రాష్ట్రంలోని 34 వైద్య కళాశాలలు పూర్తి స్థాయి వసతులతో పని చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికను వెంటనే తయారు చేయాలన్నారు. ఇందుకోసం అధికారులతో ఒక కమిటీని ఏర్పాటు చేయాలని చెప్పారు.
ఈ కమిటీ రాష్ట్రంలోని ప్రతి కళాశాలను సందర్శించి సమగ్రమైన వివరాలతో నివేదిక సమర్పించాలని ఆదేశించారు. రాష్ట్రంలోని వైద్య కళాశాలలకు సంబంధించి జాతీయ వైద్య మండలి లేవనెత్తిన పలు అంశాలపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో పాటు ఆ శాఖ ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు.