CM Revanth Reddy: బెనిఫిట్ షోలు, టిక్కెట్ల ధరల పెంపుపై పునరాలోచన లేదన్న సీఎం రేవంత్ రెడ్డి, టాలీవుడ్‌లో టెన్షన్..
CM Revanth Reddy: టిక్కెట్ల ధరల పెంపు, బెనిఫిట్ షోల విషయంలో అసెంబ్లీలో చేసిన ప్రకటన విషయంలో పునరాలోచన లేదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి టాలీవుడ్ సినీ ప్రముఖులకు తేల్చి చెప్పినట్టు తెలుస్తోంది. సినీ పరిశ్రమ పెద్దలతో బంజారాహిల్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సమావేశంలో స్ఫష్టత ఇచ్చారు.
CM Revanth Reddy: తెలుగు సినీ పరిశ్రమకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాట, అల్లు అర్జున్ అరెస్ట్ నేపథ్యంలో టాలీవుడ్ ప్రముఖులతో సీఎం రేవంత్ రెడ్డి గురువారం భేటీ అయ్యారు. ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వం ఎవరిపై కేసులు పెట్టలేదని స్పష్టం చేశారు.
బెనిఫిట్ షోలు, టిక్కెట్ల ధరల పెంపుదలపై అసెంబ్లీలో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉంటానని రేవంత్ రెడ్డి సినీ ప్రముఖులకు చెప్పారు. శాంతి భద్రతల విషయంలో రాజీపడే ప్రసక్తి లేదని సినీ పరిశ్రమ పెద్దలకు సీఎం తేల్చి చెప్పినట్టు తెలుస్తోంది. బెనిఫిట్ షోలు, ఈవెంట్ల నిర్వహణ విషయంలో నిబంధనలు పాటించాల్సిందేనని ముఖ్యమంత్రి సినీ ప్రముఖులకు చెప్పినట్టు తెలుస్తోంది. ధరల విషయంలో మరోసారి పునరాలోచించాలని సినీ పరిశ్రమ పెద్దలు ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. పెద్ద సినిమాలు, భారీ బడ్జెట్ సినిమాల విషయంలో టిక్కెట్ల పెంపుదలకు అనుమతించకపోతే నష్టపోతామని వివరించే ప్రయత్నం చేశారు.
మర్రి చెన్నారెడ్డి, అక్కినేని వల్ల సినీ పరిశ్రమ హైదరాబాద్‌కు తరలి వచ్చిందని సినీ పెద్దలు ముఖ్యమంత్రికి వివరించారు. సినీ పరిశ్రమకు కావాల్సిన అన్ని రకాలుగా సాయం చేస్తామని ముఖ్యమంత్రి వారికి భరోసా ఇచ్చారు. అదే సమయంలో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడే పరిస్థితులు రాకూడదని వారికి సూచించారు. సినీ షూటింగ్‌లకు రాయితీలు కల్పించాలని కోరడంతో దానిపై నిర్ణయం తీసుకోడానికి కమిటీ ఏర్పాటు చేస్తామని భరోసా ఇచ్చారు.
ఎలక్షన్ రిజల్ట్ రోజు ఎలా ఉంటుందో, సినిమా రిలీజ్ రోజు అభిమానుల నుంచి స్పందన అలాగే ఉంటుందని సినీ పరిశ్రమ ప్రతినిధులు ముఖ్యమంత్రికి వివరించే ప్రయత్నం చేసినట్టు తెలుస్తోంది. సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటన దురదృష్టకరమని, అది జరగకుండా ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. సినీ పరిశ్రమ తరపున పలు సూచనలు, వినతుల్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. ప్రభుత్వం నుంచి అన్ని విధాలుగా సహకరిస్తామని, సినీ పరిశ్రమను వేధించే ఉద్దేశం తమకు లేదని ముఖ్యమంత్రి వివరణ ఇస్తూనే, శాంతి భద్రతల విషయంలో పోలీసుల సూచనలు పాటించాలని సూచించారు. ముందస్తు భద్రత ఏర్పాట్లు పకడ్బందీగా చేస్తేనే ఈవెంట్లకు అనుమతిస్తామని సీఎం పేర్కొన్నారు.
సినిమా టిక్కెట్లపై విధించే సెస్‌ను ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణానికి వినియోగించే అంశంపై ఆలోచిస్తున్నట్టు చెప్పారు. డ్రగ్స్, మాదక ద్రవ్యాల కట్టడి అంశంపై ప్రచారంలో సామాజిక బాధ్యతగా సినీతారలు పాల్గొనాలని ముఖ్యమంత్రి సూచించారు. పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా ఏమి జరిగిందో వీడియోలను ప్రదర్శించి సినీ పెద్దలకు వివరించారు.
బెనిఫిట్ షోలు, టిక్కెట్ల పెంపు ఇకపై ఉండదని సీఎం రేవంత్ రెడ్డి సినీ ప్రముఖులకు తేల్చి చెప్పారు. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహించాలని దర్శకుడు రాఘవేంద్ర రావు సూచించడంతో దానికిి సుముఖత తెలిపారు. ఈ సమావేశంలో తెలుగు సినీ పరిశ్రమకు చెందిన నిర్మాతలు, నటులు, దర్శకులు పాల్గొన్నారు. టిక్కెట్ల ధరల పెంపుకు మాత్రం అనుమతించమని ముఖ్యమంత్రి తేల్చి చెప్పినట్టు తెలుస్తోంది. ఈ సమావేశంలో సీఎంతో పాటు మంత్రులు భట్టి విక్రమార్క, కోటమిరెడ్డి, డీజీపీ పాల్గొన్నారు. ఎఫ్‌డిసి ఛైర్మన్ దిల్ రాజు, నటులు నాగార్జున, వెంకటేష్, మురళీమోహన్, అల్లు అరవింద్ తదితరులు పాల్గొన్నారు.