CM Revanth in Vemulawada : ‘కేసీఆర్... అసెంబ్లీకి రా సామి’...! లెక్కలు తేలుస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి-cm revanth reddy intresting comments about kcr in vemulawada tour ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Cm Revanth In Vemulawada : ‘కేసీఆర్... అసెంబ్లీకి రా సామి’...! లెక్కలు తేలుస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth in Vemulawada : ‘కేసీఆర్... అసెంబ్లీకి రా సామి’...! లెక్కలు తేలుస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి

HT Telugu Desk HT Telugu
Nov 20, 2024 09:06 PM IST

అసెంబ్లీ కి రా...సామి.. అంటూ కేసీఆర్ ను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్ చేశారు. కొడుకు, అల్లుడి లెక్కలు తేలుస్తామని స్పష్టం చేశారు. కేటీఆర్ ఎంత ఉరికినా చివరకు ఊసలు లెక్కించక తప్పదని హెచ్చరించారు. కేసీఆర్ కు నిజం ఒప్పుకునే ధైర్యం ఉంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని డిమాండ్ చేశారు.

సీఎం రేవంత్ రెడ్డి
సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తున్న నేపథ్యంలో ప్రజా పాలన ప్రజా విజయోత్సవాల్లో భాగంగా రెండోరోజు సీఎం రేవంత్ రెడ్డి రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో పర్యటించారు. మంత్రులు శ్రీధర్ బాబు పొన్నం ప్రభాకర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి దామోదర రాజనరసింహ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తుమ్మల నాగేశ్వరరావు కొండా సురేఖ టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో కలిసి సుమారు వెయ్యి కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేశారు.

కోరిన కోర్కెలు తీర్చే కోడె మొక్కుల వేములవాడ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. 76 కోట్లతో ఆలయ విస్తరణ పనులకు, భక్తుల మెరుగైన సౌకర్యాల కల్పనకు భూమిపూజ చేశారు. అనంతరం గుడి చెరువు గ్రౌండ్ లో నిర్వహించిన ప్రజా పాలన విజయోత్సవ సభలో సీఎం రేవంత్ రెడ్డి పెళ్ళి కొడుకు గెటప్ లో పాల్గొని కేసిఆర్ కుటుంబ పాలనపై ఫైర్ అయ్యారు. కుటుంబ సభ్యుల కోసమే కేసిఆర్ ప్రాజెక్టులు కట్టి ప్రజాధనం దుర్వినియోగం చేశారని ఆరోపించారు. కేసిఆర్ ఫామ్ హౌస్ కోసం మల్లన్న సాగర్, రంగనాయక సాగర్ వద్ద హరీష్ రావు ఫామ్ హౌస్ నిర్మించుకున్నారని తెలిపారు.‌ జన్వాడ లో కేటిఆర్ ఫామ్ హౌస్ నిర్మించుకున్నారని ఆ ముగ్గురి లెక్క తెలుస్తామని స్పష్టం చేశారు.

రుణమాఫీ.. ఉద్యోగాలపై చర్చించేందుకు సిద్దం

గత పదేళ్ళ కేసిఆర్ పాలనలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు.. రైతులకు ఎన్ని లక్షలు రుణమాఫీ చేశారో, తాము గడిచిన పది మాసాల్లో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాం, ఎంత మంది రైతులకు ఎన్ని లక్షల రుణమాఫీ చేశామో చర్చించేందుకు సిద్దంగా ఉన్నామని సిఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గడిచిన పది మాసాల్లో 50 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చామని ఒక్కటి తక్కువైనా క్షమాపణ కోరుతానని తెలిపారు. ఇక ఐదేళ్ళలో కేసిఆర్ మూడు విడతల్లో 11 వేల కోట్ల పంట రుణాలు మాఫీ చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 25 రోజుల్లో 18 వేల కోట్ల పంట రుణాలు మాఫీ చేసిందన్నారు. నిజం ఒప్పుకునే దైర్యం ఉంటే కేసీఆర్ అసెంబ్లీ కి వచ్చి ఎవరి హయాంలో ఏం జరిగిందో తెలుసుకోవాలని సవాల్ విసిరారు.

నా నియోజకవర్గంపై కక్ష ఎందుకు?

కొడంగల్ అభివృద్ధి కోసం నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టు చేపడితే అందులో పుల్లలు పెడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు.‌ పరిశ్రమల స్థాపనకు కృషి చేస్తుంటే అధికారులపై దాడి చేస్తున్నారని విమర్శించారు.‌

స్వతంత్ర భారతంలో కొండంగల్ నుంచి ఎవరూ మంత్రి కాలేదని, మా ప్రాంతం నష్టపోయింది.. అందుకే సీఎం గా అభివృద్ధి చేయాలని నిర్ణయించుకున్నానని స్పష్టం చేశారు. మా ప్రాంత నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలని 4 గ్రామాల్లో 1100 ఎకరాల్లో ఫార్మా విలేజ్ తెస్తే అధికారులపై దాడులు చేసారా అని ప్రశ్నించారు.‌ తెలంగాణలో పరిశ్రమలు పెట్టవద్దా?.. భూసేకరణ చేయవద్దా? అని ప్రశ్నించారు. గత పదేళ్లలో భూసేకరణ చేయకుండానే ప్రాజెక్టులు నిర్మించారా అని ప్రశ్నించారు. అభివృద్ధి జరగాలంటే భూసేకరణ చేయాల్సిందేనని స్పష్టం చేశారు. భూ సేకరణ చేస్తుంటే అడ్డుకోవడం ఎంతవరకు సమంజసమని నా నియోజకవర్గంపై కక్ష ఎందుకని నిలదీశారు. పరిశ్రమలు, ప్రాజెక్టులు వద్దా? కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రైతుకు భూమి అంటే తల్లిదండ్రులతో సమానమని అలాంటి భూమి కోల్పోయే రైతులకు మేలు జరిగేలా ప్రభుత్వం ఆలోచిస్తుందని మూడింతలు పరిహారం ఇచ్చేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. 80 వేల పుస్తకాలు చదివిన కేసీఆర్ కు భూ సేకరణ ద్వారానే పరిశ్రమ లు వస్తాయని తెల్వదా అని ప్రశ్నించారు.

బండి గుండు సున్నా...

పొన్నం ప్రభాకర్ ఒక సారి ఎంపీగా గెలిపిస్తే.. తెలంగాణ సాధించాడని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. బండి సంజయ్ ని రెండు సార్లు ఎంపిగా గెలిపిస్తే కరీంనగర్ కు గుండు సున్నా తప్ప ఏం తేలేదని ఎద్దేవా చేశారు. మూడుసార్లు టిఆర్ఎస్ ఎంపీగా గెలిపిస్తే కరీంనగర్ చేసింది ఏమీ లేదని, తాము ఈసారి ఎంపీగా గెలవకపోయినా రాష్ట్రంలో అధికారంలో ఉన్న నేపథ్యంలో కరీంనగర్ సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. పదేళ్ల లో 20 లక్షల కోట్లు బడ్జెట్ పెట్టిన కేసీఆర్.. రాజన్న ఆలయానికి వంద కోట్లు ఇవ్వలేకపోయారని విమర్శించారు. పదేళ్ళు ఏలిన వారు.. ఓపిక లేకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతు మమ్ములను దిగిపో అంటున్నారని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బావ,బామ్మర్దులకు కాంగ్రెస్ కార్యకర్తలు తడాఖా చూపిస్తారని స్పష్టం చేశారు.

నవంబర్ 30 లోపు ప్రాజెక్టుల ప్రణాళిక

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రాజెక్టు పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసేలా ఈనెల 30 లోగా ప్రణాళిక రూపకల్పన చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అందుకోసం జిల్లా ఇన్ చార్జి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వారం రోజుల్లో పెండింగ్ ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహిస్తారని తెలిపారు. గతంలో పి.సి.సి చీఫ్ గా పాదయాత్ర సమయంలో వేములవాడ రావడం జరిగిందని, ఆనాడు ఇచ్చిన మాట ప్రకారం ఆలయ అభివృద్ధి పనులు, మిడ్ మానేర్ ముంపు బాధితుల సమస్యలు పరిష్కారం, వేములవాడ, సిరిసిల్ల , చొప్పదండి ప్రాంతాల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. కలిగోట సూరమ్మ ప్రాజెక్టు పెండింగ్ పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తామని చెప్పారు.

 సిరిసిల్ల ప్యాకేజీ 9 పనులు జిల్లా ఇంఛార్జి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిరంతరం పర్యవేక్షిస్తూ వేగవంతంగా పూర్తి చేస్తారని తెలిపారు. గ్రామ స్థాయి నుంచి డిల్లీ స్థాయి వరకు నాయకత్వాన్ని అందించిన కరీంనగర్ జిల్లా సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. సిరిసిల్ల ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేయకుండా నూలు డిపో, వైద్య కళాశాల ఏర్పాటు చేశామని, నేత కార్మికుల నిరంతరం పని కల్పించేలా కృషి చేస్తున్నామని కోటి మంది మహిళలకు చీరల పంపిణీ చేపడుతున్నామని చెప్పారు. దేశంలో అన్ని రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శంగా నిలిచేలా తెలంగాణ రైసింగ్ అభివృద్ధి చేస్తామని తెలిపారు.

రిపోర్టింగ్ : కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు.

Whats_app_banner