Telangana : సిద్ధమైన నివేదికలు…! కుల గణన, ఎస్సీ వర్గీకరణపై సీఎం కీలక ప్రకటన-cm revanth reddy key statement about sc categorisation ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana : సిద్ధమైన నివేదికలు…! కుల గణన, ఎస్సీ వర్గీకరణపై సీఎం కీలక ప్రకటన

Telangana : సిద్ధమైన నివేదికలు…! కుల గణన, ఎస్సీ వర్గీకరణపై సీఎం కీలక ప్రకటన

Maheshwaram Mahendra Chary HT Telugu
Feb 01, 2025 05:19 AM IST

సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేతో పాటు ఎస్సీ వర్గీకరణ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఈ అంశాలకు సంబంధించిన నివేదికలు రాబోతున్నాయని చెప్పారు. ఈ రెండు అంశాలపై శాసనసభలో చర్చిస్తామని ప్రకటన చేశారు.

కుటుంబ సర్వే, ఎస్సీ వర్గీకరణపై సీఎం రేవంత్ కీలక ప్రకటన
కుటుంబ సర్వే, ఎస్సీ వర్గీకరణపై సీఎం రేవంత్ కీలక ప్రకటన

రాష్ట్రంలో విజయవంతంగా పూర్తి చేసిన కుల గణన (సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే 2024) తో పాటు ఎస్సీ వర్గీకరణ అంశంపై శాసనసభలో చర్చకు పెట్టనున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా ఫరూక్‌నగర్ మండలం మొగిలిగిద్ద ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా ఈ రెండు అంశాలపై కీలక ప్రకటన చేశారు.

yearly horoscope entry point

శాసనసభలో చర్చిస్తాం - సీఎం రేవంత్

ఫిబ్రవరి 2 వ తేదీన కుల గణన నివేదిక రాబోతోందని రేవంత్ రెడ్డి చెప్పారు. అలాగే ఎస్సీ వర్గీకరణపై నియమించిన ఏకసభ్య జ్యుడీషియల్ కమిషన్ కూడా నివేదిక ఇవ్వబోతోందని పేర్కొన్నారు. ఈ రెండు అంశాలపై శాసనసభలో చర్చిస్తామని స్పష్టం చేశారు.

బ్రిటిషర్ల కాలంలో జరిగిన కులగణన ఆ తర్వాత జరగలేదని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. ఎంత మంది ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు మారినా వెనుకబడిన తరగతుల వారి లెక్కలు తేల్చలేదని చెప్పుకొచ్చారు. ఈ విషయంలో తమ ప్రభుత్వం ఇంటింటికి వెళ్లి బీసీల లెక్కలు తేల్చిందని పేర్కొన్నారు.

పూర్తైన కుటుంబ సర్వే:

తెలంగాణ వ్యాప్తంగా గతేడాది నవంబర్ లో సమగ్ర కుటుంబ సర్వేను చేపట్టిన సంగతి తెలిసిందే. నవంబర్ 8వ తేదీ వరకు కుటుంబాలను గుర్తించి గృహాలకు స్టిక్కర్లు అంటించారు. అనంతరం ఇంటింటి సర్వే చేపట్టారు. ఓ వైపు సర్వే కొనసాగుతుండగానే మరో వైపు సేకరించిన సర్వే వివరాలను ఆన్‌లైన్‌లో డేటాను ఎంట్రీ పూర్తి చేస్తూ వచ్చారు.

ఇక డేటా ఎంట్రీలో ఎలాంటి తప్పులు దొర్లకుండా తగ్గిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేస్తూ వచ్చింది. ఎలాంటి తప్పులకు అవకాశం ఇవ్వొద్దని సూచించింది. క్షేత్రస్థాయిలో ఎంపీడీవోలు, తహసీల్దార్లతో పాటు ఇతర అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేశారు. సర్వే వివరాలు బయటకు వెళ్లకుండా పకడ్బందీ చర్యలు చేపట్టింది.

అన్ని జిల్లాల నుంచి వచ్చిన వివరాలను క్రోడీకరించి… ముసాయిదాను సిద్ధం చేసే పనిలో ప్రభుత్వం ఉంది. ఇది కూడా పూర్తి కావొచ్చినట్లు అధికారులు తాజాగా తెలిపారు. ఫిబ్రవరి 2వ తేదీలోగా కేబినెట్ సబ్ కమిటీ కి ఈ ముసాయిదా అందనుంది. ఆ తర్వాత ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా తాజాగా ప్రకటన చేశారు.

మరోవైపు ఎస్సీ వర్గీకరణ నిర్ణయాన్ని వెంటనే అమలు చేయాలని ఎమ్మార్పీఎస్ అధినేత మందకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్ వేదికగా భారీ కార్యక్రమాన్ని చేపట్టేందుకు కూడా తేదీని ఖరారు చేశారు. అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన నిర్ణయాన్ని వెంటనే అమలు చేయాలని కోరుతున్నారు.

Whats_app_banner