రాజీవ్ యువ వికాసం పథకంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షించనున్నారు. యువతకు ఉద్యోగ అవకాశాలు, ఉపాధి కల్పన, రుణాల మంజూరుపై చర్చించనున్నారు. రాజీవ్ యువ వికాసం అమలుపై ఇవాళ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ పూర్తవ్వగా.. వెరిఫికేషన్ చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితిని అధికారులు సీఎంకు వివరించనున్నారు.
ఈ పథకం దరఖాస్తు ప్రక్రియలో అధికారులు కొన్ని సమస్యలను గుర్తించారు. వాటిని ముఖ్యమంత్రికి వివరించనున్నారు. ఉదాహరణకు.. గతంలో బీసీ కార్పోరేషన్ లోన్ కోసం అప్లై చేసుకున్న వారికి ఇప్పుడు అవకాశం ఇవ్వలేదు. అటు రేషన్ కార్డులు లేక చాలామంది దీనికి దరఖాస్తు చేసుకోలేదు. ఇటీవల సిబిల్ స్కోర్ అంశం తెరపైకి వచ్చింది. ఇలా కొన్ని సమస్యలు ఉన్నాయి. వాటిపై ఇవాళ్టి సమీక్షలో ముఖ్యమంత్రి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా.. ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకాన్ని తీసుకొచ్చింది. పథకం కింద దరఖాస్తుదారులను ఐదు కేటగిరీలుగా విభజించి.. ప్రభుత్వం యూనిట్లను మంజూరు చేస్తుంది. కేటగిరీల వారీగా ప్రభుత్వం సబ్సిడీ ఇస్తోంది. మిగతా డబ్బులను బ్యాంకులు రుణాల కింద ఇవ్వనున్నాయి. అయితే.. బ్యాంక్ రుణాల విషయంలో సిబిల్ స్కోర్ కీలకంగా మారనుంది.
రాజీవ్ యువ వికాసం దరఖాస్తులను బ్యాంక్ అధికారులు కూడా పరిశీలన చేయాల్సి ఉంటుంది. సిబిల్ స్కోర్ తక్కువ ఉన్న వారు, వ్యక్తిగత, వ్యవసాయ, గృహ, వాహన రుణాలు తీసుకుని తిరిగి చెల్లించని వారు అనర్హులుగా తేలే అవకాశముంది. ఇప్పటికే ఆయా బ్యాంకుల వారీగా దరఖాస్తులను సిబిల్ స్కోర్ పరిశీలనకు పంపినట్లు అధికారులు చెబుతున్నారు.
రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించి తొలుత 1, 2 కేటగిరీల కింద రుణాలు మంజూరు చేయాలని రేవంత్ ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ కేటగిరీల్లో నిర్ణయించిన లక్ష్యం కన్నా తక్కువగా దరఖాస్తులు వచ్చాయి. దీంతో వంద శాతం దరఖాస్తుదారులకు లబ్ధి చేకూరనున్నట్లు తెలుస్తోంది. కేటగిరీ-1 కింద 100 శాతం రాయితీతో రూ.50 వేల విలువైన యూనిట్లు, కేటగిరీ-2 కింద 90 శాతం రాయితీతో రూ.లక్ష విలువైన యూనిట్లు మంజూరు కానున్నాయి.
రాజీవ్ యువ వికాసం పథకానికి మొత్తం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ లబ్ధిదారులు 16.23 లక్షల మంది దరఖాస్తు చేశారు. ఇందులో 1.32 లక్షల దరఖాస్తులు కేటగిరీ-1, 2 కింద వచ్చాయి. ఈ కేటగిరీల కింద 2.8 లక్షల మందికి సహాయం చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఈ మేరకు ప్రభుత్వం అనుమతులు కూడా మంజూరు చేసింది. కానీ దరఖాస్తులు లక్ష్యంలో సగం కూడా రాలేదు.
సంబంధిత కథనం