TG By Elections : ఉప ఎన్నికలు ఎలా వస్తాయో కేటీఆర్ చెప్పాలి : సీఎం రేవంత్ రెడ్డి
TG By Elections : తెలంగాణలో త్వరలో ఉప ఎన్నికలు వస్తాయి.. బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధంగా ఉండాలని ఇటీవల కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ కామెంట్స్‌పై సీఎం రేవంత్ ఢిల్లీలో స్పందించారు. ఉప ఎన్నికలు ఎలా వస్తాయో కేటీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇంకా పలు కీలక అంశాలపై రేవంత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
ఉప ఎన్నికలు ఎలా వస్తాయో కేటీఆర్ చెప్పాలని.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. కోర్టులు చేసే పని కేటీఆర్ చేయాలనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఢిల్లీలో రాహుల్ గాంధీని కలిసిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఈ సందర్బంగా పలు అంశాలపై స్పందించారు. రాజ్యాంగంలో ఉన్నదే కోర్టులు అనుసరిస్తాయని.. గతంలో సబిత, తలసాని ఏ పార్టీ బీఫామ్‌పై గెలిచారని ప్రశ్నించారు. ఎవరి హయాంలో మంత్రులు అయ్యారో కేటీఆర్ చెప్పాలమి సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
సంక్షేమానికి బాటలు..
కులగణనపైనా సీఎం స్పందించారు. 'కులగణన, ఎస్సీ వర్గీకరణలో తెలంగాణ ఒక రోల్ మోడల్. కులగణన ద్వారా ప్రజా సంక్షేమానికి బాటలు వేస్తున్నాం. రాహుల్ గాంధీ చెప్పింది నేను కచ్చితంగా చేస్తా. రాష్ట్రంలో కులగణన సమగ్రంగా నిర్వహించాం. ఇందులో వెల్లడైన వివరాల ఆధారంగా భవిష్యత్తులో కమిషన్ లేదా కమిటీ వేస్తాం. ప్రజలకు ఏ విధంగా సంక్షేమ ఫలాలు అందజేయాలో ఆలోచన చేస్తాం' అని ముఖ్యమంత్రి వివరించారు.
వ్యక్తిగతంగా మాట్లాడలేదు..
'ప్రధాని మోదీ గురించి నేను వ్యక్తిగతంగా మాట్లాడలేదు. మోదీ పుట్టుకతో బీసీ కాదని మాత్రమే చెప్పాను. పుట్టుకతో బీసీ కాదు కాబట్టే.. బీసీల పట్ల ప్రధానికి చిత్తశుద్ధి లేదని అన్నాను. దాంట్లో తప్పేముంది. నా వ్యాఖ్యలను బండి సంజయ్, కిషన్‌రెడ్డి, వక్రీకరించారు. మోదీకి చిత్తశుద్ధి ఉంటే జనగణనలో కులగణన కూడా చేయాలి' అని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
బీసీని ముఖ్యమంత్రి చేయలేదు..
రేవంత్ చేసిన ఈ కామెంట్స్‌పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. 'దశాబ్దాల పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ.. జాతీయ జనగణనలో బీసీ కులగణన ఎందుకు చేపట్టలేదు. ఒక్క బీసీని కూడా ఎందుకు ముఖ్యమంత్రిని చేయలేదు. ప్రధాని మోదీ కులం ఏంటో నాకు నిన్ననే తెలిసింది. సీఎం హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి ప్రధానికి కులాన్ని ఆపాదించారు. కన్వర్టెడ్ బీసీ అంటూ అసంబద్ధ ఆరోపణ చేశారు' అని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ హయాంలోనే..
'1994లో గుజరాత్‌లో కాంగ్రెస్ అధికారంలో ఉంది. అప్పటి కాంగ్రెస్ సీఎం ఛబీల్‌దాస్ మెహతా హయాంలోనే మోదీకి సంబంధించిన కులాన్ని బీసీలోకి చేర్చారు. 1970 తర్వాతే అనంత్‌రామన్ కమిషన్ బీసీ కులాలను వెలుగులోకి తీసుకువచ్చింది. అప్పటివరకు 93 బీసీ కులాలుంటే.. ఆ తర్వాత 118కి పెరిగాయి. గౌడ, ముదిరాజ్, మున్నూరుకాపు, యాదవ ఇతరత్రా బీసీ కులాలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు వీరందరినీ రేవంత్ కన్వర్టెడ్ బీసీలుగా పరిగణిస్తున్నారా?' అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.