జనగణనలో కుల గణన చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపాదించారు. కుల గణనలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. బెళగావిలో గురువారం జరిగిన సీడబ్ల్యూసీ సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించారు. కులగణన చేపట్టడం ద్వారా తెలంగాణ దేశానికే మార్గదర్శిగా ఉందన్నారు.
కేంద్ర ప్రభుత్వం వచ్చే ఏడాది దేశవ్యాప్తంగా చేపట్టనున్న జనగణనలో కులగణన కూడా చేపట్టాలని.. ఈ విషయపై కాంగ్రెస్ పోరాటం చేయాలన్నారు. ఈ విషయంలో సీడబ్ల్యూసీ ఒక తీర్మాన చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ఈ ప్రతిపాదనకు సీడబ్ల్యూసీ ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించింది.
త్వరలో చేప్టటనున్న నియోజకవర్గాల పునర్విభజనలోనూ ఏఐసీసీ తగు జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన చేస్తే దక్షిణాది రాష్ట్రాలు ఎక్కువగా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. ఈ విషయంలో ఏఐసీసీ వ్యూహాత్మకంగా వ్యవహరించి… అత్యంత జాగ్రత్తగా ముందడుగు వేయాలన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన మహిళా బిల్లు కొలిక్కి వచ్చిన నేపథ్యంలో దానిపై కాంగ్రెస్ పార్టీనే ఎక్కువగా ప్రచారం చేయాల్సి ఉందని రేవంత్ రెడ్డి సూచించారు. మహిళా బిల్లు విషయంలోనూ బీజేపీ రిజర్వేషన్లను తనకు అనుకూలంగా చేసుకునే అవకాశాలున్నందున కాంగ్రెస్ అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని వ్యాఖ్యానించారు.
రాహుల్ గాంధీ ఆలోచనల మేరకు కులగణనతో దేశంలో విప్లవాత్మకమైన మార్పులు వస్తాయని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. దీన్ని దేశమంతా స్వాగతించాల్సిన అవసరం ఉందన్నారు. కులాల పేరిట, మతాల పేరిట రాజకీయాలు చేస్తూ దేశాన్ని విభజించి పాలిస్తూ రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్న బీజేపీ కుటిల రాజకీయ ఎత్తుగడలకు కులగణన చెంపపెట్టు లాంటిదని వ్యాఖ్యానించారు.
కులగణనకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి దానిని ప్రారంభించడం ద్వారా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం దేశానికి ఆదర్శంగా నిలిచిందని మహేశ్ కుమార్ చెప్పారు. అద్భుతమైన ప్రశ్నావళి రూపొందించి తెలంగాణలో కులగణన సర్వే చేపట్టామని… ఇప్పటికే 90 శాతం పూర్తయిందని చెప్పారు.
సంబంధిత కథనం