తాను కక్ష సాధింపునకు పాల్పడితే బీఆర్ఎస్ నేతలు చంచల్‌గూడలో ఉండేవారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. శుక్రవారం సభలో మాట్లాడిన ఆయన… కేసీఆర్, కేటీఆర్ తీరుపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. తనపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపినప్పటికీ.. తాను మాత్రం అక్రమ కేసులు పెట్టలేదని చెప్పుకొచ్చారు.ముఖ్యమంత్రి విచక్షణాధికారాలు ఉపయోగిస్తే మీరు ఒక్కరైనా బయట ఉండేవారా…? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
“నేను కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే మీ ఫ్యామిలీలో అందరూ జైలుకు వెళ్తారు.. ఈ రోజు వరకు కూడా అక్రమ కేసులు పెట్టలేదు. పార్టీ ఆఫీసులో సొంత కూలీలతో పచ్చి బూతులు మాట్లాడించినా కక్ష సాధింపునకు పాల్పడలేదు. ముఖ్యమంత్రి విచక్షణాధికారాలు ఉపయోగిస్తే మీరు ఒక్కరైనా బయట ఉండేవారా..?” అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
“మేం నిజంగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే… వాళ్లు అక్కడ కూర్చుని నోటికొచ్చినట్లు మాట్లాడేవారు కాదు. చంచల్ గూడ జైల్లోనో, చర్లపల్లి జైల్లోనో మమ్మల్ని పెట్టినచోటే ఉండేవారు. డ్రోన్ ఎగరేస్తే రూ. 500 ఫైన్ వేస్తారు.. కానీ అధికారం అడ్డుపెట్టుకుని ఎంపీగా ఉన్న నన్ను చర్లపల్లి జైల్లో పెట్టారు. కరుడు గట్టిన నేరస్తున్ని బంధించినట్లు ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న నన్ను బంధించారు. రాత్రి సమయంలో నిద్ర పట్టేదికాదు. వాళ్ల తప్పులను దేవుడు చూస్తాడు..అంతకు అంత అనుభవిస్తారు అనుకుని ఊరుకున్నా. నా మీద కక్ష చూపిన వారిని దేవుడే ఆసుపత్రిపాలు చేశాడు. చర్లపల్లి జైలు నుంచి నా బిడ్డ లగ్నపత్రిక రాసుకోవడానికి వెళ్లకుండా అడ్డుకున్నారు. రాజకీయ కక్ష సాధింపులంటే మీవి కదా..? అయినా నేను కక్షసాధింపు చర్యలకు పాల్పడలేదు. నిజంగానే నేను కక్ష సాధించాలనుకుంటే మీ కుటుంబమంతా చర్లపల్లి జైల్లో ఉండేవారు. కానీ ఆ పని నేను చేయలేదు.. మేం విజ్ఞత ప్రదర్శించాం. తెలంగాణ సమాజం ఇదంతా గమనిస్తోంది” అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.
గత బీఆర్ఎస్ పాలనలో ఏకమొత్తంలో రూ.లక్ష రుణమాఫీ చేస్తామని చెప్పారని… కానీ ఎన్నికలయ్యాక రుణమాఫీకి ఐదేళ్లు పట్టిందని సీఎం రేవంత్ విమర్శించారు. రెండోసారి రుణమాఫీ చేస్తామని అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు చేయలేదన్నారు. పదేళ్లలో 21 లక్షల మంది రైతులకు రూ.16,908 కోట్లు రుణమాఫీ చేశారని… కానీ తాము మాత్రం 25 లక్షల మంది రైతులకు రూ.20 వేల కోట్లు మాఫీ చేశామని గుర్తు చేశారు.