Hyderabad ORR : కోర్ అర్బన్ ఏరియా అంతటా డ్రోన్ సర్వే - మరో 7 ఫ్లైఓవర్ నిర్మాణాలకు గ్రీన్ సిగ్నల్-cm revanth reddy gave important instructions on the development of the core urban area inside the outer ring road ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hyderabad Orr : కోర్ అర్బన్ ఏరియా అంతటా డ్రోన్ సర్వే - మరో 7 ఫ్లైఓవర్ నిర్మాణాలకు గ్రీన్ సిగ్నల్

Hyderabad ORR : కోర్ అర్బన్ ఏరియా అంతటా డ్రోన్ సర్వే - మరో 7 ఫ్లైఓవర్ నిర్మాణాలకు గ్రీన్ సిగ్నల్

Maheshwaram Mahendra Chary HT Telugu
Published Feb 14, 2025 06:25 AM IST

ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న కోర్ అర్బన్ ఏరియాను అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. నగరవాసులకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లాలని దిశానిర్దేశం చేశారు. హెచ్ఎండీఏ అధికారులతో జరిపిన సమీక్షలో కీలక సూచనలు చేశారు.

హెచ్ఎండీఏ అధికారులతో సీఎం రేవంత్ సమీక్ష
హెచ్ఎండీఏ అధికారులతో సీఎం రేవంత్ సమీక్ష

తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ అయిన హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ లోపలి ఏరియా అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు ఇచ్చారు. ఈ ప్రాంతాన్నీ అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేయాలన్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టిన డ్రోన్ సర్వేను కోర్ అర్బన్ ఏరియా అంతటా నిర్వహించాలని సూచించారు.

గురువారం నానక్‌రామ్‌గూడలోని హెచ్ఏండీఏ కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. కోర్ అర్బన్ ఏరియా అభివృద్ధి అంశాలపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. కోర్ అర్బన్ ఏరియాను అభివృద్ధి చేయటంతో పాటు హైదరాబాద్ నగరవాసులకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లాలన్నారు. నగరంలో కొత్తగా మరో 7 ఫ్లైఓవర్లు నిర్మించాలన్న ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనలు…

  • "ప్రస్తుత, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఎలాంటి అంతరాయం లేకుండా మౌలిక సదుపాయాలు కల్పించేందుకు వీలుగా హైదరాబాద్ నగరంలో గృహాలు, మంచినీటి సరఫరా, విద్యుత్ సౌకర్యం, మురుగునీటి వ్యవస్థకు సంబంధించి పూర్తి వివరాలను సేకరించాలి.
  • గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ట్రాఫిక్ నియంత్రణకు అవసరమైతే గూగుల్ సాంకేతిక సహకారాన్ని తీసుకుని వాహనదారులకు ఇబ్బందులు లేకుండా చూడాలి.
  • కోర్ అర్బన్ ప్రాంతంలో చెరువుల పునరుద్ధరణ, నాలాల విస్తరణకు ప్రణాళికలు రూపొందించాలి.
  • ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ప్రధానమైన మరో 7 కూడళ్లలో ఫ్లై ఓవర్ నిర్మాణాలు చేపట్టేందుకు వీలుగా భూసేకరణ, ఇతర పనులను పూర్తి చేసి, వీలైనంత త్వరగా టెండర్లు పిలవాలి" అని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.

డిప్యూటీ సీఎం సమీక్ష - ఆర్ఆర్ఆర్ పై కీలక ఆదేశాలు:

గురువారం సచివాలయంలో ఆర్‌అండ్‌బీ శాఖపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమీక్షించారు. రీజినల్ రింగ్ రోడ్డు పనుల్లో మరింత వేగం పెంచాలని అధికారులన ఆదేశించారు. డీపీఆర్ పనులు వెంటనే పూర్తి చేయాలని సూచించారు. జిల్లా కేంద్రాల నుంచి రాష్ట్ర రాజధాని వరకు ఉన్న రహదారులను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలన్నారు.

వర్షాలకు దెబ్బతిన్న రోడ్ల రిపేర్ పనులు కూడా త్వరగా పనులు చేయాలని మంత్రులు ఆదేశించారు. విమానయానరంగ అభివృద్ధి కోసం కేటాయించాల్సిన నిధులపై ఆర్ అండ్ బీ రూపొందించిన సమగ్ర ప్రణాళికపై చర్చించారు.

Maheshwaram Mahendra Chary

TwittereMail
మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.
Whats_app_banner

సంబంధిత కథనం