CM Revanth Reddy : డెస్టినేష‌న్ వెడ్డింగ్‌ల‌కు తెలంగాణ‌ను వేదిక‌గా మార్చాలి- సీఎం రేవంత్ రెడ్డి-cm revanth reddy review on tourism department orders better facilities campaigns ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Cm Revanth Reddy : డెస్టినేష‌న్ వెడ్డింగ్‌ల‌కు తెలంగాణ‌ను వేదిక‌గా మార్చాలి- సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy : డెస్టినేష‌న్ వెడ్డింగ్‌ల‌కు తెలంగాణ‌ను వేదిక‌గా మార్చాలి- సీఎం రేవంత్ రెడ్డి

Bandaru Satyaprasad HT Telugu
Updated Feb 14, 2025 09:46 PM IST

CM Revanth Reddy : పర్యాటక శాఖను ఆదాయ, ఉపాధి వనరుగా మార్చేందుకు ప్రణాళికలు వేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాల్లో మెరుగైన వసతులు మెరుగుపరిచి, ప్రచారం కల్పించాలని సూచించారు.

డెస్టినేష‌న్ వెడ్డింగ్‌ల‌కు తెలంగాణ‌ను వేదిక‌గా మార్చాలి- సీఎం రేవంత్ రెడ్డి
డెస్టినేష‌న్ వెడ్డింగ్‌ల‌కు తెలంగాణ‌ను వేదిక‌గా మార్చాలి- సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy : రాష్ట్రానికి ఆదాయం స‌మ‌కూర్చడంతో పాటు యువ‌త‌కు ఉపాధి క‌ల్పించే వ‌న‌రుగా ప‌ర్యాట‌క శాఖ ప్రణాళికలు ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ఘనమైన తెలంగాణ చ‌రిత్రను వ‌ర్తమానానికి అనుసంధానిస్తూ, భ‌విష్యత్‌కు బాట‌లు వేసేలా ప‌ర్యాట‌క శాఖ‌ను తీర్చిదిద్దాలని సూచించారు. శుక్రవారం పర్యాటక శాఖ కార్యాచరణపై సీఎం ఉన్నతాధికారుల సమావేశంలో సమీక్షించారు. ప‌ర్యాట‌కుల‌ను ఆక‌ర్షించే వ‌న‌రులు తెలంగాణలో ఉన్నప్పటికీ గ‌తంలో సరైన ప్రణాళికలు అమలు చేయలేదన్నారు. ఈ కారణంగా ఆ రంగంలో ఆశించిన ప్రగతి కనిపించలేదని చెప్పారు.

డెస్టినేషన్ వెడ్డింగ్ లకు వేదికగా

ప‌ర్యాట‌క శాఖ పాల‌సీకి తుది రూపు ఇచ్చే స‌మ‌యంలో అట‌వీ, ఐటీ, విద్యుత్‌, టీజీ ఐఐసీ, వైద్య, క్రీడ‌ల శాఖ‌ల‌తో స‌మ‌న్వయం చేసుకోవాల‌ని, ఒక శాఖ విధానాలు మ‌రో శాఖ విధానాలకు ఆటంకంగా ఉండ‌కుండా జాగ్రత్తలు తీసుకోవాల‌ని సీఎం అధికారులకు సూచించారు. సెమీ అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లో పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టే వారికి ప్రోత్సాహాకాలు కల్పించాలన్నారు. నాగార్జున సాగ‌ర్‌ బ్యాక్ వాట‌ర్‌లో బోట్ హౌస్‌ అందుబాటులో ఉంచాలన్నారు. డెస్టినేష‌న్ వెడ్డింగ్‌ల‌కు తెలంగాణ‌ను వేదిక‌గా మార్చాల‌ని సీఎం సూచించారు.

ఆల‌యాలు, పులుల అభ‌యార‌ణ్యాల‌కు ప‌ర్యాట‌కంలో ప్రత్యేక ప్రాధాన్యం ఉంద‌ని గుర్తుచేస్తూ ఆ దిశ‌గా దృష్టి సారించి అవ‌స‌ర‌మైన చ‌ర్యలు తీసుకోవాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. భ‌ద్రాచ‌లం, స‌లేశ్వరం, రామ‌ప్ప వంటి ఆల‌యాలు, మల్లెల తీర్ధం, బొగ‌త జ‌ల‌పాతాలు, బౌద్ధ స్తూపాలు, జైన ఆల‌యాలు ఇలా ప్రతి ప‌ర్యాట‌క ప్రదేశంలో వ‌స‌తులు మెరుగుప‌ర్చడంతో పాటు స‌రైన ప్రచారం క‌ల్పించాల‌ని సూచించారు.

భువనగిరి కోట రోప్ వే

భువ‌న‌గిరి కోట రోప్ వే ప‌నుల‌పైనా సీఎం ఆరా తీశారు. భూ సేక‌ర‌ణ‌లో కొంత జాప్యం జ‌రిగింద‌ని... ఇప్పుడు భూసేక‌ర‌ణ పూర్తయినందున త్వర‌లో టెండ‌ర్లు పిలుస్తామ‌ని అధికారులు సీఎంకు వివరించారు. రోప్ వే ప‌నుల‌కు టెండ‌ర్లు పిల‌వ‌డంతో పాటు కోట‌పై ఉన్న చారిత్రక క‌ట్టడాల ప‌రిర‌క్షణ‌కు అవ‌స‌ర‌మైన చ‌ర్యలు తీసుకోవాల‌ని సీఎం ఆదేశించారు.

పర్యాటక శాఖ బడ్జెట్ కేటాయింపు పెరిగేలా

అడ్వెంచ‌ర్ స్పోర్ట్స్‌కు ప‌ర్యాట‌క శాఖ‌లో ప్రాధాన్యత ఇవ్వాల‌ని సీఎం అన్నారు. వైద్య అవ‌స‌రాల‌కు విదేశాల నుంచి వ‌చ్చే వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప‌ర్యాట‌కుల్లా వ‌చ్చిపోయేలా అన్ని చ‌ర్యలు తీసుకోవాల‌ని ఆదేశించారు. ప‌ర్యాట‌క శాఖ‌కు బడ్జెట్ కేటాయింపులు పెరిగేలా చూస్తామ‌ని తెలిపారు. ఈ సమావేశంలో ప‌ర్యాట‌క శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, సీఎస్ శాంతి కుమారితో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Bandaru Satyaprasad

TwittereMail
సత్యప్రసాద్ బండారు హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలు, పొలిటికల్ వార్తలను రాస్తారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిజం(MJMC) పీజీ చేశారు. గతంలో ఈటీవీ భారత్, ఇన్ షార్ట్స్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు. సత్యప్రసాద్ 2023లో హెచ్.టి.తెలుగులో చేరారు.
Whats_app_banner

సంబంధిత కథనం