Revanth Reddy: న్యాయ వ్యవస్థపై గౌరవం ఉంది.. బేషరతుగా పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నా: రేవంత్
Revanth Reddy: సుప్రీంకోర్టు ధర్మాసనం చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ సీఎం రేవంత్ స్పందించారు. తాను విచారం వ్యక్తం చేస్తున్నానని స్పష్టం చేశారు. తన వ్యాఖ్యలు న్యాయ వ్యవస్థను ప్రశ్నించినట్టు ఆపాదించారని ట్వీట్ చేశారు. పత్రికల్లో వచ్చిన వార్తలపై బేషరతుగా విచారం వ్యక్తం చేస్తున్నట్లు పోస్టు చేశారు.
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఎమ్మెల్సీ కవితకు బెయిల్ వచ్చింది. దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై జస్టిస్ కేవీ విశ్వనాథన్, జస్టిస్ బీఆర్ గవాయి సీరియస్ అయ్యారు. 'ముఖ్యమంత్రి ప్రకటనలను పత్రికల్లో చదివాం. బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి చేయాల్సిన వ్యాఖ్యలేనా? మేం రాజకీయ పార్టీలను సంప్రదించి.. రాజకీయ అంశాల ఆధారంగా ఉత్తర్వులు ఇస్తామ ? మేం రాజకీయపార్టీల గురించి.. మా ఉత్తర్వులపై చేసే విమర్శల గురించి పట్టించుకోబోం. ప్రమాణం ప్రకారం విధులు నిర్వర్తిస్తాం. కొందరు వ్యక్తుల దృక్పథం వారి తెంపరితనాన్ని ప్రతిబింబిస్తోంది' అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
బేషరతుగా పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నా..
ధర్మాసనం వ్యాఖ్యలపై తాజాగా రేవంత్ రెడ్డి స్పందించారు. 'భారత న్యాయ వ్యవస్థపై నాకు గౌరవం, విశ్వాసం ఉంది. ఆగస్టు 29వ తేదీన వచ్చిన కొన్ని పత్రికా కథనాలు.. న్యాయస్థానం విజ్ఞతను నేను ప్రశ్నిస్తున్నాననే భావనను కలిగించాయని నేను అర్థం చేసుకున్నాను. న్యాయ ప్రక్రియను నేను నమ్ముతానని పునరుద్ఘాటిస్తున్నాను. పత్రికా కథనాల్లో వచ్చిన వ్యాఖ్యలకు బేషరతుగా పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నాను. నేను చేసిన వ్యాఖ్యలను సందర్భోచితంగా తీసుకున్నారు. న్యాయ వ్యవస్థ స్వతంత్రత పట్ల నాకు గౌరవం ఉంది. భారత రాజ్యాంగాన్ని, నైతికతను దృఢంగా విశ్వసించే వ్యక్తిని' అని రేవంత్ రెడ్డి పోస్టు చేశారు.
ఓటుకు నోటు కేసుపై విచారణ సందర్భంగా..
ఓటుకు నోటు కేసుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభావం చూపే అవకాశం ఉన్నందున.. ఆ కేసు విచారణను మధ్యప్రదేశ్‌కు బదిలీ చేయాలని.. మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర, జస్టిస్ కేవీ విశ్వనాథన్, జస్టిస్ బీఆర్ గవాయిలతో కూడిన ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. బదిలీ చేయడానికి ధర్మాసనం నిరాకరించింది. దీని కోసం స్పెషల్ ప్రాసిక్యూటర్‌ను నియమిస్తామని స్పష్టం చేసింది. మధ్యాహ్నం రెండు గంటలకు ఉత్తర్వులిస్తామని చెప్పి వాయిదా వేసింది. అనంతరం రేవంత్ రెడ్డిపై సుప్రీం ధర్మాసనం సీరియస్ అయ్యింది.