CM Revanth Reddy : హైదరాబాద్ కు మూడు వైపులా ఇసుక స్టాక్ పాయింట్లు, మినరల్ బ్లాక్ ల వేలానికి టెండర్లు- సీఎం రేవంత్ రెడ్డి-cm revanth reddy orders sand stock points on sides of hyderabad tenders for mineral blocks ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Cm Revanth Reddy : హైదరాబాద్ కు మూడు వైపులా ఇసుక స్టాక్ పాయింట్లు, మినరల్ బ్లాక్ ల వేలానికి టెండర్లు- సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy : హైదరాబాద్ కు మూడు వైపులా ఇసుక స్టాక్ పాయింట్లు, మినరల్ బ్లాక్ ల వేలానికి టెండర్లు- సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy : ఇసుక, ఖనిజాల అక్రమ సరఫరాపై ఉక్కుపాదం మోపాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. స‌రైన ధ‌ర‌ల‌కు ప్రభుత్వమే ఇసుక స‌ర‌ఫ‌రా చేస్తే అక్రమ సరఫరాపై వినియోగ‌దారులు ఆధార‌ప‌డ‌ర‌న్నారు. మూడు వైపులా ఇసుక స్టాక్ పాయింట్లు ఏర్పాటు చేయాల‌ని ఆదేశించారు

హైదరాబాద్ కు మూడు వైపులా ఇసుక స్టాక్ పాయింట్లు, మినరల్ బ్లాక్ ల వేలానికి టెండర్లు- సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy : ఇసుక‌తో పాటు ఇత‌ర ఖ‌నిజాల అక్రమ త‌వ్వకాలు, అక్రమ సరఫరాపై ఉక్కుపాదం మోపాల‌ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. క‌ఠిన చ‌ర్యల‌తోనే అక్రమాల‌ను అడ్డుకోగ‌ల‌మ‌ని, ప్రభుత్వానికి ఆదాయం పెంచ‌గ‌ల‌మ‌ని అభిప్రాయపడ్డారు. గ‌నుల శాఖ‌పై ఐసీసీసీలో సీఎం రేవంత్ రెడ్డి శ‌నివారం స‌మీక్ష నిర్వహించారు. తొలుత గ‌త నెల రోజులుగా తీసుకున్న చ‌ర్యల‌తో ఇసుక అక్రమ ర‌వాణాకు అడ్డుక‌ట్ట ప‌డిన విధానాన్ని, పెరిగిన ఆదాయాన్ని అధికారులు ముఖ్యమంత్రికి వివ‌రించారు.

టీజీఎండీసీ ద్వారానే సరఫరా

ఈ సంద‌ర్భంగా ఇసుక రీచ్‌ల్లో త‌వ్వకాలు, ర‌వాణా, వినియోగ‌దారుల‌కు త‌క్కువ ధ‌ర‌కు ఇసుక స‌ర‌ఫ‌రాపై అధికారుల‌కు సీఎం రేవంత్ రెడ్డి ప‌లు సూచ‌న‌లు చేశారు. ప్రభుత్వంలోని నీటి పారుద‌ల‌, ఆర్ అండ్ బి, పంచాయ‌తీరాజ్‌తో పాటు వివిధ శాఖ‌ల ఆధ్వర్యంలో చేపట్టే ప‌నుల‌కు టీజీఎండీసీ నుంచే ఇసుక స‌ర‌ఫ‌రా చేసేలా చూడాల‌ని ఆదేశించారు. పెద్ద మొత్తంలో నిర్మాణాలు చేప‌ట్టే నిర్మాణ రంగ సంస్థలకు అవ‌స‌ర‌మైన ఇసుక‌ను టీజీఎండీసీ ద్వారానే స‌ర‌ఫ‌రా చేయాల‌ని సీఎం ఆదేశించారు. స‌రైన ధ‌ర‌ల‌కు ప్రభుత్వమే ఇసుక స‌ర‌ఫ‌రా చేస్తే అక్రమంగా స‌ర‌ఫ‌రా చేసే వారిపై వినియోగ‌దారులు ఆధార‌ప‌డ‌ర‌న్నారు.

నగరానికి మూడు వైపులా స్టాక్ పాయింట్లు

హైద‌రాబాద్ న‌గ‌రంతో పాటు స‌మీప ప్రాంతాల్లోనే ఇసుక ఎక్కువ‌గా వినియోగం జ‌రుగుతోంద‌న్నారు. త‌క్కువ మొత్తంలో ఇసుక అవ‌స‌ర‌మైన వారు కొనుగోలు చేసేలా న‌గ‌రానికి మూడు వైపులా ఇసుక స్టాక్ పాయింట్లు సాధ్యమైనంత త్వర‌గా ఏర్పాటు చేయాల‌ని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. గ‌నుల శాఖ ప‌రిధిలోని వివిధ ఖ‌నిజాల క్వారీల‌కు గ‌తంలో విధించిన జ‌రిమానాలు, వాటి వ‌సూళ్లపైనా సీఎం అధికారుల‌ను ప్రశ్నించారు. ఇందుకు సంబంధించిన‌ విధాన‌ప‌ర‌మైన నిర్ణయం త్వర‌గా తీసుకొని స‌మ‌స్యను ప‌రిష్కరించాల‌ని అధికారుల‌కు సూచించారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న మైన‌ర్ ఖ‌నిజాల బ్లాక్‌ల వేలానికి వెంట‌నే టెండ‌ర్లు పిల‌వాల‌ని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.

బండారు.సత్యప్రసాద్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలు, పొలిటికల్ వార్తలను రాస్తారు. అలాగే ఆరోగ్యం, విద్యా ఉద్యోగ, లైఫ్ స్టైల్ వార్తలు రాస్తారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిజం(MJMC) పీజీ చేశారు. గతంలో ఈటీవీ భారత్, ఇన్ షార్ట్స్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు. సత్యప్రసాద్ 2023లో హెచ్.టి.తెలుగులో చేరారు.

సంబంధిత కథనం