తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అనేక కార్యక్రమాలు, అనుసరిస్తున్న విధానాలు దేశానికి దిశానిర్దేశం చేస్తున్నాయని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. సామాజిక న్యాయంతో పాటు ఇతర అంశాల్లో తెలంగాణ మాడల్‌ను కేంద్ర ప్రభుత్వం కూడా అనుసరించాల్సిన పరిస్థితి ఉందన్నారు.
బెంగుళూరు వేదికగా “ది హిందూ” పత్రిక నిర్వహించిన సదసులో సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. పెట్టుబడుల కోసం ప్రపంచ దేశాలు చైనా ప్లస్ వన్ ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్న తరుణంలో దానిని అందిపుచ్చుకోవాలన్న ఆలోచనతో అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్టు వివరించారు. రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాల అమలుతో పాటు అభివృద్ధి ప్రణాళికతో ముందుకు వెళుతున్నామని వాటిని సమగ్రంగా తెలియజేశారు.
తాము డీలిమిటేషన్‌కు వ్యతిరేకం కాదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కానీ ముందు కేంద్ర ప్రభుత్వం ఆ ప్రక్రియకు సంబంధించి అన్ని పార్టీలతో సంప్రదింపులు జరిపాలన్నారు. అందుకు ప్రాతిపదికను స్పష్టంగా వెల్లడించాలని కోరారు. అన్ని రాష్ట్రాలకు సమన్యాయం కావాలన్నదే తమ డిమాండ్ అని చెప్పుకొచ్చారు. అభివృద్ధి సాధిస్తున్న రాష్ట్రాలను శిక్షించకూడదన్న ఆయన…. ఇది సామాజిక, రాజకీయ న్యాయానికి సంబంధించిన అంశమని వ్యాఖ్యానించారు. అందుకే చర్చ జరగాలని అడుగుతున్నామని చెప్పారు.
సంబంధిత కథనం