CM Revanth Warangal Tour : నేడు వరంగల్ కు సీఎం రేవంత్​ రెడ్డి - కీలక హామీలపై ప్రకటన ఉంటుందా..!-cm revanth reddy will visit warangal city today ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Cm Revanth Warangal Tour : నేడు వరంగల్ కు సీఎం రేవంత్​ రెడ్డి - కీలక హామీలపై ప్రకటన ఉంటుందా..!

CM Revanth Warangal Tour : నేడు వరంగల్ కు సీఎం రేవంత్​ రెడ్డి - కీలక హామీలపై ప్రకటన ఉంటుందా..!

HT Telugu Desk HT Telugu
Published Jun 29, 2024 05:15 AM IST

CM Revanth Reddy Warangal Tour : ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ నగరంలో పర్యటించనున్నారు. నగరంలోని పెండింగ్ పనులతో పాటు చేయాల్సిన అభివృద్ధి పనులపై సమీక్షిస్తారు. సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు.

సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ టూర్
సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ టూర్

CM Revanth Reddy Warangal Tour : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటన ఖరారు అయ్యింది. శుక్రవారమే ఆయన ఓరుగల్లు పర్యటనకు రావాల్సి ఉండగా, దిల్లీలో సమావేశం దృష్ట్యా అది కాస్త వాయిదా పడింది. దీంతో శనివారం(నేడు) ఆయన పర్యటనకు ముహూర్తం ఖరారైంది.

ఎలక్షన్​ కోడ్​ ముగిసిన తరువాత వరంగల్ నగరానికి ముఖ్యమంత్రి వస్తుండగా, ఆయన టూర్​ పైనే ఓరుగల్లు ప్రజలతో పాటు ప్రజాప్రతినిధులు ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే నగరానికి సంబంధించిన ముఖ్యమైన పనులు పెండింగ్​ లో ఉండగా, వాటికి మోక్షం కలుగుతుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు పెండింగ్​ పనులతో పాటు జిల్లాకు కావాల్సిన కొత్త పనులకు సంబంధించిన ప్రతిపాదనలు కూడా రెడీ చేశారు.

ఐదు గంటలు నగరంలోనే..

సీఎం రేవంత్​ రెడ్డి వరంగల్ లో దాదాపు ఐదు గంటల పాటు సుడిగాలి పర్యటన చేయనున్నారు. తన పర్యటనలో భాగంగా ఇవాళ మధ్యాహ్నం 12.40 గంటలకు శంషాబాద్​ ఎయిర్​ పోర్టు నుంచి హెలిక్యాప్టర్​ లో బయలు దేరనున్నారు. మధ్యాహ్నం 1.30 గంటల వరకు వరంగల్ జిల్లా సంగెం మండలంలోని కాకతీయ మెగా టెక్స్​ టైల్​ పార్కుకు చేరుకుని, అక్కడ వివిధ కంపెనీల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్​ ను 1.50 గంటల వరకు సందర్శిస్తారు. అక్కడి నుంచి వరంగల్​ సెంట్రల్​ జైల్​ స్థలంలో నిర్మిస్తున్న మల్టీ సూపర్​ స్పెషాలిటీ ఆసుపత్రి పనులను పరిశీలిస్తారు.

అక్కడి నుంచి 2.45 గంటల ప్రాంతంలో హనుమకొండలోని ఇంటిగ్రేటెడ్​ డిస్ట్రిక్ట్ ఆఫీసెస్​ కాంప్లెక్స్ కు చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు ఏర్పాటు చేసిన మహిళా శక్తి క్యాంటీన్​ ను ప్రారంభిస్తారు. అనంతరం కలెక్టరేట్​ కాన్ఫరెన్స్​ హాలులో జీడబ్ల్యూఎంసీ అభివృద్ధి పనులపై అధికారులతో రివ్యూ చేస్తారు. ఆ తరువాత 5.30 గంటల ప్రాంతంలో వరంగల్ హంటర్​ రోడ్డులో కొత్తగా ఏర్పాటైన ‘మెడి కవర్’ అనే ప్రైవేటు ఆసుపత్రి ఓపెనింగ్​ కు చీఫ్​ గెస్ట్​ గా హాజరవుతారు.

అక్కడి నుంచి 6.10 గంటలకు ఆర్ట్స్​ కాలేజీ గ్రౌండ్​ లో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్​ కు చేరుకుని హైదరాబాద్​ కు తిరుగుప్రయాణం కానున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి పర్యటనకు జిల్లా అధికారులు ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. తమతమ శాసనసభ నియోజకవర్గాల పరిధిలో జరిగే కార్యక్రమాలకు సంబంధించిన పనులను స్థానిక ఎమ్మెల్యేలు పరిశీలించారు.

అభివృద్ధి పనులపై ఆశలు

వరంగల్ నగరానికి సంబంధించి ముఖ్యమైన పనులు చాలా వరకు పెండింగ్​ లోనే ఉన్నాయి. రాష్ట్రానికి రెండో రాజధానిగా వరంగల్ ను తీర్చిదిద్దుతామని ఇదివరకే సీఎం రేవంత్​ రెడ్డి ప్రకటన చేయగా, తన పర్యటనలో భాగంగా ఏమేం పనులు మంజూరు చేస్తారోనని ఆసక్తి నెలకొంది.

కాగా వరంగల్ నగరానికి ప్రధానంగా మాస్టర్​ ప్లాన్​ అమలు విషయం చాలా ఏళ్లుగా ప్రభుత్వం వద్ద పెండింగ్​ లో ఉంది. 2013లో మాస్టర్​ ప్లాన్​ రూపొందించిన ఇంతవరకు దానికి ఆమోదం లభించలేదు. దీంతో మాస్టర్​ ప్లాన్​ పై ప్రకటన చేస్తారనే చర్చ జరుగుతోంది. అంతేగాకుండా వరంగల్ కు సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం సమస్యగా మారగా, అండర్​ గ్రౌండ్​ డ్రైనేజీ వ్యవస్థ మాటలకే పరమితం అవుతోంది. దీంతో వందల కోట్లు ఖర్చయ్యే ఈ ప్రాజెక్టుపైనా ప్రకటన వెలువడే ఛాన్స్​ ఉందని ప్రచారం సాగుతోంది

పాత పనులకు మోక్షం కలిగేనా..?

గత ప్రభుత్వ హయాంలో ప్రారంభించి పెండింగ్​ లో పడిపోయిన పనులు వరంగల్ లో చాలానే ఉన్నాయి. అందులో ప్రధానంగా వరంగల్ ఇన్నర్​ రోడ్డు, స్మార్ట్​ సిటీ వర్క్స్​, ఇండస్ట్రియల్​ కారిడార్​, కాళోజీ కళాక్షేత్రం నిర్మాణ పనులన్నాయి. ఈ పనులన్నీ గత కొంతకాలంగా అసంపూర్తిగానే ఉండగా, వాటన్నింటినీ పూర్తి చేసి ఓరుగల్లు సుందరంగా తీర్చి దిద్దుతామని సీఎం రేవంత్​ రెడ్డి ఇదివరకే ప్రకటించారు.

ఈ మేరకు వాటి పనులు పూర్తి చేసేందుకు నిధులు మంజూరు చేయాలని స్థానిక ప్రజలు డిమాండ్​ చేస్తున్నారు. అంతేగాకుండా వరంగల్ మామునూరు ఎయిర్​ పోర్టు అంశం తరచూ తెరమీదకు రావడం, ఆ తరువాత తెరమరుగవడం సాధారణమైపోయింది. దీంతో వరంగల్ ఎయిర్​ పోర్టు విషయంపైనా స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రులు సీఎం రేవంత్​ రెడ్డితో సరైన ప్రకటన చేయించాలనే డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. మరి సీఎం రేవంత్​ రెడ్డి తన పర్యటనలో ఓరుగల్లు అభివృద్ధికి ఎలాంటి ప్రకటనలు చేస్తారో చూడాలి.

(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)

Whats_app_banner