Investments In Hyderabad : హైదరాబాద్ లో క్యాపిటల్యాండ్ భారీ పెట్టుబడులు, రూ.450 కోట్లతో ఐటీ పార్క్ నిర్మాణానికి ఒప్పందం
Investments In Hyderabad : హైదరాబాద్ లో రూ.450 కోట్ల పెట్టుబడులతో అత్యాధునిక ఐటీ పార్క్ నిర్మాణానికి క్యాపిటల్యాండ్ సంస్థ ముందుకొచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి సింగపూర్ పర్యటనలో ఈ రియల్ ఎస్టేట్ కంపెనీతో ఒప్పందం కుదిరింది.
Investments In Hyderabad : సింగపూర్‌లో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం మరో కీలక ఒప్పందం చేసుకుంది. హైదరాబాద్‌లో రూ. 450 కోట్ల పెట్టుబడులతో అత్యాధునిక ఐటీ పార్క్ నిర్మాణానికి ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ క్యాపిటల్యాండ్ ముందుకొచ్చింది. సింగపూర్ కేంద్రంగా పనిచేస్తున్న ప్రపంచస్థాయి రియల్ ఎస్టేట్ సంస్థల్లో ఒకటైన క్యాపిటల్యాండ్ కంపెనీ హైదరాబాద్ లో 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో భారీ ఐటీ పార్క్‌ను అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించింది.

సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్ బాబు, ఉన్నతాధికారుల బృందం క్యాపిటల్యాండ్ ప్రతినిధులతో జరిపిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం జరిగింది. ఈ చర్చల్లో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ స్పెషల్ సెక్రెటరీ విష్ణువర్థన్ రెడ్డి, సీఎంవో స్పెషల్ సెక్రెటరీ అజిత్ రెడ్డి, క్యాపిటల్యాండ్ తరఫున ఇండియా ట్రస్ట్ మేనేజ్మెంట్ సీఈవో గౌరీ శంకర్ నాగభూషణం, సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మనోహర్ కియాతానీ తదితరులు పాల్గొన్నారు.
క్యాపిటల్యాండ్ నిర్ణయాన్ని సీఎం రేవంత్ రెడ్డి స్వాగతించారు. క్యాపిటల్యాండ్ గ్రూపు చేపట్టే కొత్త ఐటీ పార్క్ హైదరాబాద్ అభివృద్ధిలో మరో మైలురాయిగా నిలుస్తుందని వ్యాఖ్యానించారు. బ్లూ చిప్ కంపెనీలు కోరుకునే ప్రీమియం సదుపాయాలు, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లకు పెరుగుతున్న డిమాండ్‌ను అందుకునేలా అన్ని సౌకర్యాలను క్యాపిటల్యాండ్ నిర్మించే ఐటీ పార్కులో అందుబాటులో ఉంటాయి. రేవంత్ రెడ్డి సారథ్యంలో హైదరాబాద్ అన్ని రంగాల్లో సుస్థిరంగా వృద్ధి చెందుతోందని, తమ సంస్థ కార్యకలాపాలను తెలంగాణలో విస్తరించటం ఆనందంగా ఉందని క్యాపిటల్యాండ్ సీఈఓ గౌరీ శంకర్ నాగభూషణం తెలిపారు.
క్యాపిటల్యాండ్ సంస్థ ఇప్పటికే హైదరాబాద్ లో ఇంటర్నేషనల్ టెక్ పార్క్, అవాన్స్ హైదరాబాద్, సైబర్‌పెర్ల్ పార్కులను చేపట్టింది. గతంలో ఈ సంస్థ ప్రకటించిన 25 మెగావాట్ల ఐటీ లోడ్ డేటా సెంటర్ ఈ ఏడాదిలో అందుబాటులోకి వస్తుంది. ఐటీపీహెచ్ రెండో దశ ఈ ఏడాదిలో ప్రారంభమై 2028 నాటికి పూర్తి కానుంది.
సీఎం రేవంత్ రెడ్డి బృందం సింగపూర్ పర్యటన ప్రధాన వ్యాపార సంస్థలు, సింగపూర్ బిజినెస్ ఫెడరేషన్ సభ్యులతో వన్-ఆన్-వన్ ప్రత్యేక సమావేశాలతో ముగిసింది. ఐటీ మంత్రి శ్రీధర్ బాబు అధికారుల కలిసి సింగపూర్ లో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి..పలు కంపెనీల ప్రతినిధుతులతో సమావేశమై తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి వివిధ విధానాలు, అవకాశాలపై వివరణాత్మక చర్చలు జరిపారు. ఇండియన్ ఓషన్ గ్రూప్ వ్యవస్థాపకుడు, సీఈవో ప్రదీప్తో బిశ్వాస్, డీబీఎస్ కంట్రీ హెడ్ లిమ్ హిమ్ చౌన్, డీబీఎస్ టెలికాం గ్రూప్ హెడ్ అమిత్ శర్మ, బ్లాక్‌స్టోన్ సింగపూర్ సీనియర్ ఎండీ, ఛైర్మన్ గౌతమ్ బెనర్జీ, బ్లాక్‌స్టోన్ సింగపూర్ రియల్ ఎస్టేట్ సీనియర్ ఎండీ పెంగ్ వీ టాన్, మెయిన్‌హార్డ్ట్ గ్రూప్ సీఈవో ఒమర్ షాజాద్ తో సీఎం రేవంత్ రెడ్డి బృందం భేటీ అయ్యింది.
సంబంధిత కథనం