CM Revanth Reddy : పోలవరం ప్రాజెక్టుతో భద్రాచలానికి ఏర్పడే ముప్పుపై అధ్యయనం, సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
CM Revanth Reddy : తెలంగాణపై పోలవరం ప్రాజెక్టు ప్రభావంపై ఐఐటీ హైదరాబాద్ టీమ్ తో అధ్యయనం చేయించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. నెల రోజుల్లో సమగ్ర నివేదిక సిద్ధం చేయాలన్నారు. ఏపీ బనకచర్ల ప్రాజెక్టుపై ఏపీ సీఎస్ కు తెలంగాణ అభ్యంతరాలను తెలపాలని సూచించారు.
Revanth Reddy : పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో తెలంగాణపై పడే ప్రభావంపై అధ్యయనం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఐఐటీ హైదరాబాద్ బృందంతో అధ్యయనం చేయించి, నెలరోజుల్లో సమగ్ర నివేదిక తయారు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఐఐటీ హైదరాబాద్ టీమ్ తో కోఆర్డినేషన్ కోసం ప్రత్యేక అధికారిని నియమించాలని అధికారులకు సూచించారు. జలవనరుల శాఖపై సీఎం రేవంత్ రెడ్డి శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్ పాల్గొన్నారు.
ఈ సమావేశంలో అధికారులకు పలు కీలక సూచనలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. పోలవరం నిర్మాణంతో భద్రాచలం దేవాలయానికి ఏర్పడే ముప్పుపై సమగ్ర అధ్యయనం చేయాలని సీఎం ఆదేశించారు. 2022లో 27 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చినప్పుడు భద్రాచలం ముంపునకు గురైనట్లు అధికారులు సీఎంకు తెలిపారు. దీంతో పాటు ఏపీ ప్రభుత్వం కొత్తగా చేపట్టిన గోదావరి బనకచర్ల ప్రాజెక్టు అంశాన్ని అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. ఈ ప్రాజెక్ట్ పైన ఏపీ ప్రభుత్వం ఇటీవల పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిందని తెలిపారు. వరద జలాల ఆధారంగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టుకు ఎలాంటి అనుమతులు లేవని ఇరిగేషన్ అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు.
బనకచర్ల ప్రాజెక్టుపై ఏపీ సీఎస్ తెలంగాణ అభ్యంతరాలను తెలపాలని అధికారులకు సీఎం రేవంత్ సూచించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం అవసరమైతే గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుతో పాటు కేంద్ర జల్ శక్తి మంత్రిత్వ శాఖకు లేఖలు రాయాలని సీఎం అధికారులను ఆదేశించారు.
పోలవరం ప్రాజెక్టు ఒక ప్రాంతానికి చెందినది కాదు - ఏపీ ఆర్థిక మంత్రి
పోలవరం ప్రాజెక్టు ఒక జిల్లాకు సంబంధించిన ప్రాజెక్టు కాదని ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. శనివారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు అండగా ఉంటామన్నారు. పోలవరం అంటే రాయలసీమకు, ఉత్తరాంధ్రకు, రాష్ట్ర రైతాంగానికి గొప్ప వరం అన్నారు. పట్టిసీమ ప్రాజెక్టు కట్టక ముందు రాయలసీమలో నీటి కోసం యుద్ధాలు జరిగేవన్నారు. తుంగభద్ర కెనాల్‌లో నీళ్లు తక్కువ వస్తే... రెండు టీఎంసీల నీటిని ఇవ్వాలని అనంతపురం జిల్లా రైతులు, ఇవ్వొద్దని కర్నూలు రైతలు ధర్నా చేసేవారన్నారు. పట్టిసీమ ప్రాజెక్టుతో ఈ రెండు జిల్లాల రైతుల ఆందోళనలు తగ్గాయన్నారు. ఒక చిన్న ప్రాజెక్టు రాయలసీమ భూభాగంలో అనేక మార్పులకు కారణమైందన్నారు.
ఏపీ జీవనాడి పోలవరం ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు దృష్టిసారించారని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. పోలవరం పూర్తిచేయడంతో పాటు బనకచర్ల వరకు నీళ్లు తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు. బనకచర్ల ప్రాజెక్టు రాయలసీమ నీటిపారుదలకు కీలకం అన్నారు. కర్నూలు, నంద్యాల, కడప, చిత్తూరు, అనంతపురం ప్రాంతాలకు గోదావరి నీరు చేరుతుందన్నారు. బనకచర్లకు నీటిని తీసుకెళ్లేందుకు నదుల అనుసంధాన ప్రాజెక్టును చేపట్టనున్నామన్నారు. పోలవరం ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. గత ఐదేళ్లలో పోలవరం పనులు ఆపిందెవరో వైఎస్ జగన్ చెప్పాలని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక గతంలో నిలిచిపోయిన 74 కేంద్ర పథకాలు మళ్లీ అమలు చేశామన్నారు. ఏ రాష్ట్రానికి లేని అప్పు ఏపీకి ఉందంటే అందుకు జగనే కారణమని విమర్శించారు. ధాన్యం సేకరించిన 48 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బు పడ్డాయన్నారు.
సంబంధిత కథనం