Telangana Assembly : ఆన్‌లైన్‌ గేమ్స్, బెట్టింగ్స్ వ్యవహారంపై 'సిట్' ఏర్పాటు… త్వరలోనే చట్ట సవరణ - సీఎం రేవంత్ ప్రకటన-cm revanth said that sit formed to probe online games and betting in telangana ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana Assembly : ఆన్‌లైన్‌ గేమ్స్, బెట్టింగ్స్ వ్యవహారంపై 'సిట్' ఏర్పాటు… త్వరలోనే చట్ట సవరణ - సీఎం రేవంత్ ప్రకటన

Telangana Assembly : ఆన్‌లైన్‌ గేమ్స్, బెట్టింగ్స్ వ్యవహారంపై 'సిట్' ఏర్పాటు… త్వరలోనే చట్ట సవరణ - సీఎం రేవంత్ ప్రకటన

ఆన్ లైన్ యాప్స్, బెట్టింగ్స్ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఈ తరహా గేమ్స్ పై కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పారు. ప్రత్యేకంగా సిట్ ఏర్పాటు చేయబోతున్నామని చెప్పారు. త్వరలోనే చట్టాన్ని కూడా సవరించబోతున్నట్లు పేర్కొన్నారు.

సీఎం రేవంత్ రెడ్డి

ఆన్ లైన్ యాప్స్, ఆన్ లైన్ రమ్మీ, ఆన్ లైన్ బెట్టింగ్స్, డిజిటల్ బెట్టింగ్ గేమ్స్ పై కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ఇవాళ శాసనసభలో మాట్లాడిన ఆయన… కేవలం ప్రచారం కల్పించేవారిని విచారించడం ద్వారా ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించదని వ్యాఖ్యానించారు. పక్క రాష్ట్రాలు, పక్క దేశాల్లో కూడా విచారణ చేయాల్సి ఉంటుందన్నారు. అందుకే అవసరమైన చర్యలు తీసుకునేందుకు స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్ ను నియమించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ప్రకటించారు.

చట్ట సవరణ చేస్తాం - సీఎం రేవంత్

“ఎవరైనా ప్రత్యక్షంగా, పరోక్షంగా బెట్టింగ్ యాప్స్ ను ప్రోత్సహించినా, నిర్వహణలో భాగస్వాములైనా ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది. అవసరమైతే చట్ట సవరణ చేసి శిక్షను పెంచాల్సిన అవసరం ఉంది. వ్యసనాలకు తెలంగాణలో తావులేదు.గతంలో బెట్టింగ్ వ్యవహారాలను నియంత్రించేందుకు చట్టం తీసుకువచ్చారు. ఇందులో శిక్ష కాలం సమయం తక్కువగా ఉంది. వచ్చే శాసనసభ సమావేశాల్లో చట్ట సవరణ చేస్తాం” అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

అంత అసహనం ఎందుకు..?

“రాష్ట్రంలో శాంతి భద్రతలు లోపించాయని కొందరు మాట్లాడుతున్నారు. ఏ చిన్నసంఘటన జరిగినా రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. నడిబజారులో న్యాయవాద దంపతులను నరికి చంపితే ఆనాటి ప్రభుత్వం స్పందించలేదు. ఆనాటి వెటర్నరీ డాక్టర్ అత్యాచార ఘటన విషయంలో ఏం జరిగిందో అందరికీ తెలుసు. బాధితులపై సానుభూతితో ఉండి…నేరగాళ్లపై కఠినంగా వ్యవహరించాలి. కానీ ఇలాంటి ఆరోపణలు చేసి ప్రభుత్వంపై దురుదేశాన్ని ఆపాదిస్తున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా శాంతిభద్రతలు క్షీణించాయని దురుద్దేశంతో మాట్లాడుతున్నారు. తెలంగాణ అభివృద్ధిపై యాసిడ్ దాడులు చేస్తున్న పరిస్థితి ఉంది. రాష్ట్రాన్ని దివాళా తీయించి తెలంగాణ ప్రతిష్టను మసకబార్చేలా కుట్రలు చేస్తున్నారు. ఈ కుట్రలను తెలంగాణ సమాజం సహించదు.అధికారం లేకపోతే క్షణం కూడా ఉండలేమన్న తరహాలో వారు వ్యవహరిస్తున్నారు. ఇది తెలంగాణ సమాజానికి ఏ రకంగా మేలు చేస్తుంది? 15 నెలలుగా శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పాలన సాగిస్తున్నాం. అప్పుడే మీకు అంత అసహనం ఎందుకు..?” అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

“ప్రతిపక్ష నాయకుడిగా జానారెడ్డి లాంటి వారిని ఆదర్శంగా తీసుకోండి.. సూచనలు ఇవ్వండి. మీరు హడావిడి చేసినంత మాత్రాన ఎన్నికలు రావు.. ఎన్నికలు వచ్చేది 2028లోనే. బీఆర్ఎస్ లో వాళ్ల మధ్య పోటీ రాష్ట్ర ప్రభుత్వానికి తల నొప్పిగా మారుతోంది. ముఖ్యమంత్రిగా నా దగ్గరకు తీసుకొచ్చిన సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేస్తా. గజ్వేల్ శాసనసభ్యుడు వచ్చినా.. ఆ నియోజకవర్గ సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేస్తాం. మొన్న పద్మారావు గారు తన నియోజకవర్గంలో సమస్యలపై కలిశారు… వెంటనే ఆదేశాలు ఇచ్చాం. మమ్మల్ని బదనాం చేస్తే మీరు మంచి వారు కాలేరు. మేం వివక్ష చూపం.. వివక్ష మా విధానం కాదు. డాంబికాలతో మేం బడ్జెట్ ను ప్రవేశపెట్టలేదు 95 శాతం మేం ప్రవేశ పెట్టిన బడ్జెట్ నిజం కాబోతుంది” అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

ఆ భూమితో HCUకు సంబంధం లేదు….

“25 ఏండ్ల క్రితం బిల్లీరావుకు గచ్చిబౌలిలో భూమిని కేటాయించారు. ఆ భూమితో సెంట్రల్ యూనివర్సిటీకి ఎలాంటి సంబంధం లేదు. ఇప్పటి వరకు బిల్లీరావు నుంచి భూమిని వెనక్కు తీసుకోలేదు. ఆ భూమిలో గుంట నక్కలు ఉన్నాయి. ఆ గుంట నక్కలకి గుణపాఠం చెప్తాం. ఓపెన్ ఆక్షన్ ద్వారా పెట్టుబడుల కోసం అంతర్జాతీయ సంస్థలకు ఇవ్వాలని ముందుకు వస్తే.. అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులకు తీసుకొచ్చేందుకు అక్కడ విస్తరణ చేయాలనుకుంటున్నాం ” అని సీఎం ప్రకటన చేశారు.

“హరీష్ రావును సూటిగా అడుగుతున్నా… రీజినల్ రింగ్ రోడ్డు నిర్మించాలా వద్దా? రేడియల్ రోడ్లు వేయాలా వద్దా? ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయాలా వద్దా? కొండపోచమ్మ సాగర్ నుంచి ఫామ్ హౌస్ లకు డైరెక్టు కాలువలు తీసుకెళ్లింది ఎవరు? ప్రతీది అడ్డుకోవాలనే కుట్ర ఏ రకంగా మంచిది? మేం తెలంగాణకు ప్రాతినిధ్యం వహిస్తున్నాం.. మొత్తం తెలంగాణ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నాం. మీ కుట్రలు, కుతంత్రాలకు, అసెంబ్లీలో మైకును వాడుకుంటామంటే ఒప్పుకోం. అభివృద్ధి, భూసేకరణ విషయంలో మీరు అడ్డుపడకండి. పరిహారం ఏం ఇవ్వాలో సూచనలు చేయండి. ఇది ప్రభుత్వ ఖజానా నుంచి ఇచ్చేదే తప్ప.. ఎవరి ఇంట్లో నుంచి ఇచ్చేది కాదు” అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

ఉపఎన్నికలు రావు - సీఎం రేవంత్ రెడ్డి

“మల్లన్న సాగర్ లో, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో …కేసులు వేయించింది వాళ్లే, పార్టీలో చేర్చుకున్నది వాళ్లే. ఆనాడు పార్టీ మారిన వాళ్లు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసినా.. ఉప ఎన్నికలు రాలేదు. గతంలోనే రాని ఉప ఎన్నికలు ఇప్పుడెలా వస్తాయి..? గతంలో ఆచరించిన సంప్రదాయాలనే ఇప్పుడు మనం ఆచరిస్తున్నాం. సభ్యులెవరూ ఆందోళన చెందొద్దు.. ఏ ఉప ఎన్నికలు రావు. మా దృష్టి ఉప ఎన్నికలపై లేదు., మా దృష్టి రాష్ట్ర అభివృద్ధిపైనే. ప్రతిపక్షానికి మేం సూచన చేస్తున్నాం. మీ పై మాకు ద్వేషం లేదు.. ప్రజలు మిమ్మల్ని ఎప్పుడో శిక్షించారు. ఇక మీపై మాకు కోపం ఎందుకుని ఉంటుంది? ప్రభుత్వానికి సహేతుకమైన సలహాలు, సూచనలు ఇవ్వండి” అంటూ సీఎం రేవంత్ రెడ్డి హితవు పలికారు.

Maheshwaram Mahendra Chary

TwittereMail
మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం