తాడిచెర్లలో బొగ్గు కుంభకోణం.. కేసీఆర్ సర్కారుపై పొన్నం సంచలన ఆరోపణలు-coal scam in tadicherla ponnam sensational allegations against kcr government ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Coal Scam In Tadicherla Ponnam Sensational Allegations Against Kcr Government

తాడిచెర్లలో బొగ్గు కుంభకోణం.. కేసీఆర్ సర్కారుపై పొన్నం సంచలన ఆరోపణలు

HT Telugu Desk HT Telugu
Dec 12, 2022 01:31 PM IST

తాడిచెర్ల బొగ్గు గనిని ప్రయివేటుకు కేటాయించడంలో భారీ అక్రమాలు చోటు చేసుకున్నాయని కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వమే దోపిడీకి ద్వారం తెరిచిందని ఆరోపించారు.

తాడిచెర్ల బొగ్గు గని కేటాయింపుల్లో కుంభకోణం జరిగిందని ఆరోపించిన పొన్నం
తాడిచెర్ల బొగ్గు గని కేటాయింపుల్లో కుంభకోణం జరిగిందని ఆరోపించిన పొన్నం

తాడిచెర్ల బొగ్గు గనిలో బొగ్గు వెలికితీత పనులు సింగరేణికి కేటాయించకుండా అక్రమంగా ప్రయివేటు కంపెనీకి కేటాయించి రాష్ట్ర ప్రభుత్వం దోపిడీకి ద్వారాలు తెరిచిందని కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ సంచలన ఆరోపణలు చేశారు. సోమవారం ఆయన గాంధీభవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 

ట్రెండింగ్ వార్తలు

‘ఉమ్మడి రాష్ట్రంలో రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తాడిచెర్ల బొగ్గు గనిని సింగరేణికి కేటాయించారు. తెలంగాణ ఏర్పడ్డాక మాత్రం బొగ్గు వెలికితీత పనులను సింగరేణికి కేటాయించలేదు. తాడిచెర్ల గనిలో బొగ్గు వెలికితీత కాంట్రాక్టును చేపట్టబోమని లెటర్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం సింగరేణిపై ఒత్తిడి తెచ్చింది. దాని ఫలితంగా తాడిచెర్ల బొగ్గుగని టీఎస్‌ జెన్‌కో‌కు దక్కింది. అయితే ఆ గనిని ఏఎంఆర్ అనే కంపెనీకి 25 ఏళ్లకు కాంట్రాక్టు ఇచ్చారు. ఈ ఏఎంఆర్ కంపెనీ ఎవరి బినామీ? తాడిచర్ల 2లో బొగ్గు వెలికితీత కాంట్రాక్టును ఏఎంఆర్‌కు ఇవ్వాలని సింగరేణి యాజమాన్యంపై ఒత్తిడి తెచ్చింది నిజం కాదా?’ అని పొన్నం ప్రశ్నించారు.

తాడిచెర్ల బొగ్గు గని వేలం వేసేటప్పుడు అక్కడి బొగ్గు నాణ్యత, నిల్వలను తక్కువ చేసి తప్పుడు రిపోర్టులు చూపించారని, ఆ తరువాత దానిని ఏఎంఆర్ కంపెనీకి కట్టబెట్టారని ఆరోపించారు. సింగరేణి చేతిలో ఉండాల్సిన బంగారం లాంటి ఈ బొగ్గు గనిని స్వప్రయోజనాల కోసం ప్రయివేటుకు దారాదత్తం చేశారని మండిపడ్డారు. 

తాడిచెర్ల బ్లాక్‌లో గ్రేడ్ జీ7, గ్రేడ్ జీ8 బొగ్గు ఉత్పత్తి అవుతోందని, ప్రతి టన్నుకు రూ. 3 వేల నుంచి రూ. 3,500 వరకు చెల్లించేలా జెన్‌కో ఒప్పందం చేసుకుందని వివరించారు. అయితే ఇక్కడ పుష్కలంగా బొగ్గు నిల్వలు ఉండడంతో పాటు ఏ గ్రేడ్ క్వాలిటీ బొగ్గు ఉన్నట్టు మూడేళ్ల తరువాత బయట పడిందని వివరించారు. 

2005లో వైఎస్సార్ హయాంలో తాడిచెర్ల బొగ్గు గనిని జెన్కోకు కేటాయించగా, బొగ్గు ఉత్పత్తి ప్రక్రియ చేపట్టేందుకు పీఎల్ఆర్ కంపెనీకి కాంట్రాక్టు ఇచ్చారని, వై.ఎస్. మరణానంతరం రోశయ్య ముఖ్యమంత్రి అయ్యాక ఇది వెలుగులోకి వచ్చిందని వివరించారు.

పీఎల్‌ఆర్ కంపెనీకి కాంట్రాక్టు ఇవ్వడాన్ని 2011లో కార్మిక సంఘాలు చేపట్టిన ఆందోళన కారణంగా తాడిచెర్ల బొగ్గు బ్లాక్‌లో పీఎల్ఆర్ బదులు సింగరేణి సంస్థే తవ్వకాలు చేపట్టాలని సింగరేణి సీఎండీకి లేఖ రాశారని పొన్నం వివరించారు.

అయితే టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక కేసీఆర్ చక్రం తిప్పారని, రోశయ్య సర్కారు నిర్ణయానికి వ్యతిరేకంగా, సింగరేణి సంస్థకు కాకుండా తిరిగి జెన్‌కో సంస్థకు ఈ బ్లాక్ అప్పగించేలా చేశారని పొన్నం ఆరోపించారు. జెన్ కో సంస్థ నుంచి ఏఎంఆర్ అనే సంస్థకు 30 ఏళ్ల కాలపరిమితితో బొగ్గు తవ్వే కాంట్రాక్టును కట్టబెట్టారని ఆరోపించారు. 2017 నుంచి ఇక్కడి బొగ్గును భూపాలపల్లి కేటీపీపీకి సప్లయ్ చేస్తున్నారని వివరించారు.

కాంట్రాక్టు ప్రకారం తాడిచెర్ల ఓపెన్ కాస్ట్ బొగ్గు గని నుంచి కన్వేయర్ బెల్ట్ ద్వారా 18 కి.మీ. దూరంలో ఉండే చెల్పూరులోని కేటీపీపీకి ఏడాదికి 25 లక్షల టన్నుల బొగ్గును తరలించాల్సి ఉందని వివరించారు. కోల్ మైనింగ్ చేపట్టాల్సిన జెన్ కో సంస్థ దానికి తగినట్టుగా ఉద్యోగులను నియమించుకోవాల్సి ఉందని, తగిన యంత్రాలను సమకూర్చుకోవాల్సి ఉందని వివరించారు.

కానీ ఇవేవీ చేయకుండానే జెన్ కో 30 ఏళ్ల పాటు బొగ్గు తవ్వి తమకు సప్లయ్ చేసేలా ఏఎంఆర్ అనే ప్రయివేటు సంస్థతో ఒప్పందం చేసుకోవడం విచిత్రంగా ఉందని పొన్నం ఆరోపించారు. కన్వేయర్ బెల్ట్‌కు బదులుగా 60 కి.మీ. రోడ్డు మార్గంలో బొగ్గు సప్లయి చేయడం మరింత అవినీతి, బొగ్గు అక్రమ రవాణాకు దారితీసినట్టయిందని వివరించారు. ఏటా 25 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు సప్లయి చేసే  సామర్థ్యం లేకపోయినా 30 ఏళ్లకు కాంట్రాక్టు ఇచ్చి టీఆర్ఎస్ ప్రభుత్వం దోపిడీకి ద్వారాలు తెరిచిందని మండిపడ్డారు.

సింగరేణి భాగస్వామిగా ఉన్న కేంద్ర ప్రభుత్వం వెంటనే దీనిపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఈ కుంభకోణంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి కూడా వాటా ఉన్నట్టుగా పరిగణించాల్సి వస్తుందని విమర్శించారు.

IPL_Entry_Point

టాపిక్