తెలంగాణ రాష్ట్ర అవసరాలకు కేటాయించిన యూరియాను సకాలంలో సరఫరా చేయాలని కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి జేపీ నడ్డాను సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి… కేంద్ర మంత్రిని ఆయన నివాసంలో కలిశారు.
వానా కాలం సీజన్‌కు సంబంధించి ఏప్రిల్ - జూన్ మధ్య రాష్ట్రానికి 5 లక్షల మెట్రిక్ టన్నులకు గానూ కేవలం 3.07 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే సరఫరా చేశారని కేంద్ర మంత్రి దృష్టికి తెచ్చారు. రాష్ట్రంలో ప్రాజెక్టులకు నీరు రావడం, వ్యవసాయ పనులు జోరుగా సాగుతున్న సమయంలో యూరియా సరఫరా కాకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని కేంద్ర మంత్రికి వివరించారు.
జులై నెలకు సంబంధించి దేశీయంగా ఉత్పత్తయిన యూరియా 63 వేల మెట్రిక్ టన్నులుగా ఉంది. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న యూరియా 97 వేల మెట్రిక్ టన్నులు రాష్ట్రానికి సరఫరా చేయాల్సి ఉండగా…. ఇప్పటివరకు కేవలం 29 వేల మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే చేశారని వివరిస్తూ వెంటనే విడుదల చేయాలని కోరారు.అలాగే తెలంగాణకు దేశీయంగా ఉత్పత్తి అవుతున్న యూరియా కోటాను పెంచాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. యూరియా సరఫరాకు సంబంధించి రైల్వే శాఖ తగిన రేక్‌లు కేటాయించడం లేదని…. వాటి సంఖ్య కూడా పెంచాలని కోరారు.
జహీరాబాద్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ (ZISC) అభివృద్ధికి సహకరించాలని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలోని వాణిజ్య భవన్‌లో పీయూష్ గోయల్‌తో భేటీ అయ్యారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పలు కీలక ప్రాజెక్టుల విషయంపై చర్చించారు.
జహీరాబాద్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ అభివృద్ధికి జాతీయ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధిపై చర్చించారు. NICDIT కింద ఆమోదించిన రూ. 596.61 కోట్లను సత్వరం విడుదల చేయాలని కోరారు. జహీరాబాద్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీకి అవసరమైన నీటి సరఫరా, విద్యుత్, ఇతర వసతుల కల్పనకు ఆర్థిక సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
హైదరాబాద్ - వరంగల్ పారిశ్రామిక కారిడార్‌లో భాగంగా వరంగల్ విమానాశ్రయానికి నిధులు మంజూరు చేయాలని అభ్యర్ధించారు. హైదరాబాద్ - విజయవాడ పారిశ్రామిక కారిడార్ ఫీజుబిలిటీని అధ్యయనం చేస్తున్నట్లు కేంద్ర మంత్రి గారికి ముఖ్యమంత్రి వివరించారు.
తెలంగాణ ప్రభుత్వం ఆదిభట్లలో అత్యున్నతమైన మౌలిక వసతులతో ప్రత్యేకమైన రక్షణ, ఏరోస్పేస్ పార్క్‌ను ఏర్పాటు చేసిందని వివరించారు. హైదరాబాద్ - బెంగళూర్ పారిశ్రామిక కారిడార్‌ను ఏరో-డిఫెన్స్ కారిడార్‌గా మంజూరు చేయాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. పెట్టుబడులకు సిద్ధంగా ఉన్న వంద ప్లగ్ అండ్ ప్లే పారిశ్రామిక పార్కుల అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలు సమర్పిస్తామని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం వాటికి మద్దతుగా నిలవాలని గోయల్ కోరారు.