CM Revanth Reddy : బుద్ధవనంలో అంతర్జాతీయ మ్యూజియం..! హైదరాబాద్ - సాగర్ హైవే విస్తరణపై కీలక ఆదేశాలు-cm revanth reddy has issued key orders for the development of tourism in the state ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Cm Revanth Reddy : బుద్ధవనంలో అంతర్జాతీయ మ్యూజియం..! హైదరాబాద్ - సాగర్ హైవే విస్తరణపై కీలక ఆదేశాలు

CM Revanth Reddy : బుద్ధవనంలో అంతర్జాతీయ మ్యూజియం..! హైదరాబాద్ - సాగర్ హైవే విస్తరణపై కీలక ఆదేశాలు

Maheshwaram Mahendra Chary HT Telugu
Published Sep 01, 2024 06:23 AM IST

రాష్ట్రంలో టూరిజం అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలను జారీ చేశారు. బుద్ధవనంలో అంతర్జాతీయ బుద్ధ మ్యూజియం ఏర్పాటుతో పాటు నాగార్జునసాగర్ టూరిజంపై స్పెషల్ ఫోకస్ పెట్టాలని అధికారులకు సూచించారు. హైదరాబాద్-నాగార్జునసాగర్ ఫోర్ లేన్ రహదారికి నిర్ణయం తీసుకున్నారు.

సీఎం రేవంత్ రెడ్డి
సీఎం రేవంత్ రెడ్డి

రాష్ట్రంలో ఉన్న బౌద్ధ పర్యాటక స్థలాలను ప్రపంచస్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. దేశ విదేశాల్లోని బుద్దిస్టులను ఆకట్టుకునేలా బుద్ధవనంలో ఇంటర్నేషనల్ బుద్ధ మ్యూజియం నెలకొల్పే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

కొత్త టూరిజం పాలసీలో భాగంగా తెలంగాణలో చారిత్రకంగా పేరొందిన ఫణిగిరి, నేలకొండపల్లి, నాగార్జునసాగర్ బౌద్ద క్షేత్రాలతో పాటు హుస్సేన్​ సాగర్​లో ఉన్న బుద్ధ విగ్రహాన్ని ఒకే టూరిజం సర్క్యూట్ గా అభివృద్ధి చేయాలని సంకల్పించారు.

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్వదేశీ దర్శన్ 2.0 స్కీమ్​లో భాగంగా బుద్ధవనం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే కేంద్రానికి డీపీఆర్ ను పంపించింది. రూ.25 కోట్ల అంచనాలతో బుద్ధవనంలో బుద్ధిస్ట్ డిజిటల్ మ్యూజియం అండ్ ఎగ్జిబిషన్, డిజిటల్ ఆర్కివ్స్ ఏర్పాటు చేయాలని అందులో ప్రతిపాదించింది. వీటితో పాటు తాజాగా ఇంటర్నేషనల్​ బుద్ధ మ్యూజియం ను ఈ ప్రణాళిక లో పొందుపరచనుంది.

ఇందులో భాగంగా నాగార్జునసాగర్ బుద్ధవనాన్ని టూరిజం, స్పిర్చువల్ డెస్టినేషన్ సెంటర్ గా తీర్చిదిద్దుతారు. నాగార్జున సాగర్ డ్యామ్​ అందాలతో పాటు పరిసరాల్లోని బుద్ధవనాన్ని అంతర్జాతీయ బౌద్ధక్షేత్రంగా అభివృద్ధి చేయాలని సంకల్పించారు. నాగార్జున సాగర్​ సందర్శనకు వెళ్లే పర్యాటకులు బ్యాక్ వాటర్ వరకు బోట్ లో విహారించే ఏర్పాట్లు పునరుద్ధరించాలని నిర్ణయించారు.

ప్రతిపాదనలు సిద్ధం చేయండి -సీఎం రేవంత్ రెడ్డి

దేశ విదేశాల నుంచి వచ్చే పర్యాటకులకు ఆకర్షించేందుకు అనువైన టూరిజం ప్యాకేజీలు రూపొందిస్తారు. హైదరాబాద్ నుంచి నాగార్జున సాగర్ వరకు ఫోర్ లేన్ రోడ్ నిర్మిస్తారు. ఈ రహదారికి ప్రతిపాదనలు తయారు చేయాలని ఆర్ అండ్ బీ అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్​ హుస్సేన్​సాగర్​ బుద్ధ విగ్రహం చుట్టూ టూరిజం డెస్టినేషన్​ సర్కిల్​ గా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు.

ట్యాంక్​ బండ్​, తెలంగాణ అమరుల జ్యోతి, నెక్లెస్​ రోడ్డు, సంజీవయ్య పార్కు వరకు వలయాకారం లో స్కై వాక్ వే డిజైన్ చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. ఈ ప్రాంతాన్ని భవిష్యత్తులో వరల్డ్ క్లాస్ టూరిజం హబ్ గా రూపొందించాలని ఆదేశించారు. అనుభవమున్న కన్సల్టెన్సీలు, నిపుణులతో అంతర్జాతీయ స్థాయి నమూన డిజైన్లు తయారు చేయించాలన్నారు.

పర్యాటకులు ఆహ్లాదంగా గడిపేలా ఫుడ్​ కోర్టులు, వివిధ స్టాళ్ల ను ఏర్పాటు చేసి ఈ ప్రాంతాన్ని సిటీలో సుందరంగా తీర్చిదిద్దాలని సీఎం ఆదేశించారు. గోల్కొండ చుట్టూ ఉన్న రోడ్లన్నీ ఇరుకుగా అయ్యాయని… వాటిని విశాలంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఆక్రమణలుంటే తొలగించాలని… అక్కడున్న ఇండ్ల వాసులు, దుకాణదారులు నిరాశ్రయులు కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. వారికి మరో చోట పునరావాసం కల్పించే చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

Whats_app_banner