Telangana : కాంగ్రెస్ సర్కార్ కు ఏడాది...! జిల్లాల పర్యటనకు సిద్ధమైన సీఎం రేవంత్
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనపై సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనకు సిద్ధమయ్యారు. ఏడాది కాలంలో చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించునున్నారు . ఈనెల 19 నుంచి వచ్చే నెల 9వ తారీఖు వరకు పలు జిల్లాల్లో పర్యటించేలా షెడ్యూల్ ఖరారు చేశారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి డిసెంబర్ 7 వరకు ఏడాది పూర్తవుతున్న సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనకు శ్రీకారం చుడుతున్నారు. మంత్రివర్గ సభ్యులతో పాటు సీఎం ఉన్నతాధికారులతో కలిసి పర్యటించాలని నిర్ణయించారు. 19న వరంగల్ నుంచి ప్రారంభమయ్యే సీఎం జిల్లాల టూర్ డిసెంబర్ 9 వరకు సాగనుంది. 19న వరంగల్ లో మహిళ సదస్సు పేరుతో సీఎంతోపాటు మంత్రులందరు పర్యటిస్తారు.
ఆ మరుసటి రోజు 20న రాజన్న సిరిసిల్ల జిల్లాలో సీఎం పర్యటిస్తారు. సిరిసిల్లలో ఎస్పీ కార్యాలయం ప్రారంభించడంతో వేములవాడ రాజన్నను దర్శించుకుని ఆలయ అభివృద్ధి తోపాటు రోడ్డు వెడల్పు పనులకు శంకుస్థాపన చేస్తారు. సిరిసిల్ల నేత కార్మికులకు బాసటగా నిలిచేలా 50 కోట్లతో యార్న్ డిపోకు భూమిపూజ చేయనున్నారు. రాజన్న జాతర గ్రౌండ్ లో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏర్పాట్లను రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పరిశీలించి అధికారులతో సమీక్షించారు.
25న కరీంనగర్ లో యువజన సదస్సు
జిల్లాల పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ఈనెల 25న కరీంనగర్ లో పర్యటించి యువజన సదస్సులో పాల్గొననున్నారు. అందుకు అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. కరీంనగర్ ఎస్ ఆర్ ఆర్ డిగ్రీ కళాశాల లేదా అంబేద్కర్ స్టేడియంలో యువజన సదస్సు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే రెండు ప్రదేశాలను జిల్లా కలెక్టర్ ప్రమేలా సత్పతి జిల్లా అధికారులతో కలిసి పరిశీలించి ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. రెండు మూడు రోజుల్లో సభా స్థలం ఖరారు కానుంది.
3 రోజులు హైదరాబాద్ లో ఉత్సవాలు…
ఈనెలాఖరున మహబూబ్ నగర్ లో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో రైతు సదస్సు నిర్వహించనున్నారు. ఆ తర్వాత డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో హైదరాబాద్ కేంద్రంగా కార్నివాల్ గా మూడు రోజుల పాటు రాష్ట్ర స్థాయి ఉత్సవాలు నిర్వహిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. రాజన్న సిరిసిల్ల, వరంగల్ జిల్లాల అధికారులతో సీఎం టూర్ ఏర్పాట్లపై మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షించి సభా ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి చేసిన కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించేందుకు సిఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనతో పాటు రాష్ట్ర స్థాయి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు.