CM Revanth IE Powerful List 2025 : అత్యంత శ‌క్తిమంతుల జాబితా - 28వ స్థానంలో ముఖ్యమంత్రి రేవంత్-cm revanth reddy has been included in the indian express power list 2025 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Cm Revanth Ie Powerful List 2025 : అత్యంత శ‌క్తిమంతుల జాబితా - 28వ స్థానంలో ముఖ్యమంత్రి రేవంత్

CM Revanth IE Powerful List 2025 : అత్యంత శ‌క్తిమంతుల జాబితా - 28వ స్థానంలో ముఖ్యమంత్రి రేవంత్

CM Revanth Reddy IE Powerful List 2025 : దేశంలోని 100 శక్తివంతమైన వ్యక్తుల జాబితాలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్థానం దక్కించుకున్నారు. అత్యంత శ‌క్తిమంతుల జాబితాలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి 28వ స్థానంలో నిలిచారు. గ‌తేడాదితో పోల్చితే 11 స్థానాలు మెరుగయ్యాయి.

సీఎం రేవంత్ రెడ్డి (image source @Congress4TS)

రాష్ట్ర ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అత్యంత శ‌క్తిమంతుల‌ జాబితాలో చోటు ద‌క్కించుకున్నారు. ద ఇండియ‌న్ ఎక్స్‌ప్రెస్‌ 2025 సంవ‌త్స‌రానికి సంబంధించి దేశంలోని వివిధ రంగాల్లో అత్య‌ధిక శ‌క్తిమంతులైన 100 మంది ప్ర‌ముఖుల‌తో జాబితా విడుద‌ల చేసింది. ఈ జాబితాలో సీఎం రేవంత్ రెడ్డి 28వ స్థానం ద‌క్కించుకున్నారు.

11 స్థానాలు పైకి…!

2024 సంవ‌త్సర‌పు జాబితాలో 39 స్థానంలో ఉన్న ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఏడాది కాలంలోనే ఏకంగా 11 స్థానాలు ఎగ‌బాకి 28వ స్థానానికి చేరుకోవ‌డం విశేషం. దేశంలో రాజ‌కీయ‌, వ్యాపార, క్రీడా, వినోద రంగాల్లో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులు ఈ జాబితాలో ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర పాలనలో తీసుకువచ్చిన మార్పులు, వ్యూహాత్మక రాజకీయ కార్య‌క‌లాపాలు, దేశ‌వ్యాప్తంగా ఇండియా కూట‌మిలో పోషిస్తున్న ప్ర‌ముఖ‌మైన పాత్ర‌తో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి ఈ గుర్తింపు ల‌భించింది.

త‌నదైన దూకుడుతో భార‌త‌ రాజకీయాల్లో ఆయ‌న చూపుతున్న ప్ర‌భావం, నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాల‌తో ఆయ‌న ర్యాంకు మెరుగుప‌డింది. ఒక ప్రాంతీయ నాయ‌కుడినే కాకుండా దేశంలోనే అత్యంత శక్తిమంతమైన, చురుకైన ముఖ్యమంత్రుల్లో ఒక‌రిగా ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆవిర్భ‌వించారు. శ‌క్తిమంతులై వంద మంది జాబితాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మొదటి 10 స్థానాల్లో ఉన్నారు.

పార‌ద‌ర్శ‌క‌మైన పాల‌న‌, రాష్ట్ర స‌మ‌గ్రాభివృద్ధికి క‌ట్టుబ‌డినందునే ద ఇండియ‌న్ ఎక్స్‌ప్రెస్ అత్యంత శ‌క్తిమంతుల జాబితా-2025లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి గుర్తింపు ల‌భించింద‌ని పీసీసీ అధ్య‌క్షుడు మహేశ్ గౌడ్ అన్నారు. ఈ గుర్తింపుతో దేశ‌, తెలంగాణ ప్ర‌జ‌ల‌ ప‌ట్ల ముఖ్య‌మంత్రి గారి బాధ్య‌త‌ను మ‌రింత పెంచింద‌ని ఆయ‌న పేర్కొన్నారు.

భార‌తీయ శ‌క్తిమంతులైన జాబితాలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి చోటు ల‌భించ‌డం భార‌త రాజ‌కీయాల్లో కీల‌క మార్పున‌కు సంకేత‌మ‌ని ప‌లువురు రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డ్డారు. ప్రాంతీయ నేతలు ఇప్పుడు జాతీయ విధానాల రూపకల్పనలో మరింత ప్రభావం చూపుతున్నార‌న‌డానికి ఇదే నిద‌ర్శ‌మ‌ని వ్యాఖ్యానిస్తున్నారు.

Maheshwaram Mahendra Chary

TwittereMail
మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.