Investments in Telangana : తెలంగాణకు భారీ పెట్టుబడులు వచ్చాయి.. వివాదాలు వద్దు : సీఎం రేవంత్-cm revanth reveals that telangana has received huge investments ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Investments In Telangana : తెలంగాణకు భారీ పెట్టుబడులు వచ్చాయి.. వివాదాలు వద్దు : సీఎం రేవంత్

Investments in Telangana : తెలంగాణకు భారీ పెట్టుబడులు వచ్చాయి.. వివాదాలు వద్దు : సీఎం రేవంత్

Basani Shiva Kumar HT Telugu
Jan 28, 2025 04:22 PM IST

Investments in Telangana : తెలంగాణకు పెట్టుబడుల అంశంపై బీఆర్ఎస్ విమర్శలు గుప్పిస్తోంది. రేవంత్ దావోస్ వెళ్లి ఏం సాధించారని ప్రశ్నిస్తోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడారు. తెలంగాణకు వచ్చిన పెట్టుబడుల గురించి వివరించారు. పెట్టుబడులు పెట్టే సంస్థలను ప్రోత్సహిస్తామని స్పష్టం చేశారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

దావోస్ పర్యటనతో లక్షా 80 వేల కోట్ల రూపాయల పెట్టుబడులను పెట్టేలా మన రాష్ట్రం ఆకర్షించగలిగిందని.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించారు. ఇది నిరంతర ప్రక్రియ అని చెప్పారు. సచివాలయంలో మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి.. రాజకీయంగా విభేదించినా రాష్ట్ర అభివృద్ధి విషయంలో వివాదాలకు వెళ్లొద్దని హితవు పలికారు. పెట్టుబడులకు అవసరమైన భూ కేటాయింపులు చేసి.. అన్ని రకాలుగా ఆ సంస్థలను ప్రోత్సహిస్తామని చెప్పారు.

అందరం కలిస్తేనే అభివృద్ధి..

అందరం కలిసి కష్టపడితేనే తెలంగాణ అభివృద్ధి సాధ్యం అవుతుందని ముఖ్యమంత్రి రేవంత్ చెప్పారు. తెలంగాణ రాష్ట్రాన్ని 1 ట్రిలియన్ ఎకానమీగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని వివరించారు. సింగపూర్ ఆధ్వర్యంలో నడుస్తుస్తున్న ఐటీఈ సంస్థతో కూడా ఒప్పందాలు చేసుకున్నామని వెల్లడించారు. ఇది భవిష్యత్‌లో మన సాంకేతికను పెంపొందించడానికి ఉపయోగపడుతుందని వ్యాఖ్యానించారు.

ఎన్నో కుట్రలు చేశారు..

'తెలంగాణకు భారీ పెట్టుబడులు వచ్చాయి. తెలంగాణ ప్రభుత్వంపై నమ్మకంతో పెట్టుబడులు పెట్టారు. హైదరాబాద్‌కు పెట్టుబడులు రాకుండా చేయాలని కుట్ర చేశారు. ఎన్నో అపోహలు, అనుమానాలు సృష్టించారు. కానీ ఇన్వెస్టర్లు విశ్వాసాన్ని చాటుకున్నారు. పక్కా ప్రణాళికతో వెళ్లాం కనుకే అన్ని పెట్టుబడులు వచ్చాయి. 13 నెలల్లో రూ.లక్షా 80వేల కోట్ల పెట్టుబడులొచ్చాయి. సింగపూర్‌ ప్రభుత్వంతో కీలక ఒప్పందం చేసుకున్నాం. స్కిల్‌ డెవలప్‌మెంట్‌లో ఇదో అద్భుత పరిణామం' అని రేవంత్‌ రెడ్డి చెప్పారు.

గొప్ప అడుగు పడింది..

'పెట్టుబడులు ప్రభుత్వంపై నమ్మకానికి నిదర్శనం. లక్షా 80 వేల కోట్ల పెట్టుబడులు సాధించాం. గతేడాది కంటే 4 రెట్లు ఎక్కువ పెట్టుబడులు వచ్చాయి. వన్ ట్రిలియన్ ఎకానమీ దిశగా గొప్ప అడుగు పడింది. ఒప్పందం జరిగినంత మాత్రాన విజయం సాధించినట్టు కాదు. కంపెనీలన్నీ స్థాపించినప్పుడే మా విజయం. విమర్శలను సలహాలుగా తీసుకుంటాం' అని మంత్రి శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు.

16 సంస్థలతో ఒప్పందాలు..

తెలంగాణ ప్రభుత్వం దావోస్ వేదికగా 16 ప్రముఖ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. సన్ పెట్రో కెమికల్స్, అమెజాన్ వెబ్ సర్వీసెస్, కంట్రోల్ ఎస్, జేఎస్ డబ్ల్యూ, స్కైరూట్ ఏరో స్పేస్‌, మేఘా ఇంజినీరింగ్, హెచ్‌సీఎల్‌ టెక్ సెంటర్, విప్రో, ఇన్ఫోసిస్, యూనిలివర్ కంపెనీ, టిల్మాన్ గ్లోబల్ హోల్డింగ్స్, ఉర్సా క్లస్టర్స్, బ్లాక్‌స్టోన్, అక్షత్ గ్రీన్ టెక్, ఎక్లాట్ హెల్త్ సొల్యూషన్స్, సుహానా మసాలా, ఎకో ఫ్యాక్టరీ ఫౌండేషన్‌ సంస్థలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపాయి.

Whats_app_banner