మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టును పూర్తి చేసి తీరుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నల్గొండ జిల్లాను అభివృద్ధి పథాన నడిపిస్తామన్నారు.నల్గొండ జిల్లాలోని ప్రాజెక్టులు పూర్తి చేయడానికి ఎన్ని నిధులైనా మంజూరు చేయడానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని స్పష్టం చేశారు.
ప్రజా పాలన – ప్రజా విజయోత్సవాలు కార్యక్రమంలో భాగంగా నల్గొండలో నిర్వహించిన సభలో సీఎం రేవంత్ ప్రసంగించారు. జిల్లాలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... “ఎంత ఖర్చయినా కానివ్వండి. ఎన్ని కష్టాలైనా రానివ్వండి. కాలుష్యం లేని, కలుషితం లేని నీరు ఇవ్వడం కోసం మూసీ ప్రక్షాళన చేసి తీరుతాం. మూసీ పునరుజ్జీవం బాధ్యత నాది. కలుషితాల నుంచి నల్గొండ నుంచి విముక్తి చేసే బాధ్యత నాది. అడ్డం వచ్చేవారి సంగతి చూసే బాధ్యత మీది” అని అన్నారు.
రైతుల సంక్షేమం, మూసీ పునరుజ్జీవం, నల్గొండ జిల్లా సమస్యలను సీఎం రేవంత్ ప్రధానంగా ప్రస్తావించారు. సంక్రాంతి పండుగ తర్వాత రైతుల ఖాతాల్లో రైతు భరోసా వేస్తామన్న విషయాన్ని పునరుద్ఘాటించారు.
సంబంధిత కథనం