HYDRA : గ్రేటర్ పరిధిలో సరికొత్త వ్యవస్థ - ఇకపై ఆ విభాగాలన్నీ 'హైడ్రా' పరిధిలోనే..! కీలక విషయాలివే-cm revanth reddy held a meeting on hydra and wanted it to function as strong system in ghmc limits ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hydra : గ్రేటర్ పరిధిలో సరికొత్త వ్యవస్థ - ఇకపై ఆ విభాగాలన్నీ 'హైడ్రా' పరిధిలోనే..! కీలక విషయాలివే

HYDRA : గ్రేటర్ పరిధిలో సరికొత్త వ్యవస్థ - ఇకపై ఆ విభాగాలన్నీ 'హైడ్రా' పరిధిలోనే..! కీలక విషయాలివే

Maheshwaram Mahendra Chary HT Telugu
Published Jul 13, 2024 05:18 AM IST

CM Revanth On HYDRA : హైదరాబాద్ నగర పరిధిలో ప్రజలకు నిత్యం సేవలు అందించాల్సిన విభాగాలన్నీ ఒకే గొడుకు కింద మరింత పటిష్టవంతంగా పనిచేసేలా "హైడ్రా" విధి విధానాలను రూపొందించాలని సీఎం రేవంత్ ఆదేశించారు. జాతీయ విపత్తుల నిర్వహణ చట్టానికి అనుగుణంగా ఈ కొత్త వ్యవస్థను ఏర్పాటు చేయాలని దిశానిర్దేశం చేశారు.

సీఎం రేవంత్ సమీక్ష
సీఎం రేవంత్ సమీక్ష

హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ ప్రొటెక్షన్ (హైడ్రా) వ్యవస్థాగత నిర్మాణం, విధివిధానాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం సమీక్షించారు.  హైదరాబాద్ సిటీ విస్తరణకు అనుగుణంగా ప్రజలకు విస్తృత సేవలను అందించేలా 'హైడ్రా' రూపుదిద్దుకోవాలని దిశానిర్దేశం చేశారు.

జాతీయ విపత్తుల నిర్వహణ చట్టానికి అనుగుణంగా ఈ కొత్త వ్యవస్థను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.  హైడ్రా వ్యవస్థాగత నిర్మాణం, విధి విధానాలపై మరింత అధ్యయనం చేసి కసరత్తు చేయాలని  సూచించారు.

ఇతర వ్యవస్థలతో సమన్వయం..

జీహెచ్ఎంసీతో పాటు, హెచ్ఎండిఏ, వాటర్ బోర్డు, విజిలెన్స్, ట్రాఫిక్, విద్యుత్తు, పోలీస్ విభాగాలను సమన్వయం చేసుకొని మరింత సమర్థంగా హైడ్రా పని చేసేలా ఉండాలని అధికారులకు ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు. ఇప్పుడున్న ఎన్​ ఫోర్స్​మెంట్​ విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ విభాగాన్ని అందుకు అనుగుణంగా పునర్‌ వ్యవస్థీకరించాలని ఆదేశించారు. కొత్త విభాగంలో ఏయే స్థాయి అధికారులుండాలి.. ఎంత మంది సిబ్బంది ఉండాలి..? ఏయే విబాగాలపై ఎవరిని డిప్యుటేషన్పై తీసుకోవాలి..? అనే అంశాలపై స్పష్టమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు.

ఇకపై ఇవన్నీ హైడ్రాకే..

విపత్తుల నిర్వహణతో పాటుగా ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ, చెరువులు, నాలాల కబ్జాలకు అడ్డుకట్ట వేయటం, ఆక్రమణలను తొలిగించటం, అక్రమ నిర్మాణాలు, నిబంధనలను పాటించని ఫ్లెక్సీలు, హోర్డింగ్లు, ప్రకటనల తొలిగింపు వంటివి హైడ్రా కిందకే రావాలని సీఎం సూచించారు.  ట్రాఫిక్ నిర్వహణ, తాగునీరు, విద్యుత్తు సరఫరాలో హైడ్రా కీలకంగా వ్యవహరించేలా విధులు అప్పగించాలని సీఎం చెప్పారు. 

హెచ్ఎండీఏ, వాటర్ వర్క్స్, డిజాస్టర్ మేనేజ్​మెంట్​, మున్సిపల్ విభాగాల మధ్య ఎప్పటికప్పుడు సమన్వయం ఉండాలని అధికారులను అప్రమత్తం చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న అనధికారిక హోర్డింగ్స్, ఫ్లెక్సీలు తొలగింపు, అపరాధ రుసుము వసూలు బాధ్యతను హైడ్రాకు బదలాయించాలని అన్నారు. నాలాలు, చెరువులు, ప్రభుత్వ స్థలాల ఆక్రమణల విషయంలో నిబంధనలు కఠినంగా ఉండేలా అధ్యయనం చేయాలని సూచించారు.

అసెంబ్లీ భేటీలోగా ముసాయిదా..

జీహెచ్ఎంసీతో పాటు హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డు వరకు 2 వేల చ. కి.మీ పరిధిలో హైడ్రా పని చేయాల్సి ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. పని విభజనకు వీలుగా సిటీలో ఇప్పుడున్న జోన్ల తరహాలో భౌగోళిక పరిధిని నిర్దేశించాలని సూచించారు. అవసరమైతే హైడ్రాకు ప్రత్యేక నిధులు కేటాయించే అంశాన్ని పరిశీలించాలని చెప్పారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లోగా ముసాయిదా తయారు చేయాలని చెప్పారు.

ముఖ్యమంత్రి నిర్వహించిన ఉన్నతస్థాయి సమావేశంలో సీఎస్ శాంతి కుమారి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ముఖ్య కార్యదర్శి దానకిషోర్, జీహెచ్ఎంసీ కమిషనర్ అమ్రాపాలీ, జీహెచ్ఎంసీ ఈవీడీఎం కమిషనర్ రంగనాథ్, సీఎంవో ముఖ్య కార్యదర్శి శేషాద్రితో పాటు సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి పాల్గొన్నారు.

Whats_app_banner