Telangana : పీఎంఏవై కింద 20 లక్షల ఇళ్లు మంజూరు చేయండి - సీఎం రేవంత్ విజ్ఞప్తి
గృహ నిర్మాణం, పట్టణ ప్రణాళికలపై కేంద్రమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ హైదరాబాద్‌లో సమీక్ష నిర్వహించారు. ఇందులో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి… పీఎం ఆవాస్ యోజన (అర్బన్) కింద తెలంగాణకు 20 లక్షల ఇళ్లు మంజూరు చేయాలని కోరారు. మూసీ డెవలప్‌మెంట్ ప్రాజెక్టుకు కేంద్రం చేయూతనివ్వాలని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన (అర్బన్) 2.0 కింద 20 లక్షల ఇళ్లు మంజూరు చేయాలని కేంద్రమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. పీఎంఏవై 2.0లో చేరిన మొదటి రాష్ట్రం తెలంగాణ అని గుర్తు చేశారు. ఇందుకు సంబంధించిన సమగ్ర డేటా సిద్ధంగా ఉన్నందున రాష్ట్రానికి ఆ మేరకు ఇళ్లు మంజూరు చేయాలని కోరారు.
నిధులు కేటాయించండి…
దేశంలోని మహానగరాలైన ఢిల్లీ, చెన్నై, బెంగళూరుతో పోల్చితే హైదరాబాద్‌లో మెట్రో కనెక్టవిటీ తక్కువగా ఉన్నందున మెట్రో ఫేజ్-II కింద ఆరు కారిడార్లను గుర్తించామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించారు. ఆరింటిలో తొలి అయిదు కారిడార్లకు సంబంధించి (76.4 కి.మీ.) డీపీఆర్లు పూర్తయ్యాయని కేంద్రమంత్రి దృష్టికి తెచ్చారు. ఈ కారిడార్ల నిర్మాణానికి రూ. 24,269 కోట్లు వ్యయమవుతుందన్నారు. డీపీఆర్లు ఆమోదించడంతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్త భాగస్వామ్యం (జేవీ) కింద చేపట్టి నిధులు కేటాయించాలని కోరారు.
గృహ నిర్మాణం, పట్టణ ప్రణాళికలపై కేంద్ర మంత్రి ఖట్టర్ హైదరాబాద్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాటు ఉపముఖ్యమంత్రి భట్టి, పలువురు మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు అంశాలను కేంద్ర మంత్రి దృష్టికి తెచ్చారు.
సీఎం రేవంత్ ప్రస్తావించిన అంశాలు:
- "మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టుకు కేంద్రం చేయూతనివ్వాలి. మూసీలో మురుగు చేరకుండా నదికి ఇరువైపులా 55 కి.మీ. (మొత్తంగా 110 కి.మీ.) కాలువలు, బాక్స్ డ్రెయిన్లు, ఎస్టీపీల నిర్మాణానికి అయ్యే రూ.10 వేల కోట్లు మంజూరు చేయాలి.
- హైదరాబాద్ నగరంతో పాటు సమీపంలోని 27 పట్టణ పాలక సంస్థల పరిధిలో మురుగు నీటి నెట్‌వర్క్ నిర్మాణానికి రూ.17,212 కోట్లతో సమగ్ర మురుగునీటి మేజర్ ప్లాన్ (సీఎస్ఎంపీ) కు నిధులివ్వాలి.
- తెలంగాణ రాష్ట్రంలో రెండో పెద్ద నగరమైన వరంగల్ సమగ్రాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం మాస్టర్ ప్లాన్‌ను నోటిఫై చేసింది. వరంగల్ నగరంలో రూ. 41,70 కోట్లతో సమగ్ర భూగర్భ నీటి పారుదల (యూజీడీ) పథకాన్ని చేపట్టేందుకు నిధులు కేటాయించాలి.
- తెలంగాణ రాష్ట్రంలోని గిరిజన రైతులకు నిరంతరం సాగు నీరు అందించేందుకు వీలుగా పీఎం కుసుమ్ కింద లక్ష సౌర పంపులు కేటాయించాలి.
- విద్యుత్ సరఫరా, నెట్‌వర్క్ బలోపేతానికి రూ.488 కోట్ల అంచనా వ్యయంతో 9 ప్రాజెక్టు నివేదికలను సమర్పించాం. వెంటనే మంజూరు చేయాలి.
- రాష్ట్ర విద్యుత్ సంస్థలకు విద్యుత్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్‌సీ), గ్రామీణ విద్యుదీకరణ కార్పొరేషన్ (ఆర్ఈసీ) ఇచ్చిన రుణాలకు సంబంధించిన వడ్డీ రేట్లను తగ్గించాలి.
- కొత్త పునరుత్పాదక విద్యుత్ ప్లాంట్ల నిర్మాణానికి రెండు సంవత్సరాలకు పైగా సమయం పడుతుంది. అందువల్ల ఆర్‌పీపీవో లక్ష్యాలను చేరుకోలేకపోయినందుకు విధించే జరిమానాలు మాఫీ చేయాలి" అని కేంద్రమంత్రిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు.
సంబంధిత కథనం