Ganesh Immersion : సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టండి.. సీఎం రేవంత్ ఆదేశాలు
Ganesh Immersion : హైదరాబాద్, తెలంగాణ వ్యాప్తంగా గణపతి నిమజ్జనానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. పోలీస్, ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలో.. గణేష్ నిమజ్జనం, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. కీలక ఆదేశాలు ఇచ్చారు.
గణేష్ నిమజ్జన ఏర్పాట్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ఈ సమీక్షకు హాజరయ్యారు. 733 సీసీ కెమెరాలతో నిమజ్జనాల పర్యవేక్షణ ఉంటుందని సీపీ వివరించారు. ట్యాంక్ బండ్, మండపాలు, చెరువుల దగ్గర ఏర్పాట్లు పూర్తి చేసినట్టు చెప్పారు. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం రేవంత్ సూచించారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సీఎం ఆదేశించారు.
హైదరాబాద్ మహా నగరంలో గణేష్ నిమజ్జనం నేపథ్యంలో.. జీహెచ్ఎంసీ కమిషనర్ అమ్రపాలి కాట ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 'వినాయక నిమజ్జనం సందర్భంగా.. మిషన్లతో గాల్లోకి కలర్ కాగితాలు ఎగేరేయటం అప్పటికప్పుడు మీకు తాత్కాలికంగా వినోదంగా అనిపించవచ్చు. కానీ ఆ రోడ్లన్నీ శుభ్రపరచడానికి ఆ చెత్తను సేకరించటానికి జీహెచ్ఎంసీ సిబ్బందికి కొన్ని రోజులు పట్టి.. కష్టమవుతుంది. అలాగే ఆ చెత్త.. డ్రైనేజ్ నీరు పోయే మార్గాల్లో ఇరుక్కుని రోడ్డుపై వరదకు కారణం అవుతుంది. ఇలాంటి రంగుల కాగితాలు, ప్లాస్టిక్‌తో కూడుకున్న రిబ్బన్లు రోడ్లపై ఎగరేయద్దు' అని ఆమ్రపాలి కాట విజ్ఞప్తి చేశారు.
గణేష్ నిమజ్జనం నేపథ్యంలో.. హైదరాబాద్ పోలీసులు అలర్ట్ అయ్యారు. సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. శోభాయాత్ర జరిగే రోజు పాటించాల్సిన నియమాలను వివరించారు. పోలీసులకు భక్తులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
నిమజ్జనం రోజున పాటించాల్సిన నియమాలు..
1.గణేష్ నిమజ్జనానికి ఒక వాహనాన్ని మాత్రమే అనుమతిస్తారు.
2.నిమజ్జనం కోసం విగ్రహాన్ని తీసుకెళ్లే వాహనంపై సౌండ్ బాక్స్‌లు, డీజేలు అమర్చొద్దు.
3.నిమజ్జనం కోసం విగ్రహాలను తీసుకెళ్లే వాహనంలో మద్యం, ఇతర మత్తు పధార్థాలను, మద్యం తాగిన వ్యక్తులను అనుమతించరు.
4.గణపతి నిమజ్జనం ఊరేగింపులో కర్రలు, కత్తులు, మండే పధార్థాలు, ఇతర ఆయుధాలను తీసుకురావొద్దు.
5.వెర్మిలియన్, కుంకుమ్, గులాల్‌ను సామాన్య ప్రజలపై జల్లకూడదు.
6.గణేష్ ఊరేగింపులో రాజకీయ ప్రసంగాలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు, రెచ్చగొట్టే నినాదాలు చేయొద్దు.
7.గణపతి ఊరేగింపు సమయంలో బాణాసంచా పేల్చొద్దు.
8.పోలీసులు ఇచ్చే సలహాలు, సూచనలు కచ్చితంగా పాటించాలి.
9.ఏదైనా అత్యవసర పరిస్థితి ఎదురైతే.. వెంటనే డయల్ 100 కి ఫోన్ చేయాలి.