గో సంర‌క్షణ‌కు స‌మ‌గ్ర విధానం..! ప్రత్యేక కమిటీ ఏర్పాటు - సీఎం రేవంత్ కీలక ఆదేశాలు-cm revanth reddy instructs officials to formulate a comprehensive policy for cow protection ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  గో సంర‌క్షణ‌కు స‌మ‌గ్ర విధానం..! ప్రత్యేక కమిటీ ఏర్పాటు - సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

గో సంర‌క్షణ‌కు స‌మ‌గ్ర విధానం..! ప్రత్యేక కమిటీ ఏర్పాటు - సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

రాష్ట్రంలో గోవుల సంర‌క్ష‌ణ‌కు స‌మ‌గ్ర విధానం రూపొందించాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. ఇందుకోసం ముగ్గురు అధికారుల‌తో ఉన్నతస్థాయి క‌మిటీని నియ‌మించారు.వేముల‌వాడ స‌మీపంలో వంద ఎక‌రాల‌కు త‌క్కువ కాకుండా గోశాల ఉండాల‌ని సీఎం తెలిపారు.

గో సంర‌క్షణ‌కు స‌మ‌గ్ర విధానం రూపొందించండి - సీఎం రేవంత్ రెడ్డి

రాష్ట్రంలో గో సంర‌క్ష‌ణ‌కు స‌మ‌గ్ర విధానం రూపొందించాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. ఇందుకోసం వివిధ రాష్ట్రాల్లోని విధానాల‌ అధ్య‌య‌నానికి ముగ్గురు అధికారుల‌తో ఒక క‌మిటీని సీఎం నియ‌మించారు. ప‌శు సంవ‌ర్ధ‌క శాఖ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి స‌బ్య‌సాచి ఘోష్‌, దేవాదాయ శాఖ ముఖ్య‌ కార్య‌ద‌ర్శి శైల‌జా రామ‌య్య‌ర్, వ్య‌వ‌సాయ శాఖ కార్య‌ద‌ర్శి ర‌ఘునంద‌న్‌రావు ఈ కమిటీలో చోటు కల్పించారు.

రాష్ట్రంలో గో సంర‌క్ష‌ణ‌పై ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి మంగ‌ళ‌వారం సాయంత్రం త‌న నివాసంలో స‌మీక్ష నిర్వ‌హించారు. మ‌న సంస్కృతిలో గోవుల‌కు ఉన్న ప్రాధాన్యం, భ‌క్తుల మ‌నోభావాలను దృష్టిలో ఉంచుకోవ‌డంతో పాటు గోవుల సంర‌క్ష‌ణే ప్ర‌ధానంగా విధానాల రూప‌క‌ల్ప‌న ఉండాల‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. భ‌క్తులు గోశాల‌ల‌కు పెద్ద సంఖ్య‌లో గోవులు దానం చేస్తున్నార‌ని... స్థ‌లాభావం, ఇత‌ర స‌మ‌స్య‌ల‌తో అవి త‌ర‌చూ మృత్యువాత ప‌డుతున్నాయ‌ని సీఎం ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

తొలుత 4 ప్రదేశాల్లో ఏర్పాటు - సీఎం రేవంత్ రెడ్డి

ప్రస్తుత ప‌రిస్థితుల‌ను అధిగ‌మించి గోవుల‌ సంర‌క్ష‌ణే ధ్యేయంగా తొలుత రాష్ట్రంలోని నాలుగు ప్ర‌దేశాల్లో అత్యాధునిక వ‌స‌తుల‌తో గోశాల‌లు నిర్మించాల‌ని సీఎం సూచించారు. ప్ర‌ముఖ దేవ‌స్థానాల ఆధ్వ‌ర్యంలో కోడె మొక్కులు చెల్లించే వేముల‌వాడ‌, యాద‌గిరిగుట్ట, హైద‌రాబాద్ న‌గ‌ర స‌మీపంలోని ఎనికేప‌ల్లి, ప‌శు సంవ‌ర్థ‌క శాఖ విశ్వ విద్యాల‌యం స‌మీపంలో విశాల ప్ర‌దేశాల్లో తొలుత గోశాల‌లు నిర్మించాల‌ని దిశానిర్దేశం చేశారు.

భ‌క్తులు అత్య‌ధిక భక్తిశ్ర‌ద్ధ‌ల‌తో స‌మ‌ర్పించే కోడెల ప‌ట్ల ప్ర‌త్యేకమైన‌ శ్ర‌ద్ధ క‌న‌ప‌ర్చాల‌ని సీఎం సూచించారు. వేముల‌వాడ స‌మీపంలో వంద ఎక‌రాల‌కు త‌క్కువ కాకుండా గోశాల ఉండాల‌న్నారు. గో సంర‌క్ష‌ణ విష‌యంలో రాష్ట్ర ప్ర‌భుత్వం ఎంత‌టి వ్య‌యానికైనా వెనుకాడ‌ద‌ని స్ప‌ష్టం చేశారు. రాష్ట్రంలో గోశాల‌ల నిర్వ‌హ‌ణ‌కు సంబంధించిన అప్రోచ్ పేప‌ర్‌ను అధికారులు సీఎంకు అంద‌జేశారు.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.