CM Revanth Reddy : భూసమస్యలకు శాశ్వత పరిష్కారం 'భూ భారతి', ఇందిరమ్మ ఇండ్ల జాబితా ఖరారుపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు-cm revanth reddy says bhu bharathi permanent solution land problems key orders on indiramma houses ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Cm Revanth Reddy : భూసమస్యలకు శాశ్వత పరిష్కారం 'భూ భారతి', ఇందిరమ్మ ఇండ్ల జాబితా ఖరారుపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

CM Revanth Reddy : భూసమస్యలకు శాశ్వత పరిష్కారం 'భూ భారతి', ఇందిరమ్మ ఇండ్ల జాబితా ఖరారుపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

CM Revanth Reddy : రెవెన్యూ చట్టాలు మార్చి తెచ్చిన ధరణి ప్రజల పాలిట భూతంగా మారిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకే భూభారతిని ప్రారంభిస్తున్నామన్నారు. ఇందిరమ్మ ఇండ్లపై కీలక ఆదేశాలు జారీ చేశారు.

భూసమస్యలకు శాశ్వత పరిష్కారం 'భూ భారతి', ఇందిరమ్మ ఇండ్ల జాబితా ఖరారుపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

CM Revanth Reddy : 'తెలంగాణ ప్రాంతంలో పోరాటాలన్నీ భూమితోనే ముడిపడి ఉన్నాయి. గత పాలకులు రెవెన్యూ చట్టాలను మార్చి తెచ్చిన ధరణి ప్రజల పాలిట భూతంగా మారింది' అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. “భూ భారతి” ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ...కొమురం భీమ్ జల్ జమీన్ జంగిల్ పోరాటం, సాయుధ రైతాంగ పోరాటం, కమ్యూనిస్టు సోదరుల పోరాటాలన్నీ భూమి కోసమే జరిగాయన్నారు. తహసీల్దార్ పైనే పెట్రోల్ పోసి తగలబెట్టే పరిస్థితి తీసుకొచ్చారన్నారు. రెవెన్యూ అధికారులను దోపిడీదారులుగా చిత్రీకరించి లబ్ది పొందాలని ఆనాటి పాలకులు ఆలోచన చేశారని ఆరోపించారు.

వివాదరహిత భూవిధానాలు

"చట్టాలను చట్టాలుగా మార్చుకుని వేలాది ఎకరాలు కొల్లగొట్టిన మాట వాస్తవం కాదా? అందుకే పేదలకు మేలు చేసేందుకు నూతన ఆర్వోఆర్ చట్టాన్ని తీసుకొచ్చాం. భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకే భూ భారతిని ప్రారంభించుకున్నాం. పైలట్ ప్రాజెక్టుగా నాలుగు మండలాల్లో చేపడుతున్నాం. వివాదరహిత భూ విధానాలను తీసుకురావాలని మా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ చట్టాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత రెవెన్యూ అధికారులపైనే ఉంది. రెవెన్యూ అధికారులను ప్రజలకు చేరువ చేయాలనేదే మా ఉద్దేశం. గత పాలకుల్లా మిమ్మల్ని ప్రజల ముందు దోషులుగా నిలబెట్టే ఆలోచనకు మేం వ్యతిరేకం" -సీఎం రేవంత్ రెడ్డి

'ఆనాటి ముఖ్యమంత్రి రెవెన్యూ అధికారులపై అసెంబ్లీ సాక్షిగా ఏం మాట్లాడారో మీకు తెలుసు. మేం అవినీతికి పాల్పడే వ్యక్తులపైన కఠినంగా ఉంటాం.. కానీ వ్యవస్థపై కాదు. మేం చేసే తప్పులకు మిమ్మల్ని దోషులుగా నిలబెట్టే విధానానికి నేను వ్యతిరేకం. భవిష్యత్ లో ఆధార్ లాగే భూమికి సంబంధించి భూధార్ తీసుకొస్తాం. రాబోయే రోజుల్లో వ్యవసాయ భూములను సర్వే చేసి కొలతలు వేసి హద్దులు గుర్తిస్తాం. రెవెన్యూ అధికారులపై దురుద్దేశంతో కొందరు కల్పించిన అపోహలను తొలగిద్దాం. కలెక్టర్లు ప్రతీ మండలంలో పర్యటించాలని ఈ వేదికగా స్పష్టమైన ఆదేశాలు ఇస్తున్నాను. అందరి సహకారంతో చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయండి' -సీఎం రేవంత్ రెడ్డి

రైతుల భూస‌మ‌స్యల శాశ్వత ప‌రిష్కార‌మే ధ్యేయంగా ఎంతో అధ్యయ‌నంతో తీసుకొచ్చిన భూభార‌తి చ‌ట్టాన్ని క్షేత్ర స్థాయికి స‌మర్థంగా తీసుకెళ్లాల‌ని సీఎం రేవంత్ రెడ్డి

జిల్లా కలెక్టర్లకు నిర్ధేశించారు. ఈ చట్టంపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి ప్రతి మండ‌లంలో స‌ద‌స్సు నిర్వహించాల‌ని, ప్రతి క‌లెక్టర్ మండ‌ల స్థాయి స‌ద‌స్సుల‌కు హాజ‌రై అక్కడ రైతులు, ప్రజ‌లు లేవ‌నెత్తే సందేహాల‌కు వారికి అర్ధమ‌య్యే భాష‌లో వివ‌రించి ప‌రిష్కారం చూపాల‌ని చెప్పారు. హైద‌రాబాద్‌లోని మ‌ర్రి చెన్నారెడ్డి మాన‌వ వ‌న‌రుల అభివృద్ధి సంస్థలో కలెక్టర్లతో నిర్వహించిన స‌మావేశంలో భూ భార‌తి, ఇందిర‌మ్మ ఇండ్లు, వేస‌వి తాగు నీటి ప్రణాళిక‌లపై సీఎం దిశానిర్దేశం చేశారు.

అప్పీల్ వ్యవస్థపై అవగాహన

భూ భార‌తి, ఇందిర‌మ్మ ఇండ్లను తాము ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామ‌ని, ఈ రెండింటిని క్షేత్ర స్థాయికి తీసుకెళ్లడంలో క‌లెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ చూపాల‌ని ముఖ్యమంత్రి చెప్పారు. భూ భార‌తి చ‌ట్టాన్ని క‌లెక్టర్లు స‌మ‌గ్రంగా అధ్యయ‌నం చేయాల‌ని, గ‌తంలో రెవెన్యూ స‌మ‌స్యల ప‌రిష్కారాన్ని ప‌ట్టించుకోకుండా రైతుల‌ను న్యాయ‌స్థానాల‌కు పంపార‌న్నారు. భూభార‌తి చ‌ట్టంలో రెవెన్యూ యంత్రాగ‌మే ఆయా స‌మ‌స్యల ప‌రిష్కారానికి కృషి చేస్తుంద‌ని, అప్పీల్ వ్యవ‌స్థ ఉన్న విష‌యాన్ని రైతులు, ప్రజ‌ల‌కు వెల్లడించాల‌ని తెలిపారు.

భూభార‌తి పైలెట్ ప్రాజెక్టు స‌ద‌స్సుల‌ను నారాయ‌ణ‌పేట జిల్లా మ‌ద్దూర్‌, ఖ‌మ్మం జిల్లా నేల‌కొండ‌ప‌ల్లి, కామారెడ్డి జిల్లా లింగంపేట‌, ములుగు జిల్లా వెంక‌టాపూర్ మండ‌లాల్లో నిర్వహిస్తార‌ని, ఆయా మండ‌ల కేంద్రాల్లో స‌ద‌స్సుల‌కు క‌లెక్టర్లు క‌చ్చితంగా హాజ‌రుకావాల‌ని, ఆయా మండ‌లాల్లో ప్రతి గ్రామంలో రెవెన్యూ సిబ్బందితో స‌ద‌స్సులు నిర్వహించాల‌ని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆయా స‌ద‌స్సుల‌కు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్‌రెడ్డి, ఇత‌ర మంత్రులు హాజ‌రువుతార‌ని తెలిపారు.

ఇందిరమ్మ ఇండ్లు- ప్రత్యేక అధికారి

ఇందిర‌మ్మ ఇండ్ల నిర్మాణ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నందున గ్రామస్థాయిలో ఇందిర‌మ్మ ఇండ్ల క‌మిటీలు ఆమోదం పొందిన జాబితాను మండ‌ల స్థాయి క‌మిటీలు ప‌రిశీలించాల‌ని సీఎం సూచించారు. ఆ క‌మిటీల ప‌రిశీల‌న అనంత‌రం జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రికి పంపాల‌ని.. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి ఆమోదించాకే ఇండ్ల జాబితా ఖ‌రార‌వుతుంద‌ని సీఎం స్పష్టం చేశారు. ఈ వ్యవ‌హారం స‌క్రమ ప‌ర్యవేక్షణ‌కు ప్రతి నియోజ‌క‌వ‌ర్గానికి ప్రత్యేక అధికారిని నియ‌మించాల‌ని ప్రభుత్వ ప్రధాన కార్యద‌ర్శిని ఆదేశించారు. ఈ ప్రత్యేకాధికారి ఇందిర‌మ్మ క‌మిటీలు, మండ‌ల క‌మిటీలు, క‌లెక్టర్లు, ఇన్‌ఛార్జి మంత్రి మ‌ధ్య స‌మ‌న్వయ‌క‌ర్తగా ఉంటార‌ని చెప్పారు.

వేస‌వి కాలంలో ఎక్కడా తాగునీటి స‌మ‌స్య త‌లెత్తకుండా క‌లెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ చూపాల‌ని సీఎం సూచించారు. తాగునీటి స‌ర‌ఫ‌రా విష‌యంలో నీటి పారుద‌ల శాఖ‌, తాగు నీటి స‌ర‌ఫ‌రా శాఖ‌, విద్యుత్ శాఖ స‌మ‌న్వయంతో ప‌నిచేయాల‌ని చెప్పారు. ప్రతి గ్రామంలో తాగునీటి వనరులు, సరఫరాపై పర్యవేక్షించాలని చెప్పారు.

బండారు.సత్యప్రసాద్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలు, పొలిటికల్ వార్తలను రాస్తారు. అలాగే ఆరోగ్యం, విద్యా ఉద్యోగ, లైఫ్ స్టైల్ వార్తలు రాస్తారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిజం(MJMC) పీజీ చేశారు. గతంలో ఈటీవీ భారత్, ఇన్ షార్ట్స్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు. సత్యప్రసాద్ 2023లో హెచ్.టి.తెలుగులో చేరారు.

సంబంధిత కథనం