Telangana Rythu Nestham : తెలంగాణలో 'రైతు నేస్తం' ప్రారంభం - ఇకపై అన్నదాతలకు వీడియో కాన్ఫరెన్స్ సేవలు
Rythu Nestham in Telangana: రైతులకు డిజటల్ సేవలను అందించేందుకు వీలుగా ‘రైతు నేస్తం’ అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది తెలంగాణ ప్రభుత్వం. వారంలో ప్రతి మంగళవారం, శుక్రవారం విస్తరణాధికారులు, రైతులతో ‘రైతునేస్తం’ కార్యక్రమం ఉంటుంది.
Rythu Nestham in Telangana: తెలంగాణలో కొత్తగా ‘రైతు నేస్తం’(Telangana Rythu Nestham) కార్యక్రమం అమల్లోకి వచ్చింది. ఈ కార్యక్రమాన్ని బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్య మంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. వీడియో కాన్ఫరెన్స్ అనుసంధానం ద్వారా రైతుల సమస్యలను పరిష్కరించే దిశగా రైతు నేస్తం కార్యక్రమాన్ని తీసుకొచ్చారు.
దశలవారీగా 3 సంవత్సరాల్లో 2,601 రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ యూనిట్లను స్థాపిస్తారు. రూ.97 కోట్ల తో ప్రాజెక్టు అమలు కానుంది. మొదటి దశలో 110 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏర్పాట్లు కానుండగా… ఇందుకోసం ప్రభుత్వం . రూ. 4.07 కోట్లను విడుదల చేసింది. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు రైతులకు చేదోడు వాదోడుగా ఉండేందుకు ఈ డిజిటల్ ఫ్లాట్ ఫారమ్ వ్యవస్థను సర్కార్ ప్రవేశపెట్టింది.
వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులతో క్షేత్రస్థాయిలో సమస్యలపై రైతులతో చర్చలు ఉంటాయి. గ్రామాల నుంచే రైతులు ఆన్ లైన్లో తమ పంటలకు సంబంధించిన సలహాలు, సూచనలు అందుకోవటం. తమ అనుభవాలను ఇతర రైతులతో పంచుకోవటం వంటివి జరుగుతాయి. ప్రతి మంగళవారం, శుక్రవారం విస్తరణాధికారులు, రైతులతో రైతు నేస్తం కార్యక్రమం అమలవుతుంది. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ సహకారంతో రాష్ట్ర వ్యవసాయశాఖ రైతులకు భరోసానిచ్చేందుకు ఈ కార్యక్రమం చేపట్టింది.
గొర్రెలు, చేపల పంపిణీ పథకాలపై విచారణ
గొర్రెలు, చేపల పంపిణీ పథకాల్లో జరిగిన లావాదేవీలపై సమగ్రంగా విచారణ చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ పథకాలు ప్రారంభించినప్పటి నుంచీ ఇప్పటివరకు లబ్ధిదారుల ఎంపిక మొదలు గొర్రెల కొనుగోలు, పంపిణీ జరిగిన తీరుపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాలని చెప్పారు. విజిలెన్స్ ఇచ్చే ప్రాథమిక నివేదికలో ఏమైనా అవినీతి, అవకతవకలను గుర్తిస్తే వెంటనే ఈ వివరాలను ఏసీబీకి అప్పగించాలని సీఎం అధికారులకు సూచించారు. మంగళవారం సచివాలయంలో పశు సంవర్ధక శాఖ, పాడి అభివృద్ధి, మత్స్య శాఖ అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు.
గొర్రెల పంపిణీ పథకంలో జరిగిన అవకతవకలు, ఇటీవల ఈ పథకంలో జరిగిన భారీ అవినీతిని కాగ్ తమ నివేదికలో వేలెత్తి చూపిన విషయాన్ని ఈ సమావేశంలో ముఖ్యమంత్రి ప్రస్తావించారు. ఇటీవల గొర్రెల పంపిణీకి సంబంధించిన నిధులను బినామీ పేర్లతో కొందరు ఉద్యోగులు సొంత ఖాతాలకు మళ్లించుకున్న కేసులో ఏసీబీ దర్యాప్తు గుర్తు చేస్తూ.. అదులో శాఖాపరంగా వివరాలేమీ సేకరించలేదా.. అని ఆరా తీశారు. 2017లో ప్రారంభించిన గొర్రెల పంపిణీ పథకంలో మొదటి విడతకు రూ. 3955 కోట్ల రుణం ఇచ్చిన చేసిన నేషనల్ కో ఆపరేటివ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ రెండో విడతకు ఎందుకు రుణం ఇవ్వటం నిలిపి వేసిందని ముఖ్యమంత్రి అధికారులను ప్రశ్నించారు. అప్పటికే ఈ పథకంపై కాగ్ వివిధ అభ్యంతరాలు లేవనెత్తడం, అవకతవకలను గుర్తించిందని, తదితర కారణాలతో ఎన్సీడీసీ రుణం ఇవ్వలేదని అధికారులు సమాధానమిచ్చారు.
ఇప్పటికే తమ వాటా కింద 25 శాతం డీడీలు చెల్లించిన అందజేసిన లబ్ధిదారులకు ఎందుకు గొర్రెలను పంపిణీ చేయలేదని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. రెండో విడతలో 85488 మంది ఇప్పటికే తమ వాటా కింద 25 శాతం డబ్బు చెల్లించారని, దాదాపు రూ. 430 కోట్లు జిల్లా కలెక్టర్ల ఖాతాల్లోనే ఉన్నాయని అధికారులు తెలిపారు. మరో 2,20,792 మంది లబ్ధిదారులు ఇంకా డబ్బులు కట్టలేదని చెప్పారు. ఈ పథకం అమలు జరిగిన తీరుపై రకరకాల అనుమానాలున్నాయని, దీంతో పాటు చేపల పెంపకానికి సంబంధించి ఎక్కువ సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయని ముఖ్యమంత్రి అన్నారు. ఈ వ్యవహారంపై సమగ్రంగా విచారణకు ఆదేశాలు జారీ చేశారు.
ప్రతి మండలంలో వెటర్నరీ హాస్పిటల్ తప్పకుండా ఉండాలని, 91 కొత్త మండలాల్లోనూ అవసరమైన ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. మొబైల్ వెటర్నరీ క్లినిక్ సేవలను కొనసాగించాలని, అందుకు అవసరమైన టెండర్లను వెంటనే పిలవాలని చెప్పారు. వివిధ పథకాల్లో కేంద్రం నుంచి వచ్చే నిధులను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. టీఎస్పీఎస్సీ చేపట్టిన వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల నియామకాల్లో ఈ విబాగంలో ఏళ్లకేళ్లుగా పని చేస్తున్న వారికి వెయిటేజీ ఇవ్వాలనే ప్రతిపాదనను పరిశీలించాలని, వైద్యారోగ్య శాఖలో అమలైన వెయిటేజీ విధానాన్ని ఈ విభాగంలోనూ వర్తించేలా చూడాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు.