తెలంగాణ పోడు భూముల్లో ఇక ఇందిర సౌర గిరి జల వికాసం.. నాగర్‌ కర్నూల్‌ జిల్లాల్లో ప్రారంభించనున్న సీఎం రేవంత్‌ రెడ్డి-cm revanth will launch indira soura giri jala vikasam in nagar kurnool ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  తెలంగాణ పోడు భూముల్లో ఇక ఇందిర సౌర గిరి జల వికాసం.. నాగర్‌ కర్నూల్‌ జిల్లాల్లో ప్రారంభించనున్న సీఎం రేవంత్‌ రెడ్డి

తెలంగాణ పోడు భూముల్లో ఇక ఇందిర సౌర గిరి జల వికాసం.. నాగర్‌ కర్నూల్‌ జిల్లాల్లో ప్రారంభించనున్న సీఎం రేవంత్‌ రెడ్డి

Sarath Chandra.B HT Telugu

తెలంగాణలో పోడు భూముల్ని వ్యవసాయానికి అనువుగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. గిరిజన రైతులకు మేలు చేకూర్చేలా ఇందిర సౌర గిరి జల వికాస పథకాన్ని నాగర్‌ కర్నూల్ జిల్లాలో ముఖ్యమంత్రి లాంఛనంగా ప్రారంభించనున్నారు.

తెలంగాణలో పోడు రైతులకు ప్రత్యేక పథకం ప్రారంభించనున్న సీఎం

తెలంగాణలో బీడు వారుతున్న పోడు భూముకు జల కళను తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రవేశ పెడుతోంది. గిరిజన ప్రాంతాల్లోని దాదాపు రెండు లక్షల ఎకరాల పోడు భూములను వ్యవసాయానికి అనువుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఇందిరి సౌర గిరి జల వికాసం పథకంతో సోలార్ పంప్‌ సెట్లను రైతులకు అందిస్తారు.

పోడు భూముల్లో సాగును ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రవేశ పెట్టింది. నాగర్ కర్నూలు జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభిస్తారు. పోడు వ్యవసాయంలో మెరుగైన ఉత్పాదకత సాధించేలా ఇందిర సౌర గిరి జల వికాసం పథకాన్ని అమలు చేస్తారు.

ఈ పథకం ద్వారా గిరిజన రైతులకు నీటి లభ్యత అందుబాటులోకి వస్తుంది. వచ్చే ఐదేళ్లలో 2.10లక్షల ఎకరాల పోడు భూములకు సోలార్ పంప్‌ సెట్లను అందిస్తారు. ఈ పథకాన్ని అమలు చేయడం ద్వారా గిరిజన రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ఉపకరిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.

ఇందిరి సౌర గిరి జల వికాసం పథకానికి వచ్చే ఐదేళ్లలో రూ.12,600 కోట్లు ఖర్చు చేస్తారు. నాగర్‌ కర్నూల్ జిల్లా మన్ననూరు ఐటీడీఏ పరిధిలోని అమ్రాబాద్ మండలం మాచారంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సోమవారం ఈ పథకాన్ని ప్రారంభింస్తారు.

ఈ ఏడాది గిరిజన సౌర జల వికాసం పథకాన్ని అమలుకు సంబంధించిన కార్యాచరణను తెలంగాణ గిరిజన సహకార ఆర్థిక సంస్థ ఖరారు చేసింది. మే 25వరకు మండలాల వారీగా అర్హులైన గిరిజన రైతులను గుర్తించారు.జూన్‌ 10వ తేదీ వరకు క్షేత్ర స్థాయిలో పరిశీలన జరిపి భూగర్భ జలాల సర్వే, తదితర పనుల్ని గిరిజన సంక్షేమశాఖ చేపడుతుంది.

తొలి ఏడాది 10వేల మంది రైతులకు ప్రయోజనం

జూన్ 25 నుంచి వచ్చే ఏడాది మార్చి 31వ తేదీ వరకు భూముల అభివృద్ధి, బోరుబావుల తవ్వకం, సోలార్‌ పంపు సెట్ల ఏర్పాటు తదితర పనుల్ని నిర్వహిస్తారు. తొలి ఏడాది 10వేల మంది రైతులకు చెందిన 27,184 ఎకరాలను సాగులోకి తీసుకువచ్చేందుకు రూ.600కోట్లు ఖర్చు చేయనున్నారు.

2025-26లో 10వేల మంది రైతుల్ని ఈ పథకంలో ఎంపిక చేస్తారు. రూ.600కోట్లతో 27,184 ఎకరాలను సాకులోకి తీసుకు వస్తారు. 2026-27 నుంచి 2029 -30 వరకు ఏటా 50వేల మంది రైతులకు ఈ పథకం వర్తింప చేస్తారు. ప్రతి ఏడాది 1,43, 204మంది పథకానికి ఎంపిక చేస్తారు. ఏటా రూ.3వేల కోట్లు ఖర్చు చేస్తారు. ఐదేళ్లలో పథకం ద్వారా రూ.12,600కోట్లు ఖర్చుతో 6లక్షల ఎకరాల్లో 2.10లక్షల మంది గిరిజన రైతులకు లబ్ది కలుగుతుంది.

తెలంగాణలో రాష్ట్రంలో అటవీ హక్కుల చట్టం కింద 6.69 లక్షల ఎకరాల విస్తీర్ణంలో 2.30 లక్షల మంది గిరిజన రైతులకు పోడు పట్టాలు ప్రభుత్వం మంజూరు చేసింది. విద్యుత్తు సౌకర్యం లేని 6 లక్షల ఎకరాలకు ఇందిర సౌర గిరి జల వికాసం పథకాన్ని వర్తింపజేస్తారు.

గిరిజన రైతుకు రెండున్నర ఎకరాల కన్నా ఎక్కువ భూమి ఉంటే సింగిల్ యూనిట్, అంతకు తక్కువగా ఉంటే.. సమీప రైతులను కలిపి బోర్‌వెల్‌ యూజర్ గ్రూపుగా ఏర్పాటు చేస్తారు.

మే 25వరకుఅర్హుల గుర్తింపు…

మండలాల వారీగా సోలార్‌ పంప్‌ సెట్ల పథకానికి అర్హులైన గిరిజన రైతులను మే 25 వరకు గుర్తిస్తారు. జూన్‌ 10 వరకు క్షేత్రస్థాయిలో పనుల పరిశీలన, భూగర్భ జలాల సర్వే, ఇతర అంచనాలు రూపొందించాల్సి ఉంటుంది. జూన్‌ 26 నుంచి 2026 మార్చి 31 వరకు భూముల అభివృద్ధి, బోరుబావుల తవ్వకం, సోలార్‌ పంపుసెట్లను అధికారులు ఏర్పాటు చేస్తారు. తర్వాత ఉద్యాన పంటల అభివృద్ధి పనులు చేస్తారు.

2.10 లక్షల మంది రైతుల 6 లక్షల ఎకరాల భూములకు ఇప్పటికీ విద్యుత్తు సదుపాయం లేదు. వీటికి పూర్తి రాయితీతో సోలార్‌ పంపుసెట్లు ఏర్పాటుచేసి, నీరందిస్తారు. తెలంగాణలో పోడు భూములు అధికంగా ఉన్న భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, ఖమ్మం, ములుగు, నిర్మల్, కామారెడ్డి, నల్గొండ, వరంగల్, నిజామాబాద్, జయశంకర్‌ భూపాలపల్లి, మంచిర్యాల, నాగర్‌కర్నూల్‌లను పథకంలో ప్రత్యేకంగా గుర్తించారు. తక్కువ విస్తీర్ణంలో పోడు భూములున్న జిల్లాలను సమీపంలోని ఇతర జిల్లాలతో కలిపి 5 నోడల్‌ జిల్లాలుగా ప్రకటించారు.

శరత్‌ చంద్ర హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగు న్యూస్‌ ఎడిటర్‌గా ఉన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వివిధ హోదాల్లో 2001 నుంచి పని చేస్తున్నారు. జర్నలిజంలో నాగార్జున యూనివర్శిటీ నుంచి పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. గతంలొ ఈనాడు, ఎన్‌టీవీ, టీవీ9, హెచ్‌ఎంటీవీ, టీవీ5లలో వివిధ హోదాలలో విజయవాడ, హైదరాబాద్‌, ఢిల్లీలలో పనిచేశారు. 2022లో హెచ్‌టీ తెలుగులో చేరారు. ఇక్కడ ఏపీ తెలంగాణకు సంబంధించిన వర్తమాన అంశాలు, బ్యూరోక్రసీ, రాజకీయ వార్తలు, క్రైమ్ వార్తలను అందిస్తారు.

సంబంధిత కథనం