రాష్ట్రంలో భూ సమస్యలను పరిష్కరించడంతో పాటు, లావాదేవీల సమాచారాన్ని రైతులకు, ప్రజలకు సులభంగా, వేగంగా అందించేందుకు భూ భారతి పోర్టల్ రానుంది. ఏప్రిల్ 14వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ పోర్టల్ ను ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి... ఉన్నతాధికారులతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు.
"భూ భారతి పైలట్ ప్రాజెక్ట్‌గా తెలంగాణలో మూడు మండలాలను ఎంపిక చేసి... వాటిలో జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో అవగాహన సదస్సులు నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ సదస్సుల ద్వారా భూ భారతి పోర్టల్ గురించి రైతులు, ప్రజలకు సమగ్రంగా వివరించాలన్నారు. వారి సందేహాలను నివృత్తి చేయాలని స్పష్టం చేశారు.
పైలట్ ప్రాజెక్ట్ విజయవంతం తర్వాత, రాష్ట్రవ్యాప్తంగా ప్రతి మండలంలో ఇలాంటి అవగాహన సదస్సులు నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. భూ భారతి పోర్టల్ సరళమైన, సులభంగా అర్థమయ్యే భాషలోనే ఉండాలన్నారు. ప్రజల నుంచి వచ్చే సలహాలు, సూచనల ఆధారంగా దానిని ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలని సూచించారు.
సాంకేతికంగా బలమైన వెబ్‌సైట్, మొబైల్ యాప్‌లతో భూ భారతి పోర్టల్‌ను నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. భూ భారతి పోర్టల్ ప్రజలకు సేవలను సులభతరం చేయడంతో పాటు, వారి భూ సంబంధిత సమస్యలను త్వరితగతిన పరిష్కరించే లక్ష్యంతో రూపొందించిందని గుర్తు చేశారు. కాబట్టి ప్రజల అవసరాలకు అనుగుణంగా నిరంతరం మెరుగుపరచాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించారు.
ఈ ఏడాది జనవరి 9వ తేదీన ‘రికార్డ్ ఆఫ్ రైట్స్ ఇన్ ల్యాండ్ యాక్ట్(RoR)-2025 భూ భారతి’ చట్టం రూపం దాల్చింది. ఈ కొత్త చట్టాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేసే దిశగా కసరత్తు చేస్తూ వచ్చింది. క్షేత్రస్థాయిలోని అధికారి నుంచి పైస్థాయిలోని ఉన్నతాధికారి వరకు చట్టం అమలుపై ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించింది. అందించాల్సిన సేవలు, ఎదురయ్యే సమస్యలపై లోతుగా చర్చించింది. వీటన్నింటి తర్వాతే…. ఈ కొత్త రెవెన్యూ చట్టాన్ని ఏప్రిల్ 14 నుంచి అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.
భూ సమస్యలకు సంబంధించి దరఖాస్తు చేసుకోవడానికి గతంలో పోర్టల్లో 33 మాడ్యూళ్లు ఉండేవి. అయితే భూ భారతి లో ఈ విధానాన్ని సులభతరం చేశారు. మాడ్యూళ్ల సంఖ్యను 33 నుంచి ఆరుకు కుదించారు. ఈ నూతన చట్టం ప్రకారం మ్యుటేషన్‌కు మ్యాప్ తప్పనిసరిగా ఉంటుంది. వారసత్వ భూముల విషయంలో తప్పులు జరగకుండా చర్యలు చేపట్టారు. క్షేత్రస్థాయి విచారణ తర్వాతే… ప్రక్రియ ముందుకు సాగుతుంది. నిర్ణీత కాలంలో విచారణ చేసిన తర్వాతనే పాస్ పుస్తకాలు జారీ అవుతాయి. ఇవే కాకుండా ప్రస్తుతం విధానానికి భిన్నంగా… అనేక మార్పులు రానున్నాయి.