Cognizant Campus Inauguration : పక్క రాష్ట్రం వాళ్లు పోటీనే కాదు, ప్రపంచంతోనే మా పోటీ - సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు
కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన… పెట్టుబడులు పెట్టే ప్రతి సంస్థకు ప్రభుత్వం తరపున సాకారం ఉంటుందన్నారు. తమకు పక్క రాష్ట్రాలతో పోటీ లేదని… ప్రపంచంతోనే పోటీ ఉంటుందని వ్యాఖ్యానించారు.
హైదరాబాద్ లోని కోకాపేటలో నిర్మించిన కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఐటీ మంత్రి శ్రీధర్‌బాబతో పాటు సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. కాగ్నిజెంట్ సంస్థకు అభినందనలు తెలిపారు.
హైటెక్ సిటీ నిర్మాణంతో హైదరాబాద్ నగరానికి పెట్టుబడులు వచ్చాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు... సైబరాబాద్ నగరాన్ని నిర్మించారని చెప్పారు. ప్రతి రంగంలోనూ హైదరాబాద్ రాణిస్తోందన్నారు. అంతర్జాతీయంగా హైదరాబాద్ నగరానికి గుర్తింపు ఉందన్న సీఎం రేవంత్ రెడ్డి…. తెలంగాణలో అత్యధిక ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న రెండో అతిపెద్ద సంస్థగా కాగ్నిజెంట్ ఉందని పేర్కొన్నారు.
తెలంగాణలో టాటాతో పోటీ పడి ఉద్యోగాలు కల్పిస్తున్న సంస్థగా కాగ్నిజెంట్ ఉందని ముఖ్యమంత్రి చెప్పారు. ఇక్కడి నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తోందని అన్నారు. కుత్ బ్ షాహీల కాలం నుంచి చంద్రబాబు పాలన వరకు కూడా హైదరాబాద్ అభివృద్ధి ఆగలేదన్నారు. సిద్ధాంతపరంగా వైరుద్యాలు ఉన్నప్పటికీ హైదరాబాద్ నగర అభివృద్ధిపై ప్రభావం పడలేదని గుర్తు చేశారు. రాజకీయాలకు అతీతంగా నగరాభివృద్ధి కృషి చేశారని చెప్పారు.
ప్రపంచంతోనే మా పోటీ - సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన సంస్థలకు అన్ని విధాలుగా సాకారం ఉంటుంది. హైదరాబాద్ నగరాన్ని మరింత విస్తరిస్తాం. ప్రపంచ అవసరాలను తీర్చేందుకే నాల్గో నగరాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఎయిర్ పోర్టుకు దగ్గర్లోనే ప్యూచర్ సిటీని నిర్మించబోతున్నాం. కాగ్నిజెంట్ కూడా ఇందులో భాగం కావాలి. ఏపీలో ప్రభుత్వం మారిన తర్వాత హైదరాబాద్ లో పెట్టుబడులు తగ్గాయని అంటున్నారు. ఇందులో వాస్తవం లేదు. అసలు ఏపీ, కర్ణాటక వంటి రాష్ట్రాలు మాకు పోటీనే కాదు. మా పోటీ ప్రపంచంతోనే. హైదరాబాద్ వంటి మహా నగరం మన దగ్గర ఉంది. పక్క రాష్ట్రాలకు హైదరాబాద్ వంటి నగరం లేదు. అంతర్జాతీయ ఎయిర్ పోర్టులు లేవు. దేశంలోనే ఎక్కడ లేని విధంగా హైదరాబాద్ లో మంచి వాతావరణ ఉంది" అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
“పెట్టుబడులకు సంబంధించి సమావేశాల నిర్వహణ కోసం ఇన్వెస్టర్ టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తాం. మూడు రింగ్స్ ఉన్నాయి. మొదటిది కోర్ అర్బన్ ఏరియా హైదరాబాద్. రెండోది సెమీ-అర్బన్ ఏరియా.. ఇక్కడ మేము తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నాం. మూడోది రీజనల్ రింగ్ రోడ్ బయట ఉన్న రూరల్ తెలంగాణ. అన్ని రకాల ఆధునిక సౌకర్యాలతో ఆసియాలోనే అత్యుత్తమ గ్రామాలను ఇక్కడ అభివృద్ధి చేస్తాం. వచ్చే 10 ఏళ్లలో తెలంగాణను ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలనేది మా సంకల్పం. రాజకీయంగా భిన్నాభిప్రాయాలు ఉన్నా.. హైదరాబాద్ ను అభివృద్ధి చేయడంలో ఎలాంటి భేషజాలు లేవు. రండి పెట్టుబడులు పెట్టండి.. మీకు కావలసిన సౌకర్యాలను తెలంగాణ ప్రభుత్వం అందిస్తుంది” అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు.
ముగిసిన విదేశీ పర్యటన….
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం విదేశీ పర్యటన ముగిసింది. పెట్టుబడుల లక్ష్య సాధనలో సరికొత్త రికార్డు నమోదైనట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణకు భారీగా పెట్టుబడులు వెల్లువెత్తాయని తెలిపింది.
అమెరికా పర్యటనలో రూ.31502 కోట్ల పెట్టుబడులు రాగా.. చివరి రెండు రోజుల దక్షిణ కొరియా పర్యటనలోనూ అదే స్పందన వెల్లువెత్తింది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు దక్షిణ కొరియాకు చెందిన ప్రపంచస్థాయి కంపెనీలు ముందుకు వచ్చాయి. రూ.4500 కోట్ల పెట్టుబడులకు అక్కడి కంపెనీలు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నాయి. దీంతో అమెరికా, దక్షిణ కొరియా పర్యటనతో మొత్తం రూ.36 వేల కోట్ల పెట్టుబడులను తెలంగాణ సాధించింది. మొత్తం 25 కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది. ఆయా రంగాల్లో కొత్త సంస్థలు, కొత్త పరిశ్రమలతో వేలాది కొత్త ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి.
ముఖ్యమంత్రి వంత్ రెడ్డి జనవరిలో దావోస్ లో జరిగిన వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ వార్షిక సదస్సులో పాల్గొన్నారు. ఆ సందర్భంగా చేసుకున్న ఒప్పందాలతో రాష్ట్రానికి రూ.40232 కోట్ల పెట్టుబడులకు లైన్ కంపెనీలు సంసిద్ధత వ్యక్తం చేశాయి. తాజాగా అమెరికా, దక్షిణ కొరియా పర్యటనలతో మరో రూ.36 వేల కోట్ల ఒప్పందాలు జరిగాయి. దీంతో ఎనిమిది నెలల్లోనే రాష్ట్ర ప్రభుత్వం రూ.76,232 కోట్ల మేర పెట్టుబడుల లక్ష్యాన్ని చేరుకోవటం సరికొత్త రికార్డు నమోదు చేసింది. దేశంలోనే పెట్టుబడుల గమ్యస్థానంగా తెలంగాణ అందరి దృష్టిని ఆకర్షిస్తోందని ప్రభుత్వం తెలిపింది.