TG Samagra Kutumba Survey : సమగ్ర కుటుంబ సర్వే అప్డేట్స్ - సిద్ధమైన ముసాయిదా..!
రాష్ట్రంలో విజయవంతంగా పూర్తి చేసిన సమగ్ర కుల గణనపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. అధికారులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. సర్వేకు సంబంధించిన ముసాయిదా సిద్దమయిందనైట్లు అధికారులు వివరించారు.
రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర కుటుంబ సర్వే జరిగిన సంగతి తెలిసిందే. దీనిపై ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా సర్వే జరిగిన తీరుతో పాటు ముసాయిదా రూపకల్పనపై వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… రాష్ట్రంలో చేపట్టిన సమగ్ర ఇంటింటి సర్వే దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిందన్నారు. జాతీయ స్థాయిలో సర్వే ప్రశంసలు అందుతున్నాయని చెప్పారు. సర్వే విజయవంతంగా చేపట్టిన అధికారులను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అభినందించారు.
సిద్ధమైన ముసాయిదా…!
ఈ సమావేశంలో ప్రధానంగా సమగ్ర కుటుంబ సర్వే ముసాయిదాపై చర్చించారు. సర్వే కు సంబంధించిన ముసాయిదా సిద్దమయిందని అధికారులు చెప్పారు. ఒకటి రెండు రోజుల్లో సమర్పిస్తామని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. పూర్తి నివేదికను ఫిబ్రవరి 2వ తేదీ లోగా కేబినెట్ సబ్ కమిటీ కి అందజేస్తామని వివరించారు.
గతేడాది నవంబర్ లో సర్వే:
తెలంగాణ వ్యాప్తంగా గతేడాది నవంబర్ లో సమగ్ర కుటుంబ సర్వేను చేపట్టిన సంగతి తెలిసిందే. నవంబర్ 8వ తేదీ వరకు కుటుంబాలను గుర్తించి గృహాలకు స్టిక్కర్లు అంటించారు. అనంతరం ఇంటింటి సర్వే చేపట్టారు. ఓ వైపు సర్వే కొనసాగుతుండగానే మరో వైపు సేకరించిన సర్వే వివరాలను ఆన్‌లైన్‌లో డేటాను ఎంట్రీ పూర్తి చేస్తూ వచ్చారు.
ఇక డేటా ఎంట్రీలో ఎలాంటి తప్పులు దొర్లకుండా తగ్గిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేస్తూ వచ్చింది. ఎలాంటి తప్పులకు అవకాశం ఇవ్వొద్దని సూచించింది. క్షేత్రస్థాయిలో ఎంపీడీవోలు, తహసీల్దార్లతో పాటు ఇతర అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేశారు. సర్వే వివరాలు బయటకు వెళ్లకుండా పకడ్బందీ చర్యలు చేపట్టింది.
అన్ని జిల్లాల నుంచి వచ్చిన వివరాలను క్రోడీకరించి… ముసాయిదాను సిద్ధం చేసే పనిలో ప్రభుత్వం ఉంది. ఇది కూడా పూర్తి కావొచ్చినట్లు అధికారులు తాజాగా తెలిపారు. ఫిబ్రవరి 2వ తేదీలోగా కేబినెట్ సబ్ కమిటీ కి ఈ ముసాయిదా అందనుంది. ఆ తర్వాత ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
సంబంధిత కథనం