CM Revanth Reddy: ఇంద్రవెల్లికి నేడు సిఎం రేవంత్‌ రెడ్డి..గ్యారంటీ పథకాలకు శ్రీకారం-cm revanth reddy will launch guarantee schemes for indravelli today ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Cm Revanth Reddy Will Launch Guarantee Schemes For Indravelli Today

CM Revanth Reddy: ఇంద్రవెల్లికి నేడు సిఎం రేవంత్‌ రెడ్డి..గ్యారంటీ పథకాలకు శ్రీకారం

HT Telugu Desk HT Telugu
Feb 02, 2024 07:12 AM IST

CM Revanth Reddy: ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు పర్యటించనున్నారు. జిల్లాలో తొలి పర్యటనలో పలు గ్యారెంటీ పథకాలను ప్రారంభించనున్నారు.

సిఎం రేవంత్‌ రెడ్డితో మంత్రి అనసూయ
సిఎం రేవంత్‌ రెడ్డితో మంత్రి అనసూయ

CM Revanth Reddy: తెలంగాణ సిఎం రేవంత్‌ రెడ్డి నేడు ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లిలో పర్యటించనున్నారు. తనకు కలిసొచ్చిన ఆదిలాబాద్‌ జిల్లా నుంచే గ్యారంటీ పథకాలకు శ్రీకారం చుట్టనున్నారు.

ట్రెండింగ్ వార్తలు

సీఎం హోదాలో తొలిసారిగా సెం శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లా పూర్‌లో రేవంత్‌ రెడ్డి అడుగు పెట్టనున్నారు. జిల్లా పర్యటనలో నాగోబాకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు

జిల్లా పర్యటనలో భాాగంగా ఇందిరమ్మ ఇళ్లు, రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500​​కే సిలిండర్ పథకాలను సీఎం ప్రకటించనున్నారు. దీనికోసం ఇప్పటికే మూడు పథకాల అర్హులయ్యే లబ్దిదారుల జాబితాను అధికారులు సిద్ధం చేశారు. రాష్ట్రంలో 200 యూనిట్లలోపు విద్యుత్‌ వాడే కుటుంబాలు 90 లక్షలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

టీపీసీసీ అధ్యక్షుడిగా నియామకం తర్వాత 2021 ఆగస్టు 9న ఇంద్రవెల్లి మొదటి సభ నిర్వహించారు. అప్పట్లో 'దళిత, గిరిజన దండోరా' పేరిట నిర్వహించిన సభకు లక్షకు పైగా జనం వచ్చాారని కాంగ్రెస్ శ్రేణులు గుర్తు చేసుకుంటున్నాయి. .

ఇంద్రవెల్లిలో నిర్వహించిన సభ గ్రాండ్‌ సక్సెస్‌ కావడంతో రేవంత్‌ రెడ్డి ఆ తర్వాత కాలంలో రాష్ట్రంలో పలు సభలు నిర్వహించారు. ఇది తెలంగాణ వ్యాప్తంగా చక్కటి ఫలితాలనిచ్చింది.

అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించడం, రేవంత్‌రెడ్డి సీఎం అయ్యాక తనకు కలిసి వచ్చిన ఇంద్రవెల్లి గడ్డ మీద నుంచే పార్లమెంటు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించాలని రేవంత్‌ రెడ్డి నిర్ణయించారు.

ఇంద్రవెల్లి ఎందుకు ప్రత్యేకం….

2021ఏప్రిల్ 20న తొలిసారి కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ఇంద్రవెల్లి స్మారక స్థూపాన్ని సందర్శించి అమరవీరులకు నివాళి అర్పించి ఆతర్వాత కెస్లాపూర్ నాగోబాలో సంప్రదాయ పూజలు రేవంత్ నిర్వహించారు.

అదే సంవత్సరం ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా పీసీసీ అధ్యక్షుడి హోదాలో నిర్వహించిన దళిత, గిరిజన దండోర రాష్ట్రంలోనే కాంగ్రెస్‌కు మైలురాయిగా నిలిచింది. ఈ బహిరంగసభకు లక్ష మందికి పైగా జనం హాజరుకావడం రేవంత్ రెడ్డికి పొలిటికల్ గ్రాఫ్ పెంచింది.

ఈ బహిరంగ సభ కాంగ్రెస్ క్యాడర్లోనూ ఉత్తేజాన్ని నింపగా అక్కడి నుండే రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు నిర్వహించి అధికారంలోకి రాగానే ఇదే జిల్లా నుండి అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతానని హామి ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు అబివృద్ధి పథకాల శ్రీకారంలో భాగంగా కీలకమైన రెండు గ్యారంటీ పథకాల అమలుకు సీఎం ఇక్కడి నుండే శ్రీకారం చుట్టబోతున్నారు.

పర్యటన ఇలా….

సీఎం రేవంత్ ఇంద్రవెల్లిలో నిర్వహించతలపెట్టిన బహిరంగ సభకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక హెలికాప్టర్‌లో వెళ్లనున్నారు. మధ్యాహ్నం 12:30 గంటలకు బేగంపేట ఎయిర్‌‌పోర్టు నుంచి బయలుదేరి ఇంద్రవెల్లి మండలం కేస్లా పూర్‌ చేరుకుని నాగోబా ఆలయాన్ని సందర్శిస్తారు.

ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. గిరిజన దర్బార్ సభావేదికలో స్వయం సహాయ సంఘాల సభ్యులు, జిల్లా స్థాయి అధికారులు, ప్రజా ప్రతినిధులతో సమావేశమవుతారు. అక్కడి నుంచి నేరుగా ఇంద్రవెల్లిలోని అమర వీరుల స్థూపం వద్ద నిర్వహించతలపెట్టిన సభా వేదిక వద్దకు చేరుకుని పార్లమెంట్ ఎన్నికల ప్రచార శంఖారావం పూరిస్తారు.

జల్ జంగల్ జమీన్ కోసం జరిగిన పోరాటంలో పోలీసు కాల్పుల్లో అమరులైన వారి కుటుంబ సభ్యులతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ కానున్నారు. వారికి ఇళ్ల స్థలాలు కేటాయించే అవకాశం ఉంది. అక్కడనే అమరుల స్మృతివనానికి భూమిపూజ చేయనున్నారు.

ఆ సమీపంలో నిర్వహించే భారీ బహిరంగా సభా వేదిక నుంచే రెండు గ్యారెంటీల అమలుకు శ్రీకారం చుట్టనున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. సభ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి హెలికాప్టర్ సాయంత్రం హైదరాబాద్‌ తిరిగి రానున్నారు.

ఎన్నికల ప్రచారం ….

ఆదివాసులు చారిత్రక పోరుగడ్డ.. ఇంద్రవెల్లి నుండే ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సమర శంఖం పూరించనున్నారు. అక్కడ జాతర ఉత్సవాల కోసం ముస్తాబైన ఆలయ గోపురాన్ని సీఎం ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 12.30 గంటలకు కేస్లాపూర్ చేరుకోగానే ముత్నూర్ వరకు రూ.15 కోట్ల వ్యయంతో చేపట్టే రెండు వరుసల డివైడర్లతో కూడిన రహదారికి భూమి పూజ చేయనున్నారు.

అనంతరం నాగోబా ఆలయం వద్ద ఆదివాసు లతో, పొదుపు సంఘాల మహిళలతో సీఎం రేవంత్ సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు. అక్కడ పూర్తి అయిన ప్రహారీ గోడను ప్రారంభించి కోట్లాది నిధుల ప్రణాళికతో చేపట్టే అభివృద్ధి పనులకు లాంఛ నంగా సీఎం శ్రీకారం చుట్టనున్నారు.

ఇంద్ర వెల్లి, సిరికొండ మండలాల పరిధిలో 33 గ్రామాలకు రహదారుల నిర్మాణం కోసం రూ.27.30 కోట్ల నిధులతో పనులు చేపట్టనుండగా పది కోట్లతో గిరిజన బాలికల గురుకుల పక్కా భవనాలు కెస్లాపూర్లో భూమిపూజ చేయను న్నారు. మరో వారం రోజుల్లో నాగోబా జాతర ఉత్సవాలు ప్రారంభమవుతుండగా రేవంత్ రెడ్డి సీఎం హోదాలో తొలిసారిగా వస్తుండటం ఆదివాసీ ఏజెన్సీ గూడాల్లో ఉత్సాహం వెల్లి విరిస్తుంది. ముఖ్యమంత్రి అభివృద్ధి సంక్షేమంపై పలు హామీలు ఇచ్చే అవకాశం ఉందని ఆశతో ఎదురుచూస్తున్నారు.

లక్ష మందితో సభా ఏర్పాట్లు : మంత్రి సీతక్క.

రేవంత్ రెడ్డి సీఎం హోదాలో జరుగుతున్న మొట్ట మొదటిసభ కావడం తో కింది స్థాయి అధికారులు, నాయకులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు, ఇందుకోసమే పెద్ద సంఖ్యలో పొదుపు మహిళా సంఘాలను, ఆదివాసీ, గిరిజన సంఘాలను సీఎం సభకు రప్పించేలా మంత్రి సీతక్క దగ్గరుండి ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇంద్రవెల్లి, కెస్లాపూర్లో మరోసారి పర్యటించిన సీతక్క భారీ జన సమీకరణ కోసం సన్నాహాలు సాగిస్తూనే లక్ష మంది జనాన్ని రప్పించేలా ప్రయత్నిస్తున్నారు. 1981 ఏప్రిల్ 20న ఇంద్రవెల్లి కాల్పుల ఘటనలో మృతి చెందిన ఆదివాసీ అమరవీరుల 15 కుటుంబాలకు స్వాంతన కలిగించేలా సీఎం పరిహారం అందించనున్నారు.

ఆదివాసుల సెంటిమెంట్ ఓట్ల బ్యాంకుతో లోక్ సభ ఎన్నికలకు ఇంద్రవెల్లి నుంచే ప్రచార శంఖారావం పూరిస్తున్న నేపథ్యంలో అందరి దృష్టి సీఎం రేవంత్‌ రెడ్డిపైనే కేంద్రీకృతమై ఉంది.

సభను విజయవంతం చేయాలి: మహేష్ కుమార్ గౌడ్

ఇంద్రవెల్లిలో నిర్వహించే భారీ సభను విజయవంతం చేసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ కోరారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆరు గ్యారెంటీల అమలకు మొదటి రోజు నుంచే కృషి చేశారని, అందులో రెండు అమలవుతున్నాయని మహేష్ కుమార్ గౌడ్ గుర్తుచేశారు. మిగతా గ్యారెంటీలను కూడా అమలు చేస్తామని ఎమ్మెల్సీ తెలిపారు.

(రిపోర్టింగ్ కామోజీ వేణుగోపాల్, ఆదిలాబాద్)

--------

IPL_Entry_Point