, భారత్లో తమ కార్యకలాపాలను, వ్యాపారాన్ని మరింతగా విస్తరించే వ్యూహంతో ముందుకు పోతున్నామని తెలిపారు. అందులో భాగంగా తెలంగాణలో తమ పెట్టుబడులను రెట్టింపు చేస్తున్నట్లు ఆయన మంత్రి కేటీఆర్ కి తెలియజేశారు. ఇందులో భాగంగా అమీన్పూర్ వద్ద సంస్థకు ఉన్న భారీ బాటిలింగ్ ప్లాంట్ విస్తరణ కోసం గతంలోనే 100 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టమన్నారు. దీనికి అదనంగా సిద్దిపేట జిల్లాలో 1000 కోట్ల రూపాయలతో నూతన బాటిలింగ్ ప్లాంట్ నిర్మాణం కోసం ఏప్రిల్ నెల 22 లో తెలంగాణ ప్రభుత్వంతో ఒక ఎం ఓ యు కూడా కుదుర్చుకున్నామని తెలిపారు. ఈ మేరకు అక్కడ సంస్థ నిర్మాణ కార్యకలాపాలను కొనసాగిస్తుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందిన సహకారం, తమ ప్లాంట్ నిర్మాణంలో వేగం, ఈ ప్రాంతంలో వ్యాపార వృద్దిని దృష్టిలో ఉంచుకొని కోకా కోలా సంస్థ అదనంగా మరో 647 కోట్ల రూపాయలను ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న సిద్దిపేట జిల్లా ప్లాంట్ లో పెట్టేందుకు ముందుకు వచ్చింది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఈ ప్లాంట్ డిసెంబర్ 24 నాటికి పూర్తి అవుతుందని తెలిపింది.
దీంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో తాజాగా రెండవ నూతన తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు సంసిద్ధంగా ఉన్నామని తెలిపింది. ఇందులో భాగంగా కరీంనగర్/ వరంగల్ ప్రాంతంలో ఈ తయారీ కేంద్రం వచ్చే అవకాశం ఉందని సంస్థ తెలియజేసింది. ప్రతిపాదిత నూతన తయారీ ప్లాంట్ పెట్టుబడితో కలుపుకుంటే తెలంగాణ రాష్ట్రంలో కోకాకోల సంస్థ దాదాపుగా 2500 కోట్లకు పైగా పెట్టుబడులను తెలంగాణ రాష్ట్రంలో పెట్టినట్లు అవుతుందని కోకాకోల సంస్థ మంత్రి కేటీఆర్ కు తెలిపింది. ఈ మధ్యకాలంలో సంస్థ తరఫున అత్యంత తక్కువ కాలంలో వేగంగా విస్తరించిన ప్రాంతంగా తెలంగాణ నిలుస్తుందని సంస్థ ఉపాధ్యక్షులు తెలియజేశారు.
తెలంగాణ రాష్ట్రానికి అన్ని రంగాల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయనిడానికి తాజాగా కోకా కోల సంస్థ ప్రకటించిన అదనపు పెట్టుబడి సాక్ష్యంగా నిలుస్తుందని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ తెలిపారు. ఒకవైపు ఐటీ మరియు ఐటీ అనుబంధ రంగాలతో పాటు, ఫార్మా, లైఫ్ సైన్సెస్ అనుబంధ రంగాలే కాకుండా, ఫుడ్ ప్రాసెసింగ్, ఏరోస్పేస్ డిఫెన్స్ వంటి రంగాల్లోనూ భారీగా పెట్టుబడులను తెలంగాణ ఆకర్షించిందన్నారు. తాజాగా అంతర్జాతీయ దిగ్గజ సంస్థ కోకా కోల తెలంగాణ రాష్ట్రంలో తన పెట్టుబడులను రెట్టింపు చేసేందుకు నిర్ణయం తీసుకోవడం పట్ల ఆయన సంస్థకు ధన్యవాదాలు తెలిపారు. త్వరలోనే సంస్థ ప్రతిపాదిస్తున్న నూతన రెండవ తయారీ కేంద్రానికి అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందజేస్తామని కోకాకోల సంస్థ ఉపాధ్యక్షులు మేక్ గ్రీవికి తెలియజేశారు.