Hyderabad Metro : ఫ్యూచర్ సిటీ వరకు మెట్రో.. తుది ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సీఎం ఆదేశం-cm revanth reddy orders to prepare final proposals for metro expansion up to future city ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hyderabad Metro : ఫ్యూచర్ సిటీ వరకు మెట్రో.. తుది ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సీఎం ఆదేశం

Hyderabad Metro : ఫ్యూచర్ సిటీ వరకు మెట్రో.. తుది ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సీఎం ఆదేశం

Hyderabad Metro : హైదరాబాద్ మెట్రో విస్తరణ, డ్రైపోర్ట్, రీజిన‌ల్ రింగు రోడ్డుపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఫ్యూచర్ సిటీ వరకు మెట్రోను విస్తరించాలని.. ఇందుకు సంబంధించిన తుది ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

హైదరాబాద్ మెట్రో (istockphoto)

ఫ్యూచర్ సిటీ వరకు మెట్రోను విస్తరించాలని.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. అందుకు అవసరమైన తుది ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. శుక్రవారం కమాండ్ కంట్రోల్ సెంటర్ లో మెట్రో విస్తరణపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మెట్రో రెండో దశ విస్తరణకు సంబంధించిన ప్రతిపాదనల పురోగతిపై రేవంత్ ఆరా తీశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు రావాల్సి ఉందని, ఇప్పటికే ఢిల్లీలో అధికారులను కలిసి సంప్రదింపులు జరిపినట్లు అధికారులు వివరించారు.

నిరంతరం ప్రయత్నించాలి..

హైద‌రాబాద్ మెట్రో రెండో ద‌శ విస్త‌ర‌ణ‌కు సంబంధించి.. నాగోల్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ వరకు (36.8 కి.మీ.), రాయ‌దుర్గం- కోకాపేట నియోపొలిస్ (11.6 కి.మీ.), ఎంజీబీఎస్‌- చాంద్రాయ‌ణ‌గుట్ట (7.5 కి.మీ.), మియాపూర్‌- ప‌టాన్‌చెరు (13.4 కి.మీ.), ఎల్‌బీ న‌గ‌ర్‌- హ‌య‌త్‌న‌గ‌ర్ (7.1 కి.మీ.) మొత్తం 76.4 కి.మీ.ల విస్తరణకు రూ.24,269 కోట్ల అంచనాలతో డీపీఆర్‌ను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపించింది. కేంద్రంతో పాటు రాష్ట్ర ప్ర‌భుత్వం చెరిసగం నిధులు భరించేలా జాయింట్ వెంచ‌ర్‌గా ఈ ప్రాజెక్టు చేపట్టేలా ప్రతిపాదనలు తయారు చేసింది. కేంద్రం నుంచి అనుమతులు సాధించేందుకు నిరంతరం ప్రయత్నించాలని, అనుమతులు రాగానే పనులు ప్రారంభించేందుకు సన్నద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.

ఫ్యూచర్ సిటీ వరకు..

ఎయిర్ పోర్టు నుంచి ఫ్యూచర్ సిటీలోని యంగ్ ఇండియా స్కిల్ డెవెలప్మెంట్ యూనివర్సిటీ వరకు.. 40 కిలోమీటర్ల మేరకు మెట్రో విస్తరించేందుకు కొత్త ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. దాదాపు 30 వేల ఎకరాల విస్తీర్ణంలో ఫ్యూచర్ సిటీ అభివృద్ధి చెందుతుందని.. భవిష్యత్తు నగర విస్తరణ అవసరాల దృష్ట్యా మెట్రోను మీర్ఖాన్‌పేట్ వరకు పొడిగించాలని చెప్పారు. అందుకు అవసరమయ్యే అంచనాలతో డీపీఆర్ తయారు చేసి.. కేంద్రానికి పంపించాలని సూచించారు. హెచ్ఎండీఏతో పాటు ఎఫ్ఎస్డీఏను (ఫ్యూచర్ సిటీ డెవెలప్​మెంట్​ అథారిటీ)ని ఈ రూట్ మెట్రో విస్తరణలో భాగస్వామ్యులను చేయాలని ఆదేశించారు.

వందేళ్ల అవసరాలకు..

రానున్న వందేళ్ల అవ‌స‌రాల‌కు అనుగుణంగా డ్రైపోర్ట్‌కు రూప‌క‌ల్ప‌న చేయాల‌ని.. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అధికారుల‌కు సూచించారు. ఆర్ఆర్ఆర్ స‌మీపంలో స‌రైన ప్రాంతంలో డ్రైపోర్ట్ ఉండాల‌ని సీఎం స్పష్టం చేశారు. రాష్ట్రంలో జాతీయ ర‌హ‌దారుల నిర్మాణం, ఆర్ఆర్ఆర్ ప‌నుల పురోగ‌తిపై ఐసీసీసీలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి స‌మీక్ష నిర్వ‌హించారు.

గ్రీన్‌ఫీల్డ్ రహదారిపై ఫోకస్..

ఇటీవ‌ల రాష్ట్ర పున‌ర్విభ‌జ‌న అంశాల‌పై ఢిల్లీలో తెలంగాణ‌, ఏపీ అధికారుల స‌మావేశం జ‌రిగింది. ఇందులో హైద‌రాబాద్‌- విజ‌య‌వాడ గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి అవ‌స‌ర‌మైన డీపీఆర్ తయారీకి సూత్రప్రాయ ఆమోదం తెల‌పాల‌ని.. కేంద్ర హోం శాఖ కార్య‌ద‌ర్శి ఆదేశించారు. ఈ నేప‌థ్యంలో ఆ ప‌నుల‌పై దృష్టి సారించాల‌ని సీఎం రేవంత్ సూచించారు.

భూసేకరణ పూర్తి చేయాలి..

రీజన‌ల్ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్‌) ఉత్త‌ర భాగానికి సంబంధించిన‌ భూ సేక‌ర‌ణ పూర్తి చేయాల‌ని, ద‌క్షిణ భాగం డీపీఆర్ క‌న్స‌ల్టెన్సీ నివేదిక‌ను త్వ‌ర‌గా పూర్తి చేయాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. హైద‌రాబాద్ న‌గ‌రాన్ని ఛ‌త్తీస్‌గ‌ఢ్ రాజ‌ధాని రాయ్‌పూర్‌తో అనుసంధానించేలా జాతీయ ర‌హ‌దారికి ప్ర‌తిపాద‌న‌లు త‌యారు చేసి.. ఎన్‌హెచ్ఏఐకి పంపించాల‌ని సూచించారు. హైద‌రాబాద్ నుంచి మంచిర్యాల వ‌ర‌కు కొత్త జాతీయ ర‌హ‌దారి నిర్మాణానికి సంబంధించి ప్ర‌తిపాద‌న‌లు త‌యారు చేయాల‌ని ఆదేశించారు.

ఇబ్బందులపై ఆరా..

తెలంగాణలో జాతీయ ర‌హ‌దారుల నిర్మాణానికి సంబంధించి భూ సేక‌ర‌ణ‌లో ఎదుర‌వుతున్న ఇబ్బందుల‌పై సీఎం ఆరాతీశారు. ప‌లు చోట్ల పంట‌లు ఉన్నాయ‌ని, పంట న‌ష్ట‌ప‌రిహారం చెల్లించేందుకు ఎన్‌హెచ్ఏఐ అంగీక‌రించ‌డం లేద‌ని అధికారులు సీఎంకు వివ‌రించారు. పంట కాలం దాదాపు పూర్త‌వుతున్నందున ఆ వెంట‌నే రైతుల‌తో మాట్లాడి భూ సేక‌ర‌ణ పూర్తి చేయాల‌ని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.

కలెక్టర్లతో మాట్లాడండి..

భూ సేక‌ర‌ణ‌కు సంబంధించి ఏవైనా స‌మ‌స్య‌లుంటే ఆయా జిల్లాల క‌లెక్ట‌ర్ల‌తో ప్ర‌త్యేకంగా మాట్లాడాల‌ని, సాంకేతిక‌, న్యాయ స‌మ‌స్య‌లు ఉంటే వాటి ప‌రిష్కారానికి కృషి చేయాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతి కుమారికి ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ఔట‌ర్ రింగు రోడ్డు నుంచి రీజిన‌ల్ రింగు రోడ్డు వ‌ర‌కు రేడియ‌ల్ రోడ్లు.. ఆర్ఆర్ఆర్‌ నుంచి తెలంగాణ స‌రిహ‌ద్దుల వ‌ర‌కు ఉన్న ర‌హ‌దారుల విస్త‌ర‌ణ‌పైనా ప్ర‌త్యేక దృష్టి సారించాల‌ని సీఎం స్పష్టం చేశారు.

సంబంధిత కథనం