Telangana Congress : జిల్లాల వారీగా నివేదికలు…! నామినేటెడ్‌ పదవులపై కీలక ప్రకటన-cm revanth reddy key announcement on nominated posts in the tpcc state executive meeting ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana Congress : జిల్లాల వారీగా నివేదికలు…! నామినేటెడ్‌ పదవులపై కీలక ప్రకటన

Telangana Congress : జిల్లాల వారీగా నివేదికలు…! నామినేటెడ్‌ పదవులపై కీలక ప్రకటన

నామినేటెడ్ పదవుల భర్తీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. మార్చి 10 లోగా అన్ని జిల్లాల్లో నియామకాలు ఇచ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఇంచార్జ్ మంత్రులను ఆదేశించారు. పార్టీ జెండా మోసినవారికి ఖచ్చితంగా గుర్తింపు ఉంటుందని స్పష్టం చేశారు.

టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం

నామినేటెడ్ పదవుల కోసం ఎదురుచూస్తున్న తెలంగాణ కాంగ్రెస్ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. మార్చి 10వ తేదీలోపు నియామకాలను పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. శుక్రవారం జరిగిన టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో ఈ ప్రకటన చేశారు. దీంతో నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ మళ్లీ పట్టాలెక్కనుంది.

ప్రాధాన్యత కల్పిస్తాం - సీఎం రేవంత్ రెడ్డి

టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి…. పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వ నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్ళాలని స్పష్టం చేశారు. ఇది నిరంతర ప్రక్రియ.. ఒకరోజుతో ముగిసేది కాదన్నారు. ఎప్పటికప్పుడు సమస్యలను పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్లాలని దిశానిర్దేశం చేశారు.

“పార్టీ జెండా మోసినవారికి ఖచ్చితంగా గుర్తింపు ఉంటుంది. పార్టీ కోసం కష్టపడినవారికే నామినేటెడ్ పదవులు ఇచ్చాం. సుదీర్ఘకాలంగా పని చేసినవారికి కొంతమందికి అవకాశాలు రాలేదు. వారినికాపాడుకోవాల్సిన బాధ్యత పార్టీపై ఉంది. రాబోయే రోజుల్లో వారికి తప్పకుండా ప్రాధాన్యత కల్పిస్తాం. వివిధ జిల్లాల్లో ఖాళీగా ఉన్న కార్పొరేషన్లు, మార్కెట్ కమిటీలు, నామినేటెడ్ పోస్టుల భర్తీ చేయాల్సి ఉంది. మార్చి 10 లోగా అన్ని జిల్లాల్లో నియామకాలు ఇచ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఇంచార్జ్ మంత్రులకు ఆదేశాలు ఇస్తున్నాం” అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు.

‘మంచిని మైక్ లో చెప్పండి’ - సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు

పదవులు వచ్చిన వారూ పార్టీ కోసం కష్టపడాలని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పనితీరు సరిగా లేని వారికి రిన్యూవల్ ఉండదని క్లారిటీ ఇచ్చారు. “ప్రభుత్వం చేసే మంచిని మైక్ లో చెప్పండి… చెడును చెవిలో చెప్పాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.మన సక్సెస్ స్టోరీని మనమే చెప్పుకోవాలి. మన ప్రభుత్వం కులగణన చేసి దేశానికే ఆదర్శంగా నిలిచింది. పెద్ద పెద్ద విమర్శకులు కూడా మన ప్రభుత్వాన్ని అభినందిస్తున్నారు.. మన సక్సెస్ స్టోరీని ప్రజల్లోకి తీసుకెళ్లాలి” అని రేవంత్ రెడ్డి నేతలకు దిశానిర్దేశం చేశారు.

“రూ.4200 కోట్లు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కోసం ప్రభుత్వం ఖర్చు చేసింది. 50 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల విద్యుత్ అందిస్తున్నాం. రూ.500లకే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నాం. రైతు భరోసాను రూ.12 వేలకు పెంచడంతోపాటు భూమిలేని పేదల కుటుంబానికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అందిస్తున్నాం.ఇది మన చిత్తశుద్ధికి నిదర్శనం ప్రభుత్వం చేసిన పనులను ప్రజల్లోకి తీసుకెళ్లాలి” అని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.

రాహుల్ గాంధీని ప్రధానిని చేసే వరకు మనమంతా కసితో పనిచేయాలని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. “మోదీని గద్దె దించే వరకు మనం కష్టపడాలి. రాహుల్ గాంధీ పట్టుదలతోనే కులగణన, ఎస్సీ ఉపకులాల వర్గీకరణ చేయగలిగాం. రాష్ట్రంలో అధికారంలో ఉంటేనే ఇన్ని చేయగలిగితే… దేశంలో కాంగ్రెస్ ని అధికారంలోకి తీసుకొస్తే ఇంకెన్ని చేయొచ్చు. దేశ ప్రజల కోసం రాహుల్ గాంధీ గ్రామగ్రామాన తిరుగుతున్నారు. అలాంటి రాహుల్ గాంధీని ప్రధానిని చేసేవరకు విశ్రమించొద్దు రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే ఎజెండాగా పనిచేయాలి” అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం