CMR College Issue : సీఎంఆర్ కాలేజీలో సీక్రెట్ కెమెరాలు.. మూడు నెలల్లో 300 ప్రైవేట్ వీడియోలు?
CMR College Issue : సీఎంఆర్ కాలేజీ హాస్టల్ బాత్‌రూమ్‌లో వీడియోలు తీశారంటూ.. విద్యార్ధినులు ఆందోళనకు దిగారు. ఈ వ్యవహారంపై మహిళా కమిషన్ సీరియస్ అయ్యింది. ఈ ఘటనపై దర్యాప్తును త్వరగా పూర్తి చేయాలని పోలీసులను ఆదేశించింది. ఈ ఘటనపై పోలీసులు కాస్త క్లారిటీ ఇచ్చారు.
మేడ్చల్ జిల్లాలోని సీఎంఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ బాలికల హాస్టల్‌లో.. వాష్‌రూమ్‌లలో రహస్య కెమెరాలు సంచలనంగా మారాయి. ఈ ఘటనను తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ సీరియస్‌గా తీసుకుంది. ఛైర్‌పర్సన్ శారద సైబరాబాద్ పోలీసు కమిషనర్‌కు లేఖ రాశారు. ఈ ఘటనపై వేగంగా దర్యాప్తు చేయాలని కోరారు. వీలైనంత త్వరగా కమిషన్‌కు నివేదిక సమర్పించాలని స్పష్టం చేశారు.
300 ప్రైవేట్ వీడియోలు..
గత మూడు నెలల్లో దాదాపు 300 ప్రైవేట్ వీడియోలు రహస్యంగా రికార్డ్ చేశారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. వాష్‌రూమ్‌లలో రహస్య కెమెరాలను అమర్చినందుకు బాధ్యులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఏబీవీపీ సభ్యులతో కలిసి విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. ఈ ఇష్యూలో హాస్టల్ సిబ్బంది ప్రమేయం ఉండవచ్చని విద్యార్థులు అనుమానిస్తున్నారు. కళాశాల యాజమాన్యం ఈ విషయాన్ని తొక్కేయడానికి ప్రయత్నించిందని, బయటకు చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని విద్యార్థులను హెచ్చరించిందనే ఆరోపణలు ఉన్నాయి.
మల్లారెడ్డిదే బాధ్యత..
విద్యార్ధినుల బాత్‌రూమ్ వీడియోలు సామాజిక మాధ్యమాల్లోకి వస్తే.. మల్లారెడ్డి బాధ్యత వహించాల్సి ఉంటుందని విద్యార్థులు హెచ్చరించారు. విద్యార్థుల నిరసన నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. హాస్టల్‌లో పనిచేస్తున్న, భవనం సమీపంలో ఉంటున్న ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఎలాంటి గొడవలు జరగకుండా పోలీసు సిబ్బందిని మోహరించారు.
పోలీసులు ఏమన్నారు..
'సీఎంఆర్ కాలేజ్ గర్ల్స్ హాస్టల్ పరిసరాలను పరిశీలించాం. ఈ ఘటనలో యాజమాన్యం నిర్లక్ష్యం క్లియర్‌గా కనపడుతోంది. ఇద్దరి ఫింగర్ ప్రింట్స్ లభించాయి. మెస్‌లో పనిచేసే వ్యక్తులు మాత్రమే లోపలికి వచ్చే అవకాశం ఉంది. 5 మందిని అదుపులోకి తీసుకున్నాం. వారికి చెందిన 12 సెల్ ఫోన్లను సీజ్ చేశాం. నిన్నటి నుండి మా టెక్నికల్ టీం ఫోన్లని అనేక విధాలుగా పరిశీలించారు. వాటిలో ఎలాంటి వీడియోలు, ఫోటోలు లభించలేదు' అని ఓ పోలీస్ అధికారి వివరించారు.
వీడియోలు లభించలేదు..
'ఒకవేళ డిలీట్ చేసి ఉంటారని ఫోన్లన్నీ ల్యాబ్‌కి పంపించాం. ఇప్పటివరకు అయితే ఎలాంటి వీడియోలు లభించలేదు. విద్యార్థులు భయాందోళనకు గురికావద్దు. ఇప్పటివరకు యాజమాన్యం నుండి ఎటువంటి ఫిర్యాదు రాలేదు. పోలీసులు కూడా యాజమాన్యంతో మాట్లాడదాం అనుకుంటే.. అందుబాటులోకి రావడం లేదు. హాస్టల్ పరిసరాలు పరిశీలించిన తర్వాత.. సెక్యూరిటీ మెజర్మెంట్స్ యాజమాన్యం పట్టించుకోలేదని అపించింది. విద్యార్థుల స్టేట్మెంట్ రికార్డు చేశాం. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం. కనీసం ఇక్కడ విద్యార్థులు ఆందోళన చేస్తుంటే భద్రత కావాలని కూడా పోలీసులను యాజమాన్యం అడగలేదు. దర్యాప్తులో భాగంగా యాజమాన్యంపై చర్యలు తీసుకుంటాం' అని పోలీసులు చెబుతున్నారు.