Hyderabad : మైక్రోసాఫ్ట్ నూతన భవనం ప్రారంభం.. హైదరాబాద్ జర్నీలో ఇదొక మైలురాయి : రేవంత్ రెడ్డి
Hyderabad : ప్రపంచంలోనే అతిపెద్ద టెక్నాలజీ కంపెనీల్లో ఒకటి మైక్రోసాఫ్ట్. దీనికి సంబంధించిన నూతన భవనాన్ని హైదరాబాద్‌లో నిర్మించారు. దాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. మైక్రోసాఫ్ట్, తెలంగాణ ప్రభుత్వ భాగస్వామ్య ప్రాజెక్టుల గురించి వివరించారు.
హైదరాబాద్ నగరంలో మరో కొత్త మైక్రోసాఫ్ట్ ఫెసిలిటీని ప్రారంభించుకోవడం మనందరికీ గర్వకారణం అని.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. హైదరాబాద్ ఐటీ జర్నీలో ఇదొక మైలురాయి అని అభివర్ణించారు. మైక్రోసాఫ్ట్- హైదరాబాద్ మధ్య సుదీర్ఘ భాగస్వామ్యం ఉందని వివరించారు. మైక్రోసాఫ్ట్ ఇండియా ఇటీవలే 25 ఏళ్లు పూర్తి చేసుకుందన్న రేవంత్.. హైదరాబాద్ నుంచి గ్లోబల్ ఇన్నోవేషన్, ఇంపాక్ట్ క్రియేట్ చేశారని చెప్పారు.
యువతకు ఉద్యోగాలు..
'మైక్రోసాఫ్ట్ విస్తరణతో యువతకు మరిన్ని ఉద్యోగాలు లభించనున్నాయి. ఇది యువతకు మరింత సాధికారత కల్పిస్తుందని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. భవిష్యత్తు ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌దే. మైక్రోసాఫ్ట్, తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు ఏఐ ఫౌండేషన్ అకాడమీని ప్రారంభించడంలో భాగస్వాములుగా ఉన్నాయి. ఈ భాగస్వామ్యంతో తెలంగాణ, మైక్రోసాఫ్ట్ 500 ప్రభుత్వ పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విద్యను ప్రవేశపెట్టబోతున్నాయి' అని ముఖ్యమంత్రి వివరించారు.
ప్రభుత్వ సహకారంతో..
'గవర్నెన్స్ అండ్ పబ్లిక్ సర్వీసెస్ కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగించనున్నాం. ఈ పెట్టుబడి మా స్టార్టప్ ఎకోసిస్టమ్‌ను బలోపేతం చేయడం తోపాటు.. మెంటార్షిప్, ఏఐ టూల్స్, గ్లోబల్ నెట్వర్క్ యాక్సెస్‌ను ఇస్తుంది. మా ప్రభుత్వ సహకారంతో మైక్రోసాఫ్ట్ ఏఐ సెంటర్‌ను ఏర్పాటు చేస్తుందని గర్వంగా చెబుతున్నా. ఈ కేంద్రం ఏఐ నాలెడ్జ్ హబ్ సహా.. క్లౌడ్ ఆధారిత ఏఐ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తుంది' అని రేవంత్ వ్యాఖ్యానించారు.
మైక్రోసాఫ్ట్‌కు ధన్యవాదాలు..
'తెలంగాణపై నమ్మకం ఉంచిన మైక్రోసాఫ్ట్ లీడర్ షిప్ టీమ్‌కు ధన్యవాదాలు. ఆవిష్కరణల పట్ల మీ నిబద్ధత.. మా తెలంగాణ రైజింగ్ విజన్‌కు తోడవుతుంది.' అని రేవంత్ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. మైక్రోసాఫ్ట్ నిరంతరం కొత్త సాంకేతికతలను అభివృద్ధి చేస్తూ.. వినియోగదారులకు ఉపయోగకరమైన ఉత్పత్తులను, సేవలను అందించడానికి కృషి చేస్తుందని ముఖ్యమంత్రి కొనియాడారు.
ఇటీవలే భేటీ..
గతేడాది డిసెంబర్ 30న మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. తెలంగాణ ప్రభుత్వం మొదటి నుంచీ మైక్రోసాఫ్ట్‌కు సానుకూలంగా ఉంది. హైదరాబాద్ మైక్రోసాఫ్ట్ సెంటర్‌లో సుమారు 4 వేల ఉద్యోగాలు వచ్చే విధంగా ఇటీవల ఒప్పందాలు జరిగాయి. దీనికి సంబంధించిన పురోగతిపైనా సత్యనాదెళ్లతో రేవంత్ చర్చించారు. స్కిల్ యూనివర్సిటీ, ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీల ఏర్పాటు గురించి సత్య నాదెళ్లకు సీఎం వివరించారు.