పాశమైలారం ప్రమాద ఘటన : మృతుల కుటుంబాలకు రూ. కోటి నష్ట పరిహారం ఇప్పిస్తాం - సీఎం రేవంత్ రెడ్డి-cm revanth reddy inspects pashamylaram incident site and announced immediate relief for victims ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  పాశమైలారం ప్రమాద ఘటన : మృతుల కుటుంబాలకు రూ. కోటి నష్ట పరిహారం ఇప్పిస్తాం - సీఎం రేవంత్ రెడ్డి

పాశమైలారం ప్రమాద ఘటన : మృతుల కుటుంబాలకు రూ. కోటి నష్ట పరిహారం ఇప్పిస్తాం - సీఎం రేవంత్ రెడ్డి

పాశమైలారంలోని సిగాచి పరిశ్రమ ప్రమాదస్థలిని సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. అనంతరం అధికారులతో సీఎం సమీక్షించారు. బాధితులకు ప్రభుత్వం తరుఫున అండగా ఉంటామని హామీనిచ్చారు. ప్రమాదంపై అత్యున్నత కమిటీతో విచారణ జరిపిస్తామన్నారు. మృతుల కుటుంబాలకు రూ.కోటి నష్టపరిహారం అందించాలని ఆదేశిస్తున్నామని చెప్పారు.

ఘటనాస్థలిలో సీఎం రేవంత్, మంత్రులు

సంగారెడ్డి జిల్లా : పాశమైలారం పేలుడు ఘటనాస్థలిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించారు. సిగాచి పరిశ్రమను పరిశీలించిన అనంతరం అధికారులతో సమీక్షించారు. పరిశ్రమ అనుమతులు, భద్రతా ప్రమాణాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. తాజా ప్రమాదంపై నిపుణులతో విచారణ జరిపి పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఇప్పటికే తనిఖీ చేసిన అధికారులతో కాకుండా కొత్త వారితో విచారణ జరిపించాలని స్పష్టం చేశారు.

బాధితులకు ప్రభుత్వం తరుఫున అండగా ఉంటామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇలాంటి ప్రమాదం తెలంగాణలో ఇప్పటివరకు జరగలేదన్న ఆయన… సిగాచి ప్రమాదం దురదృష్టకరమన్నారు. అత్యంత విషాద ఘటన అని చెప్పారు. అన్ని శాఖలు సమన్వయంతో రెస్క్యూ నిర్వహిస్తున్నామని చెప్పారు.

రూ.కోటి నష్టపరిహాం ఇప్పిస్తాం - సీఎం రేవంత్

కంపెనీ వాళ్లతో మాట్లాడి మృతుల కుటుంబాలకు రూ.కోటి నష్టపరిహారం అందించేలా చూస్తాం. గాయపడి పనిచేయని స్థితిలో ఉన్న బాధితులకు రూ.10 లక్షలు అందేలా మాట్లాడుతాం. దుర్ఘటన జరిగిన సమయంలో పరిశ్రమలో 143 మంది ఉన్నారు. ప్రమాదంపై అత్యున్నత కమిటీతో విచారణ జరిపిస్తాం. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం. మృతులు, గాయపడిన వారి పిల్లల చదువుల బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. ప్రమాదానికి సంబంధించి ప్రాథమిక సమాచారం మా దగ్గర ఉంది. విచారణ జరిగి నివేదిక వచ్చాక పూర్తి వివరాలు వెల్లడిస్తాం” అని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.

మరోవైపు బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరపున ఆర్థికంగా తక్షణ సాయం కల్పించాలని అధికారులను సీఎం రేవంత్‌ ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ.లక్ష, క్షతగాత్రులకు రూ.50 వేలు అందించాలన్నారు.

ఇప్పటివరకు 36 మంది మృతి - సీఎం రేవంత్ ప్రకటన

“ఇప్పటి వరకు 36 మంది చనిపోయారు. ఘటనా సమయంలో 143 మంది ఉన్నారు. 58 మందిని అధికారులు గుర్తించారు. మిగిలిన వారిని గుర్తించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గాయపడినవారికి మెరుగైన చికిత్సఅందించాలని ఆదేశించాం. ఘటనకు బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకుంటాం. భవిష్యత్ లో ఇలాంటి ఘటనలు జరగకుండా ఒక స్పష్టమైన విధానంతో ముందుకెళ్తాం. ఇలాంటి ఘటనలు జరగకుండా కంపెనీల్లో పీరియాడికల్ ఇన్స్పెక్షన్ చేయాలని అధికారులను ఆదేశించాం. బాధిత కుటుంబాలను అన్నివిధాలా ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మృతదేహాలను బాధిత కుటుంబాలకు అప్పగించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించాం” అని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం