Hyderabad : లెక్క తేల్చడం కోసమే స్థానిక ఎన్నికలు వాయిదా వేశాం.. క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్-cm revanth reddy interesting comments during a meeting with bc association leaders ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hyderabad : లెక్క తేల్చడం కోసమే స్థానిక ఎన్నికలు వాయిదా వేశాం.. క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్

Hyderabad : లెక్క తేల్చడం కోసమే స్థానిక ఎన్నికలు వాయిదా వేశాం.. క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్

Hyderabad : ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో కులసర్వే నిర్వహించామని.. సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కులాల లెక్క తేల్చడం కోసమే స్థానిక ఎన్నికలు వాయిదా వేశామని వివరించారు. బీసీ సంఘాల నాయకులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.

బీసీ నేతల సమావేశంలో రేవంత్ రెడ్డి

బీసీ సంఘాల నాయకులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బీసీ సంఘాల నేతలు రేవంత్ రెడ్డిని అభినందించారు. వెంటనే స్పందించిన రేవంత్.. ఈ అభినందనలు తనకు కాదు అందించాల్సింది.. రాహుల్ గాంధీకి అని వ్యాఖ్యానించారు. భారత్ జోడో యాత్ర సందర్భంగా అధికారంలోకి వచ్చిన రాష్ట్రాల్లో కులగణన నిర్వహిస్తామని రాహుల్ గాంధీ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు.

సోషల్ జస్టిస్ డే..

'ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో కుల సర్వే నిర్వహించాం. 50 శాతానికి మించి రిజర్వేషన్లు పెంచుకోవాలంటే ముందుగా జనాభా లెక్క తేలాలి. ఆ లెక్కలకు చట్టబద్ధత కల్పించాలి. అప్పుడే రిజర్వేషన్లు పెంచుకునేందుకు వీలుంటుంది. అందుకే రాష్ట్రంలో బీసీ కులసర్వే నిర్వహించుకున్నాం. అసెంబ్లీలో ఫిబ్రవరి 4కు ప్రత్యేక స్థానం ఉంది. అందుకే ఫిబ్రవరి 4ను సోషల్ జస్టిస్ డేగా ప్రకటించుకున్నాం' అని ముఖ్యమంత్రి వివరించారు.

పక్కా ప్రణాళికతో..

'పక్కా ప్రణాళికతో మంత్రివర్గ ఉపసంఘం, అ తరువాత డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసి ఒక టైం ఫ్రేమ్‌లో కులసర్వే పూర్తి చేశాం. మొదటి విడతలో కులసర్వేలో పాల్గొనని వారికోసం రెండో విడతలో అవకాశం కల్పించాం. పూర్తి పారదర్శకంగా కులసర్వేను పూర్తి చేశాం. ఏ పరీక్షలోనైనా మనం చేసిన పాలసీ డాక్యుమెంట్ నిలబడేలా జాగ్రత్తలు తీసుకున్నాం' అని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు.

మనమే ఆదర్శం..

'దేశంలో ఏ రాష్ట్రంలో లెక్కలు తేల్చాలన్నా మన రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకోవాలనేదే మా ఆలోచన. ఈ కులసర్వే చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. ఇందులో మేం భాగస్వాములవడం మాకు గర్వకారణం. దీనిని బీసీ సోదరులు అర్థం చేసుకోవాలి.. దీన్ని తప్పుపడితే నష్టపోయేది బీసీ సోదరులే. కేవలం డాక్యుమెంట్ చేసి వదిలేయకుండా బిల్లు చేశాం. రాజకీయ పరమైన రిజర్వేషన్లు, విద్యా ఉద్యోగ రిజర్వేషన్ల కోసం వేర్వేరుగా రెండు బిల్లులు శాసనసభలో ఆమోదించుకున్నాం' అని రేవంత్ వివరించారు.

అందుకే వాయిదా వేశాం..

'జనగణనలో కులగణన ఎప్పుడూ జరగలేదు. జనగణనలో కులగణనను చేర్చితే సరైన లెక్క తేలుతుంది. మండల్ కమిషన్ కూడా బీసీల లెక్క 52 శాతం అని తేల్చింది. కానీ మేం కులసర్వే ద్వారా బీసీల లెక్క 56.36 శాతంగా తేల్చాం. లెక్కతేల్చడం కోసమే స్థానిక ఎన్నికలు వాయిదా వేశాం. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ బీసీలకు అండగా ఉంది. పీసీసీ అధ్యక్షులుగా పనిచేసినవారిలో ఎక్కువ మంది బీసీలే. ఈ కులగణన అందరికీ భగవద్గీత, బైబిల్, ఖురాన్ లాంటిది' అని సీఎం స్పష్టం చేశారు.

మీకు అండగా ఉంటా..

'ఈ కులగణన పునాది లాంటిది. ముందు అమలు చేసుకుని తరువాత అవసరాన్నిబట్టి సవరణలు చేసుకోవచ్చు. కులం ముసుగులో రాజకీయంగా ఎదగాలని అనుకునే వారి ట్రాప్‌లో పడకండి. ఈ సర్వేను తప్పుపడితే నష్టపోయేది మీరే. పునాదిలోనే అడ్డుపడితే మీకు మీరే అన్యాయం చేసుకున్నవారవుతారు. మీ హక్కుల సాధన కోసం మీరే నాయకత్వం వహించండి.. నేను మీకు మద్దతుగా నిలబడతా' అని రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు.

Basani Shiva Kumar

TwittereMail
బాసాని శివకుమార్ హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 8 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్‌లో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పీజీ పూర్తి చేశారు. గతంలో ఈనాడు, ఈటీవీ భారత్, టీవీ9 తెలుగు, టైమ్స్ ఆఫ్ ఇండియా సమయంలో పని చేశారు. 2025లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.