CM Revanth Reddy : రైతు భరోసాపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన, సంక్రాంతి తర్వాత రైతుల ఖాతాల్లో నగదు జమ
CM Revanth Reddy : తెలంగాణ రైతులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. సంక్రాంతి పండుగ తర్వాత రైతుల ఖాతాల్లో రైతు భరోసా నగదు జమ చేస్తామన్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో రైతు భరోసా విధివిధానాలు నిర్ణయిస్తామన్నారు.
తెలంగాణ రైతులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. రైతు భరోసా అమలుపై కీలక ప్రకటన చేశారు. సంక్రాంతి పండుగ తర్వాత రైతు భరోసా నిధులు రైతుల అకౌంట్లో జమ చేస్తామని ప్రకటించారు. రైతు భరోసా విధివిధానాలను రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి నిర్ణయిస్తామన్నారు. బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. మారీచుల మాటల నమ్మొద్దన్నారు. సోనియా గాంధీ గ్యారంటీగా తాను చెబుతున్నానని రైతులకు విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి.. రూ.7 లక్షల కోట్ల అప్పుతో కేసీఆర్ ప్రభుత్వాన్ని అప్పగించారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన వెంటనే ఆస్తులు, అప్పులపై శ్వేతపత్రం విడుదల చేసిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులపై తాము ప్రతినెలా రూ.6,500 కోట్లు వడ్డీ చెల్లిస్తున్నామన్నారు.
రూ.500 బోనస్
సన్నరకం వరి ధాన్యానికి రూ.500 బోనస్ ఇస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో సన్నబియ్యంతోనే భోజనాలు అందించేలా ఆదేశాలు ఇచ్చామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణను అప్పులమయంగా చేశారని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే రూ.20 వేల కోట్ల రుణమాఫీ చేశామన్నారు. ఇది దేశంలోనే ఒక రికార్డు అన్నారు. బీఆర్ఎస్, బీజేపీ పార్టీల నుంచి వచ్చే మారీచులను రైతులు నమ్మొద్దని కోరారు. తమ ప్రభుత్వం రైతుల కోసం పనిచేస్తుందని తెలిపారు. గుజరాత్ గులామ్ గిరి చేసే కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి...తెలంగాణ గురించి మాట్లాడే అర్హత లేదని విమర్శించారు. ప్రధాని మోదీ ఇచ్చిన హామీలపై చర్చకు రావాలని కిషన్ రెడ్డికి సీఎం రేవంత్‌రెడ్డి సవాల్ విసిరారు.
సన్న వడ్లు పండించాలి
తెలంగాణపై రూ. 7లక్షల కోట్లు అప్పు ఉందని సీఎం తెలిపారు. ప్రతినెలా రూ. 6500 కోట్లు వడ్డీ కట్టాల్సి ఉందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా దిగజారిందో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. కేసీఆర్ హయాంలో అప్పుల గురించి గతంలో ఎవరూ బయటపెట్టలేదన్నారు. ప్రతిపక్షాల అసత్య ప్రచారాన్ని నమ్మొదని కోరారు. కాంగ్రెస్ గ్యారెంటీలను తప్పక అమలు చేస్తామన్నారు. 2023 వర్షాకాలంలో రైతు బంధును కేసీఆర్ ప్రభుత్వం ఎందుకు వేయలేదని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. రైతులు సన్న వడ్లు పండించాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. రేషన్ కార్డులపై ప్రజలకు సన్న బియ్యం అందిస్తామన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రూ. 7625 కోట్లు రైతుబంధు నిధులు జమ చేశామన్నారు.
రైతులే మా అజెండా
బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులు విషయాలను ఎప్పుడూ బయటపెట్టలేదని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. అధికారంలోకి రాగానే అన్ని అంశాలపై శ్వేతపత్రాలు విడుదల చేశామన్నారు. నెహ్రూ నుంచి వైఎస్ఆర్ వరకు రైతులే కాంగ్రెస్ అజెండా అన్నారు. కేసీఆర్ బకాయి పెట్టిన రైతుబంధును తాము చెల్లించామన్నారు. ఆగస్టు 15 నాటికి 22.22 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేశామన్నారు. ఆగస్టు 15 నాటికి రైతుల ఖాతాల్లో రూ.18 వేల కోట్లు జమ చేయగా, నిన్న 3.14 లక్షల మంది ఖాతాల్లో రూ.2,747 కోట్లు జమ చేశామన్నారు. రుణమాఫీ విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందన్నారు.
సంబంధిత కథనం