TG Tourism Policy 2025 : ‘ఫిబ్రవరి 10లోపు పర్యాటక విధానం సిద్ధం కావాలి’ - సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
Telangana Tourism Policy : దేశవ్యాప్తంగా భక్తులు, పర్యాటకులను ఆకర్షించేలా టూరిజం ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. టూరిజం పాలసీపై సమీక్షించిన ఆయన.. పలు కీలక సూచనలు చేశారు. ఫిబ్రవరి 10 వ తేదీలోగా అత్యుత్తమ పర్యాటక విధానం సిద్ధం చేయాలని స్పష్టం చేశారు.
ఫిబ్రవరి 10 వ తేదీలోగా అత్యుత్తమ పర్యాటక విధానం సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. దేశ, విదేశాల్లోని అత్యుత్తమ పాలసీని అధ్యయనం చేసి తెలంగాణ పర్యాటక పాలసీని రూపొందించాలని చెప్పారు.
బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టూరిజం పాలసీపై సమీక్షించారు. సంబంధిత శాఖ ఉన్నతాధికారులతో సమీక్షించి పలు సూచనలు చేశారు. దేశ, విదేశాల పర్యాటకులను ఆకర్షించేలా పాలసీ ఉండాలన్నారు. ప్రధానంగా టెంపుల్, ఎకో టూరిజంపై దృష్టి సారించాలని స్పష్టం చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య సూచనలు:
- "రాష్ట్రంలో ఎకో టూరిజం అభివృద్ధికి ఆస్కారం ఉన్న, అవసరమైన ప్రాంతాలను గుర్తించి అభివృద్ధి చేసేలా ప్రణాళికలు ఉండాలి.
- సింగపూర్ తరహా ఎకో టూరిజం విధానాలను పరిశీలించాలి.
- సమ్మక్క-సారలమ్మ జాతర జరిగే సమయంలో భక్తులు, పర్యాటకులను ఆకర్షించేందుకు రెవెన్యూ, అటవీ, పర్యాటక శాఖలు సంయుక్తంగా ప్రణాళికలు సిద్దం చేయాలి.
- జాతరతో పాటు సమీప పర్యాటక ప్రాంతాలు, ఆలయాలను కలుపుతూ ఒక సర్క్యూట్‌ను అభివృద్ధి చేయాలి.
- ఆదిలాబాద్, వరంగల్, నాగార్జునసాగర్ లాంటి ప్రాంతాలలో ఎకో టూరిజంను మరింత అభివృద్ధి చేసేలా ప్రణాళికలు ఉండాలి.
- వచ్చే గోదావరి, కృష్ణా పుష్కరాలకు దేశవ్యాప్తంగా భక్తులు, పర్యాటకులను ఆకర్షించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలి.
- హైదరాబాద్ నగరంలో హుస్సేన్‌సాగర్ పరిసరాల్లోని సంజీవయ్య పార్క్, ఎన్టీఆర్ గార్డెన్, ఇందిరా పార్క్‌లను కలుపుతూ టూరిజం సర్క్యూట్‌ను అభివృద్ధి చేసే అంశాన్ని పరిశీలించాలి.
- పర్యాటక అభివృద్ధితో రాష్ట్రానికి మరింత గుర్తింపు, ఆదాయం వచ్చేలా ఈ పాలసీని రూపొందించాలి" అని అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు.
కుటుంబ సర్వేపై సమీక్ష:
రాష్ట్రంలో విజయవంతంగా పూర్తి చేసిన సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ, కుల గణన (సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే 2024) కు జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. బుధవారం సమగ్ర కుల గణనపై సమీక్షించిన ఆయన పలు కీలక అంశాలను పేర్కొన్నారు.
కుల గణన ప్రక్రియ సామాజిక సాధికారతతో పాటు, భవిష్యత్తులో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బలహీన వర్గాలందరి అభ్యున్నతికి ఉపయోగపడుతుందని సీఎం రేవంత్ అన్నారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఈ కుల గణన సర్వేను చేపట్టి తమ చిత్తశుద్ధిని చాటుకుందని చెప్పారు.
“రాష్ట్రంలో గత ఏడాది నవంబర్ 6 వ తేదీన ఈ సర్వే ప్రారంభం కాగా, అన్ని జిల్లాల్లో డిసెంబర్ మొదటి వారం నాటికి సర్వే పూర్తయింది. రాష్ట్రంలోని దాదాపు 1.16 కోట్ల కుటుంబాలను సర్వేకు గుర్తించగా, ఎన్యుమరేటర్లను ఇంటింటికీ పంపించి వివరాలను సేకరించింది. దాదాపు 96 శాతానికి పైగా కుటుంబాల వివరాలను సర్వే బృందాలు విజయవంతంగా సేకరించాయి. వీటికి సంబంధించిన డేటా ఎంట్రీని పూర్తి చేశాయి” అని అధికారులు సీఎం రేవంత్ రెడ్డికి వివరించారు.
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారధ్యంలో ఆరుగురు మంత్రులతో ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘానికి ఫిబ్రవరి 2 వ తేదీలోగా నివేదిక అందజేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీసీ డెడికేటేడ్ కమిషన్‌కు ఈ గణాంకాలు ఉపయోగపడుతాయని పేర్కొన్నారు.
సంబంధిత కథనం